Home » బీజేపీ ప్రచారానికి ఎన్టీఆర్, రాంచరణ్, ప్రభాస్

బీజేపీ ప్రచారానికి ఎన్టీఆర్, రాంచరణ్, ప్రభాస్

– తెలంగాణ ఎన్నికల ప్రచారంలో తారాతో‘రణం’
– బీజేపీ అభ్యర్ధుల ప్రచారంలో జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్, ప్రభాస్?
– గ్రేటర్‌లోనే ప్రచారంపైనే ప్రధాన దృష్టి
– ఖమ్మం ప్రచారంలో జూనియర్ ఎన్టీఆర్?
– ఉత్తర తెలంగాణలో రాంచరణ్ ప్రచారం?
– ‘గ్రేటర్’లో ప్రచారానికి ప్రభాస్?
– రాంచరణ్ ప్రచారంతో మున్నూరు-కాపులపై వల?
– కృష్ణంరాజు కుటుంబంతో బీజేపీ అనుబంధం
– గతంలో అమిత్‌షాతో వీరందరి భేటీ
– జూనియర్ ఎన్టీఆర్‌తో అమిత్‌షా చర్చ
– జూనియర్ ప్రచారంతో కమ్మ వర్గంపై వల?
– సినీ హీరోలతో సెటిలర్లపై బీజేపీ వల
– ఇప్పటికే బీజేపీ ప్రచారంలో సినీ నటి కవిత
– తమిళ-మళయాళ-కన్నడిగులతో కవిత ఆత్మీయ సమావేశాలు?
– వీరి ప్రచారంపై కమలం కసరత్తు
– పరిమిత ప్రచారమా? ప్రకటన రూపంలోనా?
– కమలానికి సినిమా కళ
( మార్తి సుబ్రహ్మణ్యం)

తెలంగాణ ఎన్నికల్లో తారాతోరణం సందడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా జాతీయ పార్టీ అయిన బీజేపీ కోసం, అగ్ర తారలు ప్రచారరంగంలో దిగనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. తెలంగాణలో పార్టీ పరిస్థితి దారుణంగా ఉందన్న వాస్తవంతోపాటు, క్షేత్రస్థాయి పరిస్థితులపై ఐబీతో నివేదికలు తెప్పించుకున్న బీజేపీ నాయకత్వం… ఆఖరి అస్త్రంగా తెలుగు సినిమా స్లార్లను, ప్రచారపర్వంలో దింపాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా పాన్ ఇండియా స్టార్లను ప్రచారబరిలో నిలపడం ద్వారా, విజయావకాశాలు పెంచుకోవాలన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. ఆ ప్రకారంగా జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్, ప్రభాస్‌లతో తెలంగాణలోని మూడు ప్రాంతాల్లో ప్రచారం చేయించాలని బీజేపీ నాయకత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ ముగ్గురితో, ఇప్పటికే కేంద్రహోంమంత్రి అమిత్‌షా భేటీ కావడం విశేషం. ప్రధానంగా యూత్‌లో బాగా క్రేజ్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్‌తో.. అమిత్‌షా ఎక్కువ సేపు భేటీ కావడం, ఆయనతో కలసి భోజనం కూడా చేయటం తెలిసిందే.

త్రిబుల్ ఆర్, బాహుబలి వంటి పాన్ ఇండియా సినిమాల్లో నటించిన జూనియర్ ఎన్టీఆర్-రాంచరణ్-ప్రభాస్‌లను అభినందించేందుకే, అమిత్‌షా వారితో భేటీ అయ్యారని అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో బలహీనంగా ఉన్న బీజేపీని బలోపేతం చేసే లక్ష్యంతోనే, అమిత్‌షా వారితో భేటీ అయ్యారని రాజకీయవర్గాల్లో చర్చ జరిగింది.

ప్రభాస్ పెదనాన్న, రెబల్ స్టార్ దివంగత కృష్ణంరాజుకు.. బీజేపీతో రాజకీయ అనుబంధం ఉంది. ఆయన బీజేపీ సర్కారులో కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. కృష్ణంరాజు చనిపోకపోతే ఆయనకు గవర్నర్ పదవి ఇచ్చేవారన్న ప్రచారం కూడా జరిగింది. కృష్ణంరాజు గతంలో ప్రభాస్‌ను వెంటపెట్టుకుని అమిత్‌షాను కలిసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో ప్రభాస్‌ను, గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రచారం చేయించాలని బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అసంఖ్యాకమైన ప్రభాస్ అభిమానులతోపాటు, గోదావరి జిల్లాలకు చెందిన సెటిలర్ల ఓట్లు కొల్లగొట్టే లక్ష్యం కూడా, బీజేపీ ప్రచార వ్యూహంలో లేకపోలేదంటున్నారు.

ఇక చిరంజీవి తనయుడు రాంచరణ్‌తో కూడా, ఎన్నికల ప్రచారం చేయించాలని బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు. గతంలో రాంచరణ్ తన తండ్రి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి ప్రచారం చేసిన విషయం తెలిసిందే. పైగా చరణ్ బాబాయ్ అయిన పవన్ కల్యాణ్.. తెలంగాణలో ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని, పది స్ధానాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాంచరణ్‌ను ఉత్తర తెలంగాణలో ప్రచారానికి వినియోగించుకోవాలని, బీజేపీ భావిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. రాంచరణ్ ప్రచారంలోకి దిగితే తెలంగాణ మున్నూరు కాపులు-ఆంధ్రా కాపులు బీజేపీకి ఆకర్షితులవుతారన్న దూరదృష్టి బీజేపీ నాయకత్వంలో లేకపోలేదంటున్నారు.

ప్రధానంగా యూత్‌లో విపరీతమైన క్రేజ్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్‌ను.. ఖమ్మం జిల్లాతోపాటు, నల్లగొండ, వరంగల్, హైదరాబాద్‌లో కమ్మ-సెటిలర్లు ఉన్న నియోకవర్గాల్లో ప్రచారం చేయిస్తే సానుకూల ఫలితాలుఉంటాయని బీజేపీ పెద్దలు అంచనా వేస్తున్నారట. కమ్మ సామాజికవర్గ సంఖ్య ఎక్కువగా ఉన్న ఖమ్మంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారంతో సానుకూల ఫలితాలు వస్తాయని బీజేపీ నాయకత్వం భావిస్తోంది.

గతంలో టీడీపీకి ప్రచారం నిర్వహించిన జూనియర్ ఎన్టీఆర్.. ఆ తర్వాత, టీడీపీ ప్రచారానికి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు తెలంగాణలో కొన్ని నియోజకవర్గాల్లో ప్రభావితం చేసే కమ్మ-సెటిలర్ల ఓట్ల సాధనకు, జూనియర్‌ను ప్రయోగిస్తే అద్భుత ప్రయోగాలు వస్తాయని, బీజేపీ నాయకత్వం యోచిస్తున్నట్లు సమాచారం.

అయితే వీరి సినిమా షెడ్యూల్ మేరకు.. ఈ ముగ్గురు అగ్ర కథానాయకుల సేవలను వాడుకోవడంపై కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ వీరు నేరుగా ప్రచారానికి రాకపోతే, వారి ఇమేజ్‌ని ఎలా వాడుకోవాలన్న అంశంపైనా చర్చ జరుగుతోందట. అంటే వారిని నేరుగా ప్రచారబరిలోకి దింపాలా? సినిమా షెడ్యూల్ బిజీగా ఉంటే, ఆ ముగ్గురితో పత్రికా ప్రకటనల ద్వారా, ఓటును అభ్యర్ధించాలన్న అన్న అంశంపై ఇంకా స్పష్టత రానట్లు సమాచారం.

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. వారి ముగ్గురి షెడ్యూల్ బిజీగా ఉంటే, పత్రికా ప్రకటనల ద్వారా ఓట్లు అభ్యర్థించడం.. ఖాళీని బట్టి వారిని గ్రేటర్ హైదరాబాద్, ఖమ్మం జిల్లాల్లో పరిమితంగా ప్రచారం చేయించడం అనే రెండు ఆప్షన్లపై , బీజేపీ నాయకత్వం కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

కాగా ఇప్పటికే సీనియర్ నటి కవిత బీజేపీలో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. ఆమె మిర్యాలగూడ నియోజకవర్గ ఇన్చార్జిగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. నాలుగైదు భాషల్లో అనవర్గళంగా మాట్లాడే కవితను కూడా, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో దింపాలని నాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

సనత్‌నగర్, శేరిలింగంపల్లి, ఉప్పల్, సికింద్రాబాద్, ఎల్బీనగర్, ఖైరతాబాద్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో కవితతో ఎన్నికల ప్రచారం చేయించాలని నాయకత్వం భావిస్తోంది. ప్రధానంగా నగరంలోని తమిళ, మళయాల, కన్నడిగులతో ఆమెతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Leave a Reply