– ఎన్టీఆర్ లిటరేచర్, గ్లోబల్ నెట్ వర్క్ చైర్మన్ టి.డి. జనార్థన్ టి.డి. జనార్థన్
– అక్లాండ్ లో వేడుకగా జరిగిన ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు
ఎన్నారై తెలుగు దేశం పార్టీ, అక్లాండ్ తెలుగు అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో న్యూజిలాండ్ రాజధాని అక్లాండ్ లో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు స్థానిక తెలుగు కుటుంబాల మధ్య కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్ లిటరేచర్ మరియు గ్లోబల్ నెట్ వర్క్ చైర్మన్ టి.డి. జనార్థన్, వైస్ చైర్మన్ అశ్విన్ అట్లూరి, శాసన సభ్యులు బోడే ప్రసాద్ మరియు ఆత్మీయ అతిథిగా నందమూరి రామకృష్ణ పాల్గొన్నారు.
దీపప్రజ్వలన కార్యక్రమం అనంతరం ‘తారకరామం’, ‘స్వర్ణాంధ్ర సారధి నారాచంద్రబాబు నాయుడు అసెంబ్లీ ప్రసంగాలు’ రెండు పత్రుల ఆవిష్కరణ జరిగింది.
ఆత్మీయ అతిథి నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ, సప్తసముద్రాలు దాటి వచ్చి ఇక్కడ తెలుగు వారి సమక్షంలో అన్న ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకను జరుపుకోవడం అపూర్వమని కొనియాడారు. ఆయన తన ప్రసంగంలో ఎన్టీఆర్ సినీ, రాజకీయ జీవితాల్లోని ముఖ్యవిశేషాలను ప్రస్తావించారు.
ఈ సందర్భంగా ఆయన ఎన్టీఆర్ కు తొలుత సినిమాల్లో అవకాశం కల్పించిన కృష్ణవేణమ్మ కి ఘనంగా నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ ధరించిన పాత్రల ప్రభావం ఆయన వ్యక్తిత్వంపై వుండేదని పేర్కొన్నారు. చైనా యుద్ధం, రాయలసీమ కరువు, దివిసీమ తుఫాను మొదలైన విపత్తులు సంభవించినప్పుడు తోటి కళాకారులతో కలసి నాటకాలు ప్రదర్శించి, జోలెపట్టి విరాళాలు సేకరించి ఆపన్నులను ఆదుకున్నారని, దేశాభిమానాన్ని చాటిచెప్పారని పెర్కొన్నారు.
రాజకీయాలలోకి వచ్చి కర్షక, కార్మిక, మహిళ పక్షపాతిగా అనేక విప్లవాత్మక పథకాలు పెట్టారని గుర్తుచేశారు. తిరుమల తిరుపతిలో మొట్టమొదటిసారి అన్నదాన పథకం మొదలు పెట్టింది ఎన్టీఆరేనని, ఆయన కుమారుడిగా పుట్టడం తన పూర్వజన్మ సకృతంగా పేర్కొన్నారు. తనను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి అవకాశం కల్పించిన నిర్వాహకులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
భావితరాలకు ఎన్టీఆర్ చరిత్ర, ఔన్నత్యం తెలియజేయడమే మా లక్ష్యం – టి.డి. జనార్థన్
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎన్టీఆర్ లిటరేచర్, గ్లోబల్ నెట్ వర్క్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు టి.డి. జనార్థన్ మాట్లాడుతూ తాను ప్రపంచ వ్యాప్తంగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను, సినీ వజ్రోత్సవ వేడుకలను నిర్వహిస్తూ… ఏవిధంగా ఎన్టీఆర్ సినీ, రాజకీయ, సాంఘిక జీవితాల ప్రాధాన్యతను, ఔన్నత్యాన్ని అందరికీ తెలియజేస్తున్నదీ వివరించారు.
ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకొని 2023లో విజయవాడలో, హైదరాబాద్ లో సినీ, రాజకీయ ప్రముఖుల్ని జాతీయస్థాయి నాయకుల్ని పిలిచి ఘనంగా వేడుకలను నిర్వహించిన తీరుతెన్నులను వివరించారు. దేశంలో ఏ నాయకుడికి జరగని విధంగా శతజయంతి ఉత్సవాలు ఎన్టీఆర్ కి జరిగిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ కార్యక్రమాల్ని తాము చేయటంలో నారా చంద్రబాబునాయుడు , నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్ ల సంపూర్ణ సహకారం ఉందని పేర్కొన్నారు.
కాగా, భారత ఇతి హాసాలైన రామాయణం, మహాభారతం ఏవిధంగానైతే ప్రజల జీవితాల్ని ప్రభావితం చేస్తున్నాయో, ఎన్టీఆర్ సినీ, రాజకీయ జీవితం వర్తమాన, భావితరాలకు ఆవిధంగానే ఆదర్శప్రాయంగా, మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. ఎన్టీఆర్ ఏడాదికి 10 చిత్రాలు… అది కూడా విభిన్న జోనర్ లలో భిన్నమైన సాంఘిక, చారిత్రక, పౌరాణిక పాత్రలు ధరించి వైవిధ్యత చూపారని, అది ప్రపంచంలో ఏ ఒక్క నటుడికి సాధ్యం కాలేదని చెప్పారు. అందువల్లనే ఎన్టీఆర్ కు ఎన్టీఆరే సాటి అని, ఆయనొక భగవత్ స్వరూపుడని పేర్కొన్నారు.
ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు తన వృత్తిని వదిలి వారికి సాయం చేయడానికి కదిలారని, అందుకు గాను విజయావారు తన కాంట్రాక్టును తీసివేసినా… ప్రజలే నాకు ముఖ్యం అని సొంతంగా సినీ బ్యానర్ ఎన్ఏటి సంస్థ ఏర్పాటు చేసి సొంతంగా సినిమాలు తీశారని గుర్తుచేశారు.
ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో మహోజ్జ్వల ఘట్టాలు అనేకం ఉన్నాయని… పేదవాడికి కనీసావసారాలైన కూడు, నీడ, గుడ్డ అందించారని, దేశంలోనే తొలిసారి సంక్షేమ పింఛన్లు అందించారని చెప్పారు.
తనలాంటి యువకుల్ని రాజకీయాల్లోకి ప్రోత్సహించి రాజకీయాల్లో యువరక్తం ఎక్కించారని, నీతి నిజాయితీలకు పెద్దపీట వేశారన్నారు. మహిళలకు, బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించిన విషయాలు గుర్తుచేశారు.
ఎన్టీఆర్ సినీ, రాజకీయ రంగాలలో చేసిన కృషిని, సాధించిన విజయాలనూ, చరిత్రగతిని మార్చిన తీరుతెన్నులను అందరికీ తెలియజెప్పె ఉద్దేశంతో ఇప్పటికే ఎన్టీఆర్ జీవితానికి సంబంధించిన పలు గ్రంథాలు వెలువరించామని, రాబోయే కాలంలో మరి కొన్ని పుస్తకాలు తీసుకొస్తామన్నారు.
అన్న ఎన్టీఆర్ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి అన్న ఎన్టీఆర్ తో సాన్నిహిత్యం గలిగిన అన్ని రంగాల ప్రముఖుల ఇంటర్వ్యూలు, అభిప్రాయాలు అందిస్తున్నామని, వాటిని అందరూ వీక్షించాలని కోరారు.
ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులకు, స్థానిక తెలుగు కుటుంబాలకు టి.డి. జనార్థన్, నందమూరి రామకృష్ణలు శాలువాలు కప్పి సత్కరించారు. స్థానిక కళాకారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ అలరించాయి. అన్న ఎన్టీఆర్ స్ఫూర్తి… ప్రవాస తెలుగు వారందరిలో ప్రస్ఫుటంగా కనిపించిందని నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు.