-తాతను వైఎస్‌తో పోల్చడం వెనుక కథేమిటి?
-జగన్ వ్యూహం ఫలిస్తుందా?
-బీజేపీ ఆశలు ఫలిస్తాయా?
-‘జూనియర్’ను కమ్మవర్గం సొంతం చేసుకుంటుందా?
-ఇప్పటికే సోషల్‌మీడియాలో జూనియర్‌పై కమ్మవర్గం జంగ్
( మార్తి సుబ్రహ్మణ్యం)
తమ వ్యూహం క్లిక్కవాలన్నది ప్రతి పార్టీ ఆశ. ప్రజల ఆశలు, ఆకాంక్షలతో వాటికి సంబంధం ఉండదు. అప్పటి పరిణామాల ప్రకారం తమ వ్యూహాలు హిట్టవ్వాలన్నది, ప్రతి ఒక్క పార్టీ ఆశ. కానీ అది హిట్టవుతుందా? ఫట్టవుతుందా? అన్నది అప్పటికప్పుడు తేలే వ్యవహారం కాదు. ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చి.. వైఎస్సార్ పేరు పెట్టిన వ్యవహారంలో, జూనియర్ ఎన్టీఆర్ చేసిన గోడమీద పిల్లి వాటం ట్వీట్ వెనుక కథ కూడా అలాంటిదే.
జూనియర్ ఎన్టీఆర్ చాలా తెలివైన వాడు. స్థితప్రజ్ఞత-ప్రాప్తకాలజ్ఞతతో బతకనేర్చిన యువకుడు. ఆశలు చాలా ఎక్కువ. కానీ ఆశ-వాస్తవానికి మధ్య ఊగిసలాడే రకం. అసలు ఎన్టీఆర్‌కు వారసుడన్న పేరుతో ,మొన్నటివరకూ తన ఇమేజ్ను లాగించేశాడు. కానీ అసలైన సమయంలో కాడికింద పడేసి.. ఎన్టీఆర్‌ను వైఎస్‌తో పోల్చిన ఈ హీరో ఇప్పుడు, నందమూరి తారకరాముడి అభిమానుల దృష్టిలో విలయిపోయారు. అసలు ఎన్టీఆర్‌ను, వైఎస్‌తో పోల్చిన ట్వీట్ వెనుక, జగనన్న ఉన్నారన్నది ‘ఒరిజినల్ ఎన్టీఆర్’ అభిమానుల డౌటనుమానం.
ఆరకంగా హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పునురుగా తప్పపట్టకుండా.. జగనన్న పన్నిన రాజకీయ వ్యూహమన్నది వారి ఇంకో డౌటు.
సరే.. ఎవరి వ్యూహాలు వారివి. అవి ఫలిస్తాయా? తమ ఆలోచనల ప్రకారమే ప్రపంచం కూడా నడుచుకుంటుందా? లేదా ?అన్నది తేలడానికి కొంత సమయం పడుతుంది. అప్పటివరకూ ఎవరి ఆశలు వారివి. ఎవరి ఊహలు వారివి. అందుకు జూనియర్ అతీతుడు కాదు.
కానీ ఈలోగా.. ఎన్టీఆర్-వైఎస్‌ను ఒకేగాట కట్టిన బుడ్డోడి ట్వీటును మాత్రం , తెదేపాయులు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అభిమానులకు గానీ, కమ్మ సామాజికవర్గానికి గానీ.. జూనియర్ టీడీపీలో ఉన్నంతవరకే తమ వాడు. లేకపోతే అతనెలాంటి గొప్పోడయినా వారికి అనవసరం. కులం విషయంలో కమ్మవర్గం చాలా కఠినంగా ఉంటుంది. తమ అభిమానాన్ని దాచుకునేందుకు, ఏమాత్రం మొహమాటపడదు. తమకు జైకొట్టిన వారిని నెత్తిన పెట్టుకునే స్వభావం దాని సొంతం. కులాభిమానం మెండుగా-దండిగా ఉండే సామాజికవర్గాల్లో, కమ్మవారిని మొదటి వరస. మంచయినా-చెడయినా దాన్ని కూడా ఒక ఈవెంటులా మార్చడం కమ్మ కులం స్పెషాలిటీ.
హైదరాబాద్‌లో మజ్లిస్ పార్టీ.. హిందువును మేయర్ అభ్యర్ధిగా నిలబెట్టినా, హిందువులు అతనిని ముస్లిం పార్టీ అభ్యర్ధిగా చూస్తారే తప్ప, హిందువుగా చూడరు. ఇప్పుడు టీడీపీని కాదని.. వైసీపీకి పరోక్షంగా జైకొడుతున్న జూనియర్దీ సరిగ్గా అదే పరిస్థితి. కమ్మ వర్గం కూడా జూనియర్‌ను అదే కోణంలో చూస్తోంది. కాకపోతే జూనియర్ ఏ కులం అన్నది ఇంకా చర్చల్లోనే ఉన్నప్పటికీ.. ‘హరికృష్ణ కొడుకన్న ముద్ర’తో ఆయనను కమ్మవర్గం, మొన్నటి వరకూ తమవాడిగానే చూశారన్నది నిష్ఠుర నిజం.
ఇప్పుడు తమ వర్గాన్ని తొక్కేయాలని ప్రయత్నిస్తున్న జగన్ శిబిరంలో ఉన్నందున, జూనియర్‌ను కమ్మవర్గం సొంతం చేసుకోలేకపోతోందన్నదీ అంతే నిష్ఠుర నిజం. కారణం ఆయనకు పిల్లనిచ్చిన మామ వైసీపీలో ఉండటం. ఇప్పటివరకూ జగనన్న సర్కారుపై పల్లెత్తు విమర్శ చేయకపోవడం! జూనియర్ ప్రచారం చేసిన ఎన్నికల సభల్లో వైఎస్‌ను విమర్శించిన ఆయన.. జగనన్న పాలనపై పల్లెత్తు మాట అనకపోవడంతో, ఎన్టీఆర్ మొహమాటపడిపోతున్నారన్నది కమ్మవర్గానికి, తెదేపాయులకు తేలిపోయింది.
సరే.. ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ మార్పు వ్యవహారంలో, ఎన్టీఆర్-వైఎస్‌ను జూనియర్ ఒకే గాట కట్టడాన్ని కమ్మవర్గం అసలు జీర్ణించుకోలేపోతోంది. సోషల్‌మీడియాలో టీడీపీ వర్గీయుల వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. అసలు జూనియర్‌కు ఏం తెలుసని.. ఎన్టీఆర్-వైఎస్‌ను ఒకే గాట కట్టారని కమ్మవర్గం ప్రశ్నిస్తోంది. ఎన్టీఆర్ బతికి ఉన్నప్పుడు వైఎస్ ఆయనను ఎన్నో ఇబ్బందులు పెట్టారని, చివరకు వైఎస్ ర్యాగింగ్‌కు తట్టుకోలేక, ఎన్టీఆర్ సచివాలయంలో పవళింపు సేవకు ఉపక్రమించిన వైనం జూనియర్‌కు తెలుసా? అని ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు. అసలు ఎన్టీఆర్ ఎవరికీ భయపడకుండా బతికితే, ఈ కొసరు ఎన్టీఆర్ మాత్రం ఎవరికో భయపడి బతుకున్నాడు. పేర్లు ఒకటయినంత మాత్రాన రక్తం ఒకటి కాదు కదా? ఒరిజినల్-డూప్లికేటుకు తేడా ఉంటుంది కదా? అంటూ తమ అక్కసునంతా వెళ్లదీసి, విమర్శనాలు సంధిస్తున్నారు.
ఆబిడ్స్ లోని తన తాత ఇంట్లోకి దూసుకువచ్చి మరీ ధర్నా చేసిన వైఎస్ చరిత్ర బుడ్డోడికి తెలుసా? అని ‘అసలు ఎన్టీఆర్’ అభిమానులు నిలదీస్తున్నారు. తన తాతను గద్దె దించిన కాంగ్రెస్ పార్టీకి, అదే వైఎస్ నాయకుడన్న స్పృహ జూనియర్‌కు ఉందా? అన్న క్యాంటీన్లను రద్దు చేయడమే కాకుండా, ఆ పేరుతో క్యాంటీన్లు నడుపుతున్న వారిపై దాడిచేసి, సామాగ్రిని రోడ్డుపై విసిరేసింది జగన్ సర్కారన్న విషయం జూనియర్‌కు తెలుసా? అన్న ప్రశ్నలతో బుడ్డోడిని, ‘అసలు ఎన్టీఆర్’ అభిమానులు ప్రశ్నలతో ఆగం పట్టిస్తున్నారు. ఎన్టీఆర్ పెట్టుకున్న వాళ్లంతా ఆయన పౌరుషం-ఆత్మగౌరవానికి వారసులు కాలేరన్న సైటర్లు సంధిస్తున్నారు.
‘నువ్వు అడిగావని ఎన్టీఆర్ కుటుంబంతో బంధం ఉన్న రావి శోభనాద్రి కుటుంబాన్ని కాదని కొడాలి నానికి సీటిచ్చారు. నీ కుటుంబ విషయాలతో సంబంధం లేకుండా, తన బంధువు కుమార్తెకు నీకిచ్చి పెళ్లి చేశారు. నీ మామ నార్నె శ్రీనివాసరావు గుంటూరు ఎంపీ సీటు, చిలకలూరిపేట ఎమ్మెల్యే సీటు అడిగితే ఇవ్వలేదని కక్ష కట్టావ్. నీవు ప్రచారానికి రాకపోయినా టీడీపీని ప్రజలు గెలిపించారు. నీ సొంత మనుషులుగా పార్టీపై రుద్దిన గుడివాడ-గన్నవరం విషాన్ని మేం భరించాం. ‘పార్టీ నాశనం కావాలి. తర్వాత నీవొచ్చి ఉద్ధరించాలి. అంటే పార్టీ పగ్గాలు నీకివ్వాలి’- గుడివాడ గుట్కా రాయుడితోపాటు, మీ తాత రెండో భార్య కూడా కోరుకునేది ఇదే. నీ నాయకుడు జగన్ వ్యూహం కూడా అదే. అందుకే బీజేపీ వద్దకు నిన్ను పంపించాడు. ఏపీ ప్రజలు ఇవన్నీ తెలియని వెర్రి పుష్పాలనుకుంటే అది నీ భ్రమ. టీడీపీ ఎవరి కోసం ఆగదు. లోకేష్ పార్టీకి గుదిబండనుకుని హేళన చేశాం. గేలి చేశాం. కానీ ఊహించని రీతిలో గేలి చేయబడ్డ గాండీవం, పార్టీ అమ్ములపొదిలో చేరి ప్రత్యర్ధులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇది మీ వ్యూహానికి ఎదురుదెబ్బ. విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లోనే నీ అవసరం లేకుండా గెలిచాం. ఇప్పుడు నువ్వు వస్తే ఎంత? రాకపోతే ఎంత.అసలు ఎన్టీఆర్‌ను వైఎస్‌తో పోల్చినప్పుడే నువ్వు మా నుంచి దూరమయ్యావ్’’ అంటూ ‘అసలు ఎన్టీఆర్’ అభిమానులు, ‘కొసరు ఎన్టీఆర్’పై సోషల్‌మీడియాలో సెటైర్ల వర్షం కురిపిస్తున్న పరిస్థితి.
ఇంతకూ ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరు మార్పుపై, జూనియర్ గోడమీద పిల్లి వాటం వెనుక ఎవరున్నారన్నది ఒక చర్చ అయితే, దాని వెనుక జగనన్న ఉన్నారన్నది మరొక చర్చ. దానివల్ల జగనన్నకు వచ్చే లాభమేమిటన్నది మరో చర్చ. స్వయంగా ఎన్టీఆర్ మనుమడే వైఎస్ గొప్పతనాన్ని ఒప్పుకున్న తర్వాత.. ఇక హెల్త్ వర్శిటీకి వైఎస్ పేరు పెడితే తప్పేమిటన్న లాజిక్కును, తెరపైకి తీసుకురావడమే జగనన్న ఎత్తుగడ అన్నది తెదేపాయుల విశ్లేషణ. వైఎస్‌ను తాతతో పోల్చిన జూనియర్ ట్వీట్‌తో, ఎన్టీఆర్ కుటుంబం కూడా వైఎస్ గొప్పతనాన్ని గుర్తించిద ని చెప్పడమే జగనన్న వ్యూహం కూడా కావచ్చు.
అసలు బీజేపీ నేత అమిత్‌షా వద్దకు ఎన్టీఆర్‌ను పంపి, టీడీపీలో చీలిక తీసుకురావాలన్నది జగన్ ఎత్తుగడ అన్నది వారి ఇంకో అనుమానం. బుడ్డోడి ట్వీట్ ద్వారా.. అమరావతి రైతుల పాదయాత్రను దృష్టి మరల్చవచ్చన్నది జగన్ మరో వ్యూహం కావచ్చన్నది తమ్ముళ సందేహం. పవన్-చిరంజీవి కలిసిపోయారన్న వైసీపీ సోషల్ మీడియా ప్రచారంతో, జనసేన దళాలను టీడీపీ వ్యతిరేక దళంగా మళ్లించడం… బీజేపీ, పవన్‌ను వదలించుకుందన్న మరో ప్రచారంతో పవన్‌ను బీజేపీ నుంచి దూరం చేయడం.. ఒకవేళ రేపు టీడీపీ-జనసేన కలిస్తే, దానితో వచ్చే నష్టాన్ని జూనియర్‌తో భర్తీ చేయడమన్నదే జగన్-బీజేపీ సంయుక్త వ్యూహాలుగా ఎన్టీఆర్ అభిమానులు అనుమానిస్తున్నారు. కొడాలి నాని మాట్లాడే ప్రతి మాటకు ఎంతో విలువందని, భవిష్యత్తు పరిణామాలకు అవి సంకేతాలేనన్నది తమ్ముళ్ల విశ్లేషణ.
సరే.. వైసీపీ అయినా, బీజేపీ అయినా వ్యూహాలు రచించడం, వాటిపై ఎక్కువ అంచనాలు పెట్టుకోవడం వరకూ బాగానే ఉంటుంది. కానీ వాటిని ప్రజలు నమ్మాలి కదా? అప్పుడే కదా అధికారం వచ్చేది? జూనియర్ ఎన్టీఆర్‌కు సంబంధించినంత వరకూ, అటు వైసీపీ-ఇటు బీజేపీ ఎన్ని వ్యూహాలు రచించినా.. ఆయనను ఇప్పటివరకూ తమవాడిగా భావిస్తున్న కమ్మ వర్గం, జూనియర్‌తో నడవడం దుర్లభం. టీడీపీలో
ఉండే కమ్మవాడే, అసలైన కమ్మవాడన్నది ఆ వర్గ ప్రగాఢ విశ్వాసం. ఆ ప్రకారంగా.. కులానికి ప్రాధాన్యం ఇచ్చే కమ్మ వర్గం నుంచి దూరమైన జూనియర్‌ను వాడుకుంటే, వైసీపీకి గానీ భాజపాకు గానీ వచ్చే లాభం సున్నా. పైగా.. ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పదేరు మార్పు వ్యవహారంలో జూనియర్ వేసిన పిల్లమొగ్గలతో ఆయన ఎవరికీ కాకుండా పోయారన్నది నిష్ఠుర నిజం.