(భూమా బాబు)
మళ్లీ ఆంధ్రా జీవనాడిపై ఆశలు మొలకెత్తాయి!
గుండె లోతుల్లోంచి ఉబికి వచ్చే ఆశ, ఆంధ్రా ప్రజల నరనరాల్లో జీర్ణించుకుపోయిన స్వప్నం… పోలవరం! దశాబ్దాల కల, తరతరాల ఆకాంక్ష. గోదావరి పరవళ్లు రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలన్న తపన. ఆ తపన సాకారం కావడానికి అడుగులు పడుతున్నాయి. ఎత్తు పల్లాలను, ఒడిదుడుకులను దాటుకుంటూ, నిలకడలేని ప్రయాణాన్ని అధిగమించి, మళ్లీ ఆశల పతాక ఎగురుతోంది.
గత ఐదేళ్లుగా పోలవరం మీద ఆశలు సన్నగిల్లిన మాట వాస్తవం. “అర పర్సెంటా.. ఒక పర్సెంటా కాదు, పోలవరం జూన్ 2021కి పూర్తి”, “ఖరీఫ్‌కు కల సాకారం”, “జర్నలిస్టులకు బట్టలు పెడుతున్నాం” అంటూ ఎన్నో ప్రకటనలు… కానీ వాస్తవానికి చేసింది కేవలం 4% పనులు మాత్రమే. నాలుగు స్టేట్‌మెంట్లు, 4% పనులు… ఇది కేవలం నిరాశ మాత్రమే కాదు, గుండెకు గాయం చేస్తూ గోదాట్లో ముంచి కుళ్లబెట్టారు.
మళ్లీ చిగురించిన ఆశ!
కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. కేవలం ఒక్క ఏడాదిలోనే, నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో 10% పనులు పూర్తి కావడం ఒక అద్భుతం. నిన్నటి నిరాశను చెరిపేస్తూ, రేపటి ఆశలకు ప్రాణం పోసిన ఈ వేగం నిజంగా ప్రశంసనీయం. ఇది కేవలం పనుల పురోగతి కాదు, ఆంధ్రా ప్రజల గుండెల్లో మళ్లీ ఆశల దీపాన్ని వెలిగించిన సంకల్పం!
ప్రస్తుతం పోలవరం పనులు మూడు ప్రధాన విభాగాల్లో వేగంగా జరుగుతున్నాయి.
1. స్పిల్‌వే నిర్మాణం: గోదావరి పరుగుకు కొత్త దారి
పోలవరం గుండె వంటిది స్పిల్‌వే నిర్మాణం. గోదావరి ఉధృతిని తట్టుకుని, 50 లక్షల క్యూసెక్కుల నీటిని సురక్షితంగా మళ్లించే సామర్థ్యం దీని సొంతం. ఇది ప్రపంచంలోనే అత్యధిక డిశ్చార్జ్ కెపాసిటీ కలిగిన స్పిల్‌వేలలో ఒకటిగా నిలవడం మనందరికీ గర్వకారణం. ఇప్పటికే స్పిల్‌వే నిర్మాణం పూర్తి కావడం, నీటి మళ్లింపు కోసం కాఫర్‌డ్యామ్‌లు (ఎగువ, దిగువ) నిర్మించడం పెద్ద విజయం.
2. హైడ్రోఎలెక్ట్రిక్ విద్యుత్ కేంద్రం: వెలుగుల వెల్లువకు బాటలు
960 MW సామర్థ్యం కలిగిన హైడ్రోఎలెక్ట్రిక్ విద్యుత్ కేంద్రం నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. వెయ్యి మందికి పైగా కార్మికులు రాత్రింబవళ్లు శ్రమిస్తూ, 12 యూనిట్ల (ఒక్కొక్కటి 80 MW) నిర్మాణంలో నిమగ్నమై ఉన్నారు. ఇది కేవలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రం మాత్రమే కాదు, రాష్ట్ర భవిష్యత్తుకు వెలుగులు పంచే ఆశాజ్యోతి. దీని పురోగతి డయాఫ్రమ్ వాల్, ECRF డ్యామ్ పనులపై ఆధారపడి ఉంటుంది కాబట్టి, ఇతర నిర్మాణాలతో సమన్వయం చేసుకుంటూ పనులు సాగుతున్నాయి.
3. ECRF డ్యామ్ మరియు డయాఫ్రమ్ వాల్: ప్రాజెక్టుకు వెన్నెముక
డయాఫ్రమ్ వాల్ అనేది ఈ ప్రాజెక్టుకు వెన్నెముక. 2018-19లోనే ఈ నిర్మాణం పూర్తయినప్పటికీ, కాంట్రాక్టర్ను మార్చాలని చేసిన ఆలస్యంతో 2019, 2020లో వచ్చిన గోదావరి వరదల కారణంగా రెండు చోట్ల దెబ్బతింది. పోలవరం ప్రాజెక్టు మాకు అర్థం అయితే కదా అని మంత్రి అంబటి అన్న మాటతో జనం దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఇది ఒక సాంకేతిక సవాలు. పాత వాల్‌ను రిపేర్ చేయాలా లేక కొత్తది నిర్మించాలా అనే చర్చలో, నిపుణులు కొత్త డయాఫ్రమ్ వాల్‌కే మొగ్గు చూపారు. ₹990 కోట్లతో జర్మన్ కంపెనీ బాయర్ గ్రూప్ చేత కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఇప్పటికే మొదలైంది. ఇది 2025 డిసెంబర్ లేదా 2026 మార్చి నాటికి పూర్తవుతుందని అంచనా.
ఈ డయాఫ్రమ్ వాల్ పూర్తి కాగానే, ఎర్త్-కమ్-రాక్‌ఫిల్ (ECRF) డ్యామ్ నిర్మాణం వేగవంతం అవుతుంది. ECRF డ్యామ్ పనులు ఇప్పటికే డయాఫ్రమ్ వాల్‌తో సమాంతరంగా మొదలయ్యాయి. బయటి నుంచి పెద్దగా కనిపించకపోయినా, భూగర్భంలో యంత్రాలతో జరిగే ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం అత్యంత కీలకమైన దశ.
ఇది పూర్తయితేనే ప్రధాన డ్యామ్ నిర్మాణం వేగవంతమై, ప్రాజెక్టు పనులు ప్రజలందరికీ స్పష్టంగా కనిపిస్తాయి. గ్యాప్-1 మరియు గ్యాప్-2 పనులు కూడా వచ్చే ఏడాది మార్చి, నవంబర్‌లో ప్రారంభం కానున్నాయి.
మొత్తానికి, సాంకేతిక, రాజకీయ సవాళ్లను అధిగమించి, పోలవరం 2027 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు శరవేగంగా సాగుతున్నాయి.
ఈ వేగం, ఈ సంకల్పం చూస్తుంటే, ఆంధ్రుల చిరకాల స్వప్నం త్వరలోనే సాకారం కాబోతోందనిపిస్తోంది. గోదావరి జలాలు ఆంధ్రా నేల మీద పారబోయే రోజు ఎంతో దూరంలో లేదని, ఆ రోజు మనం సగర్వంగా తలెత్తుకుని నిలబడతామని మనస్ఫూర్తిగా నమ్ముదాం.
ఈ వేగం ఇలాగే కొనసాగితే, పోలవరం ఆంధ్రులకు నిజంగానే జీవనాడి అవుతుంది కదా? మీరేమంటారు?