నుపుర్ శర్మపై సుప్రీంకోర్టు ఆగ్రహం

మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు గానూ దేశంలో పలు చోట్ల ఆమెపై కేసులు నమోదయ్యాయి. అయితే తన ప్రాణాలకు ముప్పు ఉందని… అందువల్ల అన్ని కేసులను ఢిల్లీకి బదిలీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఆమె పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పార్దీవాలాలతో కూడిన వెకేషన్ బెంచ్ విచారించింది.

ఈ సందర్భంగా నుపుర్ శర్మపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఆమెకు ముప్పు ఉందా? లేక ఆమే దేశ భద్రతకు ముప్పుగా మారారా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. తన వ్యాఖ్యల ద్వారా దేశంలోని ఎంతో మంది ప్రజల భావోద్వేగాలను ఆమె రెచ్చగొట్టారని వ్యాఖ్యానించింది.

ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తర్వాత దేశంలో దురదృష్టకరమైన ఘటనలు చోటు చేసుకున్నాయని తెలిపింది. జరిగిన హింసాత్మక ఘటనలన్నింటికీ ఆమే కారణమని చెప్పింది. ఒక పార్టీ అధికార ప్రతినిధి అయినంత మాత్రాన ఇష్టానుసారం మాట్లాడతారా? అని ప్రశ్నించింది. ఆమెకు అధికారం తలకెక్కిందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

అనుచిత వ్యాఖ్యలు చేసి దేశంలో అలజడిని రేపినందుకుగాను దేశానికి ఆమె క్షమాపణలు చెప్పాలని వ్యాఖ్యానించింది. అలాగే దేశ వ్యాప్తంగా నమోదైన కేసులను ఢిల్లీకి బదిలే చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

మరోవైపు నుపుర్ శర్మ తరపు లాయర్ తన వాదనలను వినిపిస్తూ… టీవీ డిబేట్ లో యాంకర్ అడిగిన ప్రశ్నకు మాత్రమే నుపుర్ శర్మ సమాధానం ఇచ్చారని అన్నారు. దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ… అలాంటప్పుడు సదరు టీవీ ఛానల్ యాంకర్ పై కూడా కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని సూచించింది. ఒక అజెండాను ప్రమోట్ చేయడం కోసం చట్టవిరుద్ధమైన అంశంపై చర్చించాల్సిన అవసరం నుపుర్ శర్మకు గానీ, ఆ టీవీ ఛానల్ కు కానీ ఏముందని ప్రశ్నించింది.

Leave a Reply