Suryaa.co.in

Political News

సంక్షేమ రాజ్య నిర్మాత ఎన్ టి ఆర్

ఆంధ్రుల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారు ఆత్మగౌరవ పరిరక్షణ,అభివృద్ధి సాధన,అవినీతి,పేదరిక నిర్మూలనే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీని స్థాపించారు.తెలుగు నాట సంక్షేమ పధకాల యుగం ప్రారంభమైంది తెలుగుదేశం ఆవిర్భావంతోనే అని చెప్పాలి. పదవుల కోసం ఏర్పడిన పార్టీ కాదు, పేద ప్రజల అభ్యున్నతి కోసం అని గొప్పగా చాటిన వ్యక్తి ఎన్ టి ఆర్.సమాజమే దేవాలయం.ప్రజలే దేవుళ్లని నినదించిన మానవతా వాది .త్రికరణశుద్దిగా ఆచరించిన ధన్యజీవి ఆయన.

నిరుపేదలను ఆదుకోవడానికి అవసరమైన సంక్షేమ పధకాలను నాలుగు దశాబ్దాల క్రితమే అమలు చేసి చూపించారు ఎన్ టి ఆర్. స్వాతంత్ర భారత దేశ చరిత్రలో పెద వాడి సంక్షేమం గురించి ఆలోచించిన తొలి రాజకీయ నాయకుడు ఆయన.ఆ రోజు ఎన్ టి ఆర్ ప్రవేశ పెట్టిన కిలో రెండు రూపాయల బియ్యం పధకం నేడు ఆహార భద్రత పధకం దేశమంతా అమలు అవుతుంది.ముందు చూపుతో ఎన్ టీఆర్ ప్రవేశ పెట్టిన ఆహార భద్రత పుడ్ సెక్యూరిటీ గురించి ప్రపంచ దేశాలన్నీ మాట్లాడటం గమనార్హం అని చెప్పాలి.

ఇప్పుడు అమలు అవుతున్నఉపాది హామీ పధకాన్ని1984 మార్చి2న అసెంబ్లీలో ఉపాధి హామీ పధకం అమలు చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాని పంపించారు ఎన్ టీఆర్. పార్టీ పెట్టిన సందర్భంలో కొందరు మీ సిద్దాంతం ఏమిటని అడిగినప్పుడు పేదవాడికి పట్టెడన్నం పెట్టడం,నిలువనీడ కల్పించడం,ఒంటి నిండా బట్టకప్పుకొని ఆత్మగౌరవంతో జీవించే పరిస్తితి కల్పించడం అన్నారు ఆయన .

1983లో ఎన్ టి ఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే చేపట్టిన పధకాలను పరిశీలిస్తే ప్రతి పధకంలో మానవతా దృక్పదం కనిపిస్తుంది. పేదవారికీ ఎన్నోసంక్షేమ పధకాలను సృష్టించి సంక్షేమ రాజ్య నిర్మాతగా నిలిచారు ఎన్ టి ఆర్. మొట్ట మొదటి సారి ఆదరణ లేని 65 ఏళ్ళు నిండిన పేద వృద్దులకు నెలకు రూ 30 పింఛను పధకాన్ని ప్రవేశ పెట్టారు.

ఆనాడు ఏటా 2,27 లక్షల మందికి సాయం అందించారు. అనాధ వితంతు మహిళలకు,రూ 50 రూపాయలు పింఛను పధకం అమలు చేసీ అప్పట్లో 55 వేల మందికి ప్రతినెలా ఇచ్చారు. 60 ఏళ్లు నిండిన 5.64 లక్షల వృద్ధ వ్యవసాయ కార్మికులకు నెలకు రూ30 పింఛను పధకం అమలు చేశారు ఎన్ టీఆర్. ఆకలి తో అలమటిస్తున్న పెద ప్రజలకు కిలో రూ 2లకే 25 కిలోల బియ్యం అందించి పేదల కడుపు నింపిన కరుణామయుడు ఎన్ టి ఆర్.

ఆంధ్రప్రదేశ్ లో కోటి 43 లక్షమంది కుటుంబాలకు సబ్సిడీ బియ్యం ద్వారా లబ్ది చేకూరింది.ఏడాదికి 18 లక్షల టన్నులు బియ్యాన్ని పేదలకు పంపిణి చేసింది ప్రభుత్వం. నీడలేని నిరు పేదలకు లక్షలాది పక్కాఇళ్ళునిర్మించడం,కట్టుకోవడానికి బట్టలు లేని నిర్భాగ్యులకు సగం ధరకే జనతా వస్త్రాలు చీరలు ,ధోవతులు అందించిన మానవతావాదిఎన్టీఆర్. ఆర్ధికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సబ్సిడీ బియ్యం పధకాన్నిమానవతా దృక్పదంతో అమలు పేదల కడుపు నింపిన కరుణామయుడు. సంస్కరణలు చేపట్టి ప్రజల వద్దకు పాలన తెచ్చిన నాయకుడు.

రైతులకు రూ.50 కే హార్స్‌ పవర్‌ విద్యుత్‌, రైతుల రుణాలు రూ.11 వేల కోట్లు మాఫీ చేయించారు.దేవుడిచ్చిన భూమికి పన్నేమిటి రైతన్నా అంటూ భూమిశిస్తు రద్దు చేశారు. బడుగు, బలహీన వర్గాలకు రాజకీయ సాధికారత కల్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసిలకు, మహిళలకు రిజర్వేషన్లు-పాలనా సంస్కరణలు చేపట్టారు. మాండలిక వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకే పాలన తెచ్చారు. సింగిల్‌ విండో సిస్టమ్‌ తెచ్చారు, సహకార రంగంసాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం (ఎస్సారెస్పీ ఆధునీకరణ, అనేక ఎత్తిపోతల పథకాలు..) డ్రింకింగ్‌ వాటర్‌ స్కీమ్‌లు. చంద్రబాబు హయాంలో.. డ్వాక్రా మహిళా సంఘాల ఏర్పాటు- ఎ 1982 లో వెనుకబడిన వర్గాల అండతోనే తెలుగుదేశం ఆవిర్భవించింది.

ఆ వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా ప్రభుత్వ విధానాలలో బీసీలకు ప్రయోజనాలు కలించారు. సమాజంలో 50 శాతంగా వున్న వెనుక బడిన వర్గాలను ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ,మహిళలను సామాజికంగా,ఆర్ధికంగా ఆదుకోవాలన్న సంకల్పంతో ఎన్టీఆర్ 1987 లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు,మహిళలకు 9 శాతం రిజర్వేషన్లు కల్పించారు.

అంతేకాకుండా అప్పటివరకు 14శాతంగా వున్న ఎస్సీ రిజర్వేషన్లను 15 శాతానికి,4 శాతంగా వున్న ఎస్టీ రిజర్వేషన్లను 6 శాతానికి పెంచారు ఎన్టీఆర్. స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతులకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా వెనుకబడిన కులాలు వారు రాజకీయాల్లో బలమైన నాయకులుగా ఎదిగారు.ఆనాడు రాజకీయాలు అంటే ఆగ్రాకుల ఏక చత్రాదిపత్యానికి ,బడుగు బలహీన వర్గాల అణచివేతకు నిదర్శనంగా వుండేది.సమాజంలో అనాదిగా వేళ్లూనుకు పోయిన సామాజిక రుగ్మతలను తొలగించడానికి ప్రయత్నించిన మహామనిషి ఎన్ టీఆర్ .రాష్ట్రంలో రాజకీయ,ఆర్ధిక,సామాజిక విప్లవం మొదలైంది.రాజకీయాల్లో విలువలకు అంకురార్పణ జరిగింది.వెనుక బడిన ప్రాంతాల అభివృద్దికి చిత్తశుద్దితో కృషి చేసి ఫలితాలు సాధించిన పార్టీ తెలుగుదేశం.

సమాజాన్ని పట్టిపీడిస్తున్న దురవస్థలను రద్దు చేసి విప్లవాత్మక విధానాలను పరిపాలన రంగంలో పాదు కోలిపి యావత్ భారతదేశంలోనే అనితర సాధ్యమైన చరిత్ర సృష్టించారు ఆయన.ప్రజా ప్రయోజనాల కొరకు చేపట్టిన సంస్కరణల పట్ల ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎక్కడా వెనకడుగు వెయ్యకుండా సంస్కరణలు చిత్తశుద్ధితో అమలు చేశారు.గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న అస్తవ్యస్త విధానాలు,దయనీయ పరిస్థితులు సరిదిద్దేoదుకు పాలన వ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.ప్రభుత్వ సేవలు గ్రామీణ ప్రాంతాల్లోని సామాన్యులకు,పేదలకు అందుబాటులో లేవన్న వాస్తవాన్ని గుర్తించారు.

ప్రజలకు,ప్రభుత్వానికి మధ్య దళారీ వ్యవస్థ వేళ్ళును కొన్నదన్ననిజాన్ని గుర్తించారు ఎన్ టి ఆర్.బ్రిటీష్ వార సత్వoగా సంక్రమించిన అనేక జాడ్యాలు పాలనా వ్యవస్థలో పెనవేసుకున్న విషయాన్ని గ్రహించి ప్రభుత్వ సేవలు పారదర్శకంగా, వేగంగా, నాణ్యతతో సామాన్యులకు అందించాలని వాటిని కూకటి వేళ్లతో పెకిలించి వేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పాతుకు పోయి ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్న పెత్తం దారీ వ్యవస్థను పెకిలించివేశారు.పటేల్‌, పట్వారీ వ్యవస్థను నిర్మూలించి తెలంగాణ ప్రజలకు నిజమైన స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కల్పించారు.

ఆంధ్రప్రదేశ్ లో [కరణం,మునుసుబు], తెలంగాణలో పటేల్,పట్వారీ వ్యవస్థను రద్దు చేసారు.అవి రాజకీయంగా పలుకుబడి కలిగిన వ్యవస్థ అని వాటి జోలికి వెళ్లవద్దని కొందరు చేసిన హెచ్చరికలను పట్టించుకోలేదు ఎన్ టి ఆర్. బ్రిటీష్ పెత్తందారీ వ్యవస్థకు వారసత్వoగా వున్న తహసీల్దార్ వ్యవస్థను రద్దు చేశారు.గ్రామ స్థాయి వ్యవస్థను రద్దు చెయ్యడంతో ఎన్ టి ఆర్ తృప్తీ చెందలేదు.పరిపాలన గ్రామ స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించారు.

అధికార వికేంద్రీకరణ తో ప్రజాస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసేందుకు మండలి వ్యవస్థకు నాంది పలికి ప్రజల వద్దకే ప్రభుత్వాన్ని నడిపించి గ్రామ స్వరాజ్యానికి పునాది వేశారు. మండల యూనిట్ గా గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి పరచడానికి మాండలిక వ్యవస్థను ప్రవేశ పెట్టడం ఒక చారిత్రాత్మక నిర్ణయం. 330 తాలూకాలను రద్దు చేసి 1104 మండలాలుగా విభజించారు. 35వెల నుండి 60 వేలమంది ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాలు అందుబాటులో వుండే విధంగా చర్యలు తీసుకొన్నారు.

అధికారులను,ప్రజా ప్రతినిధులను ప్రజల వద్దకు పంపించి ప్రజల సమస్యల పై అర్జీలు స్వీకరించి వారి సమస్యలు పరిష్కరించేందుకు ప్రజలవద్దకు పరిపాలన చేర్చిన ఘనత ఎన్ టి ఆర్ దే. స్థానిక సంస్థలకు మూడంచల విధానం ద్వారా పంచాయితీ రాజ్ ,స్థానిక సంస్థలకు ప్రత్యక్షంగా ఎన్నికలు నిర్వహించడం వంటివి ఎన్టీఆర్ సంస్కరణ ల విజయాలే.పరిపాలనలో పారదర్శకతకు,స్వచ్చతకు పెద్ద పీట వేశారు.ప్రజలకు ఎంత మాత్రం ప్రయోజన కారిగా లేని శాసన మండలిని రద్దు చెయ్యడం కూడా సాహసోపేతమైన నిర్ణయమే.

జాతీయ భావాలున్న ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం. తెలుగునాట విలక్షణ రాజకీయ వ్యవస్థగా ఏర్పడి అధికారంలో వున్నా,లేకున్నా ప్రజల పక్షాన తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న భాధ్యత గురుతరమైనది. దేశ రాజకీయ చరిత్రలో ఎందరో రాజకీయ నాయకులు తెరమరుగై పోయ్యారు.కానీ ఎన్టీఆర్ రాజకీయాల్లో మేరునగ శిఖరంలా ఈ నాటికి కనపడటానికి కారణం ఆయనకు వున్న ప్రజల పట్ల అంకిత భావం,పట్టుదల,మొక్కఓని స్థైర్యం,నిష్కలంక రాజకీయం అని చెప్పక తప్పదు. రాష్ట్రాలలో గవర్నర్ల పాత్రపై ఆయన జాతీయ స్థాయిలో చర్చజరిగే విధంగా గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలని కోరారు.

నిధులు కోసం పదే,పదే డిల్లీ వెళ్ళి దేబిరించాల్సిన దుస్థితి పట్టింది అని రాష్ట్రాలకు అందవలసిన న్యాయమైన హక్కులను,నిధులను హరించే అధికారం కేంద్రానికి లేదని ఆయన చేసిన వ్యాఖ్యలు,విమర్శలు దేశ వ్యాప్త చర్చకు దారితీసాయి.ఆ విధంగా కేంద్రాన్ని నిలదీసిన కారణంగానే కేంద్రం-రాష్ట్రాల మధ్య సంభందాలను,ఆదాయ వాటాలను పునఃపరిశీలించడానికి సర్కారియా కమీషన్ ఏర్పాటు అయింది.

ఎన్ టి ఆర్ చూపిన చొరవ కారణంగానే ఆ తరువాత కాలంలో రాష్ట్రాలకు కేంద్రం నుండి మరిన్ని అధికారాలు దక్కడానికి దోహద పడ్డాయి. ఎవరు ఏమన్నా చిత్తశుద్ది,నిబద్దత,నిజాయితీ,వంటి సంకల్పాలతో దీక్ష బూని అమూల్యమైన ఆశయాలను తెలుగు జాతికి అందించి కీర్తి కిరణమైన దివ్యమూర్తి ఎన్టీఆర్.అందుకే ఎన్టీఆర్ కు సరిలేరు ఎవ్వరూ ,అందుకే ఆయనకు ఘనంగా నివాళులు అర్పిద్దాం. ఆయన కీర్తి అజరామరం.ఆ మహానుభావుడికి భారతరత్న ఇవ్వాలని యావత్ తెలుగు ప్రజల అందరి తరపున కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దాం.

నీరుకొండ ప్రసాద్,
సీనియర్ జర్నలిస్ట్,
9849625610

LEAVE A RESPONSE