– ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో అవినీతి త్రిమూర్తులు
– మంత్రి పేరుతో వసూళ్ల పర్వం
అది జనారోగ్యశాఖ. జనాల రోగం కుదిర్చే శాఖ. కానీ అలాంటి శాఖకే అవినీతిరోగమొచ్చిందని సోషల్‌మీడియా కోడై కూస్తోంది. ఆ శాఖను ఏళ్ల తరబడి పట్టుకుని.. విడవకుండా వేళ్లాడుతున్న అవినీతి గ బ్బిలాలతో, ఆరోగ్య శాఖ గబ్బుపట్టిపోతోంది. అసలు ఆరోగ్య శాఖ అంటేనే ‘కనిపించని నాలుగో సింహం’లా ఊడలంటిన అవినీతి. పైకి కనిపించని అవినీతి చెదలకు లెక్కలేదు. లోతుకు వెళ్లి తవ్వితే తప్ప, అసలు నిజాలేమిటో తెలియని శాఖ. అంటే తవ్వితే తవ్వుకున్నంత అవినీతి కథలన్నమాట! ఇప్పుడు కొత్తగా తెరవెనక జరిగిన ప్రత్యేక జీఓల కథ దానికి అదనం. ఆ ‘నర్శింహా’వతారం కథ మరో ముచ్చట. దాని ముచ్చటపై త్వరలో మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆరోగ్యశాఖకు అనారోగ్యంగా పరిణమించిన ‘ఆ ముగ్గురి’ కథపై సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్న కథేమిటో చూద్దాం.
సోషల్‌మీడియాలో జరుగుతున్న ప్రచారం యధావిథిగా…
వైద్య ఆరోగ్య శాఖను ఆ ముగ్గురు కీలక అధికారులు శాసిస్తున్నారు. ఏళ్ల తరబడి ఫోకల్ పోస్టుల్లో తిష్ట వేసుకొని వైద్య ఆరోగ్య శాఖను భ్రష్టు పట్టించారు. ప్రభుత్వం ఏదైనా వైద్య ఆరోగ్యశాఖలోని వ్యవహారాలన్నీ ఈ ముగ్గురి కనుసన్నల్లో కొనసాగాల్సిందే.
ఏడాదికి మూడు వేల కోట్ల పైగా బడ్జెట్ కలిగిన వైద్య ఆరోగ్య శాఖలో ఈ ముగ్గురి అవినీతి లీలలు అన్నీ, ఇన్నీ కావు. ఉద్యోగుల బదిలీల మొదలు, వివిధ పనుల టెండర్ల ప్రక్రియ వరకు ప్రతిదానికి ఒక రేటు ఫిక్స్ చేసి అడ్డగోలు వసూళ్లకు పాల్పడుతూ కోట్లాది రూపాయలు దండుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుత బదిలీల్లో ఉద్యోగుల పోస్టింగులకు వసూళ్ల దుకాణం తెరిచినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ రూటే సప‘రేటు’
వైద్య ఆరోగ్య శాఖలో ఇతని పేరు చెబితేనే క్రింది స్థాయి ఉద్యోగులంతా ఉలిక్కిపడతారు. ఆ శాఖలో ఇతనికి అవినీతి అనకొండ గా పేరు.. 13 ఏళ్లుగా డి ఎం ఈ, ఎంహెచ్ఎంలో కీలకమైన ఫోకల్ పోస్టుల్లో కొనసాగుతూ కోట్ల రూపాయలు కొల్లగొట్టాడన్న ఆరోపణలు ఉన్నాయి. వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏసీబీకి పట్టుబడి జైలుకు కూడా వెళ్ళాడు. రెండేళ్లపాటు సస్పెన్షన్ లో ఉన్నాడు.
2014 2019 మధ్య ఆనాటి కూటమి ప్రభుత్వ హయాంలో 108 104 టెండర్ల గోల్మాల్ వ్యవహారంలో తిరిగి సస్పెండ్ అయ్యాడు. 2019 వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐఏఎస్ అధికారి జవహర్ రెడ్డి అండదండలతో, కేసులన్నీ మాఫీ చేసుకున్నాడు అన్న వార్తలు ఆ శాఖలోనే గుప్పుమంటున్నాయి.
కోవిడ్ సమయంలో అన్ని జిల్లాల్లో ఆసుపత్రిలో భోజనాలు పెట్టించే కార్యక్రమాన్ని అడ్డం పెట్టుకొని జవహర్ రెడ్డి కనుసన్నల్లో సుమారు గా 200 కోట్ల రూపాయలు దోచుకున్నాడు అన్న ఫిర్యాదులు రావటంతో, కొద్ది రోజులు ఉన్నతాధికారులు ఏం హెచ్ ఎం ఎస్ పి యం నుండి బదిలీ చేశారు. పైరవీలు చేయటంలో దిట్ట కావడంతో, తిరిగి కొద్ది రోజుల్లోనే డి ఎం ఈ డిడి గా పోస్టింగ్ తెచ్చుకున్నాడు. డిడిగా వచ్చిన నాటి నుంచి శానిటేషన్ సెంట్రలైజేషన్, ప్రొక్యూర్మెంట్ సెంట్రలైజేషన్, సెక్యూరిటీ సెంట్రలైజేషన్ ను తెరలేపి తన మాట వినే వ్యక్తులను తన క్రింది స్థాయి పోస్టుల్లోకి తెచ్చుకున్నాడు.
తద్వారా తన అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఇతని అవినీతిపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనమండలిలో లేవనెత్తారు. ప్రస్తుతం ప్రస్తుతం ట్రాన్స్ఫర్ ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో, బోధనాసుపత్రిలో ఐదేళ్ల కాలం పూర్తి చేసుకున్న వైద్యులకు బదిలీ ఉండబోతున్నాయని ముందుగా హడావుడి చేశాడు.
300 మంది వైద్యులతో కూడిన బదిలీ జాబితాను సిద్ధం చేశారు. దీంతో ఇప్పటికే ప్రభుత్వ వైద్యులు గా కొనసాగుతూనే, ఉన్నచోట ప్రవేటు ప్రాక్టీస్ చేస్తూ రెండు చేతుల సంపాదిస్తున్న వైద్యులు బదిలీ చేస్తే మరోచోటికి వెళ్లలేక ఎలాగైనా దీన్ని ఆపుకునేందుకు ఒక్కొక్కరు 5 లక్షల చొప్పున ముడుపులు ఈ అవినీతి అనకొండకు మొట్ట చెప్పినట్టు వార్తలు గుప్పు మంటున్నాయి. సుమారుగా 15 కోట్ల మొత్తాన్ని ట్రాన్స్ఫర్ల బూచి చూయించి వసూలు చేసినట్లు తెలుస్తోంది. వసుళ్ళ ప్రక్రియ పూర్తయిన మరుక్షణమే ఎంసీఐ గైడ్లైన్స్ ప్రకారం ట్రాన్స్ఫర్లు చేయకూడదని కొత్త వాదన తెరమీదకు తీసుకువచ్చి అప్పటివరకు ప్రకటించిన ట్రాన్స్ఫర్ల జాబితాను పక్కన పెట్టేశారు.
ఇప్పుడు ఈ వ్యవహారం వైద్య వర్గాల్లోనే హాట్ టాపిక్ గా మారింది.వసూలు చేసిన మొత్తంలో మంత్రి కి ముట్ట చెప్పాలని సదరు అధికారి చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది.
ఎన్ హెచ్ ఎం లో అవినీతి “లంబోదరుడు”
ఫోకల్ పోస్టులో 14 ఏళ్ల కాలంగా పనిచేస్తూ అత్యంత అవినీతిపరుడుగా ముద్రపడ్డాడు ఈ లంబోదరుడు. ఎన్ హెచ్ ఎం లో అవినీతికి కర్త, కర్మ, క్రియగా వ్యవహరిస్తున్నాడు. డైరెక్టుగా ఏ ఫైలు మీద ఇతను సంతకాలు చేయడు. తనకు అనుకూలమైన వ్యక్తులను క్రింది స్థాయిలో డాక్టర్లుగా, కన్సల్టెంట్ గా పెట్టుకొని వారి చేత సంతకాలు చేయించుకుంటూ అడ్డగోలుగా దోచుకుంటున్నాడు.
14 సంవత్సరాలుగా ఒకే సీటులో తిష్ట వేసుకుని కూర్చుని తనను కదిలించే వాళ్లే లేరని ప్రగల్బాలు పలుకుతున్నాడు. ఎన్ హెచ్ ఎం లో చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్ట్ కీలకమైనది. అయితే ఈ పోస్టులో ఏడేళ్ల పాటు రిటైర్ అయిన వ్యక్తిని కొనసాగించాడు. ఆ తరువాత మరో చిరుద్యోగిని ఆ పోస్టులో పెట్టాడు. పూర్తిస్థాయి చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ లేకుండానే ఇన్చార్జిగా తన కు అనుకూల మైనవారిని పెట్టుకొని వసూళ్లకు పాల్పడుతున్నాడు.
ఎన్ హెచ్ ఎం లో సుమారుగా 20వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల పోస్టింగులు, ట్రాన్స్ఫర్ లన్ని ఇతని కనుసన్నాల్లోనే కొనసాగాయి. ప్రస్తుతం ట్రాన్స్ఫర్ ల కోసం పెద్ద దుకాణాన్నే ఓపెన్ చేశాడు. తనకు ముడుపులు ముట్ట చెప్పిన వారిని నిబంధనలకు విరుద్ధంగా డిప్యూటేషన్ లపై ఎన్ హెచ్ ఎం లోకి తీసుకోవటం చేస్తున్నారు. .
విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ లో కూడా కమిషన్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టు భర్తీ చేయాల్సి ఉండగా , ఆ పోస్టు భర్తీ కాకుండా అడ్డుపడుతున్నారన్న ఆరోపణలు లేకపోలేదు.
ఇతని పరిధిలోనే ఏఎన్ఎంలు, హెల్త్ విజిటర్లు, సూపర్వైజర్లు ఇలా సుమారుగా 35 వేల మంది ఉద్యోగులు ఇతని కంట్రోల్ లోనే ఉంటారు. ప్రస్తుతం కొనసాగుతున్న బదిలీల ప్రక్రియలో అడ్డగోలుగా అందిన కాడికి పోస్టింగుల కోసం వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్ హెచ్ ఎం లో కన్సల్టెన్సీ వైద్యుల పోస్టులను అమ్ముకున్నాడు అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పనికి ఒక రేటు
పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఇతని పేరు చెబితేనే క్రింది స్థాయి ఉద్యోగులు వణికిపోతున్నారు. పచ్చ నోటు కనపడందే ఏ పని చేయడు. రోజుకు 5 లక్షల రూపాయలు కళ్ళ చూడందే రాత్రికి నిద్ర పట్టదు. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ను సర్వ నాశనం చేశాడన్న అపవాది కూడా ఇతని పైన ఉంది. గత వైసిపి ప్రభుత్వ హయాంలో చక్రం తప్పిన ఈయన ఘనకార్యాల గురించి ఎంత చెప్పినా తక్కువేనట!
టెండర్ల ప్రక్రియ వ్యవహారంలో తనకు నచ్చిన వారికి, అమ్యామ్యాలు ముట్ట చెప్పిన వారికి మాత్రమే టెండర్లు కట్టబెడతారన్న ఆరోపణలో ఉన్నాయి. కమిషన్లకు కక్కుర్తి పడి అడ్డమైన పనులు అడ్డగోలుగా చేస్తాడన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుత బదిలీల వ్యవహారంలో కూడా పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నాడన్నట్లు సొంత శాఖ సిబ్బందే చెప్పుకుంటున్నారు.
ప్రస్తుతం బదిలీలు జరుగుతున్న వేళ మరి ఈ ముగ్గురి పీఠాలు కదులుతాయా లేదా అన్నది, వైద్య,ఆరోగ్య శాఖలో చర్చనీ అంశంగా మారింది. ఈ ముగ్గురు త్రిమూర్తులు కూడబలుక్కొని నాన్ ఫోకల్ పోస్టులకు వెళ్లకుండా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన స్టేట్ హెడ్ క్వార్టర్ లోనే ఉంటూ ఏళ్ళ తరబడి ఫోకల్ పోస్టుల్లో తిష్ట వేసుకుని కూర్చున్నారు.
బదిలీలను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని చెప్తున్న కూటమి ప్రభుత్వం.. మరి ఏళ్ల తరబడి స్టేట్ హెడ్ క్వార్టర్ లో ఫోకల్ పోస్టుల్లో కొనసాగుతున్న ఈ ముగ్గురు త్రిమూర్తులను నాన్ లోకల్ పోస్టులకు బదిలీ చేస్తుందో లేకుంటే వారిచ్చే ముడుపులకు ఆశపడి యధాస్థానాల్లో కొనసాగిస్తుందో వేచి చూడాల్సిందే.
అయితే సోషల్‌మీడియాలో వచ్చిన ఈ కథనం హల్‌చల్ చేస్తున్న నేపథ్యంలో.. ఆ ముగ్గురినీ లక్ష్యంగా చేసుకున్నప్పటికీ.. మంత్రిని మాత్రం కీర్తించడంపై, అదే సోషల్‌మీడియా మాధ్యమాల్లో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు మంత్రి పేరుతో వసూళ్లు చేస్తున్నారని చెబుతూనే.. మరోవైపు మంత్రిని కీర్తించడం బట్టి.. ఈ కథనం ఆ ముగ్గురినీ పక్కనపెట్టేందుకు వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చిందా? వారి స్థానాల్లో తాము కోరుకున్న వారిని తెచ్చుకునే వ్యూహంలో చే స్తున్న ప్రచారమా? అన్న ప్రశ్నలు కూడా తెరపైకి రావడం ప్రస్తావ నార్హం.