మూడు రాష్ట్రాలుగా విడిపోతే పోలా

Spread the love

– మంత్రి బొత్సకు బహుజన జేఏసీ బాలకోటయ్య హితవు

మూడేళ్లుగా మూడు రాజధానుల విభజన కొలిమితో మూడు ప్రాంతాల్లో మంటలు రేపటం కంటే, మూడు రాజధానులకు బదులుగా ఏపీని మూడు రాష్ట్రాలుగా విభజించటం ఉత్తమమైన పని అని అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య సూచించారు. విశాఖపట్నంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. పాదయాత్రను అడ్డుకోవటానికి ఐదు నిమిషాల పని అని, కన్నెర్ర చేయడం పెద్ద విషయం కాదని వ్యాఖ్యానించడం పట్ల ఆయన ధ్వజమెత్తారు.

సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే మూడు రాజధానులకు బదులుగా మూడు రాష్ట్రాల ఏర్పాటు బిల్లును అసెంబ్లీలో పెట్టాలని డిమాండ్ చేశారు. విభజన నాటకాలు మంత్రికి తెలిసినంతగా మరొకరికి తెలియవని, వైసీపీ ఆ తానులోని గుడ్డే అని చెప్పారు.కోటి 10 లక్షల జనాభా గలిగిన చిత్తూరు,అనంతపురం, కర్నూలు, కడప నాలుగు జిల్లాలను రాయలసీమ రాష్ట్రం గాను,కోటి 20 లక్షల మంది జనాభా గలిగిన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం మూడు జిల్లాలను ఉత్తరాంధ్ర రాష్ట్రం గాను, రెండు కోట్ల 80 లక్షల మంది జనాభా కలిగిన కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఉభయగోదావరి 6 జిల్లాలను మధ్యాంధ్ర ప్రదేశ్ గాను ఏర్పాటు చేయాలని తెలిపారు.

151 మంది ఎమ్మెల్యేల బలంతో అసెంబ్లీలో తీర్మానం పెట్టి కేంద్రానికి పంపాలని సూచించారు. మూడు రాజధానుల కోసం కొట్టుకొని బతకడం కంటే,మూడు రాష్ట్రాలుగా విడిపోయి పరిపూర్ణమైన మూడు పూర్తి స్థాయి రాజధానులను నిర్మించుకోవచ్చు అని సూచించారు. కోటి మంది జనాభా కలిగిన దేశాలు ప్రపంచంలో ఎన్నో ఉన్నాయని, హంగేరి,తజకిస్తాన్, ఆస్త్రియా, లిబియా వంటి దేశాల్లో లక్షల్లో జనాభా ఉన్న విషయాన్ని మంత్రికి గుర్తు చేశారు.దేశాల్లోనే లక్షల్లో జనాభా ఉంటే,మూడు రాష్ట్రాలుగా విడిపోవడానికి కోటి జనాభా చాలు అని చెప్పారు. మూడు రాజధానులు అంటే మూడు ప్రాంతాల మనుగడకు ఉరితాడు అని ఉద్యమ తొలినాళ్ళలో నే చెప్పామని గుర్తు చేశారు.

రాజధానిని దండయాత్రగా పోల్చడం, సూర్యభగవానికి ప్రాంతీయవాదం అంటగట్టడం కంటే ఆర్టికల్ 3 ప్రయోగించి ఏపీని మూడు రాష్ట్రాలుగా చేయాలని, రాజధాని పై కత్తులు నూరే అపర మేథావులు వత్తిడి తేవాలని, ముఖ్యమంత్రికి సూచిస్తూ మంత్రి బొత్స లేఖ రాయాలని డిమాండ్ చేశారు. కృష్ణమ్మ నీళ్ళు త్రాగి, కనకదుర్గమ్మ దీవెనతో పునీతమైన మధ్యాంధ్ర ప్రజలు చావును కోరుకుంటారే కానీ, అమరావతిని వదులు కోరని మంత్రికి గుర్తు చేశారు.

Leave a Reply