– తెలంగాణలో పాలన గాలికొదిలేసి, జాతీయ రాజకీయాలంటూ ‘కేసీఆర్’ కొత్త డ్రామా
– జాతీయ రాజకీయాలు కాదు కదా…. ప్రపంచ రాజకీయాలు చేసుకున్నా నిన్నెవరూ పట్టించుకోరు
– తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలంటూ దేశమంతా కోరుకుంటోందని టీఆర్ఎస్ పార్టీకి చెందిన 33 జిల్లాల అధ్యక్షులు ప్రకటించడాన్ని ఈ శతాబ్దపు జోక్ గా అభివర్ణించారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణలో ఏమీ పీకలేనోడు… ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఏదో పీకుతాడంట. బంగారు తెలంగాణ చేస్తానన్నోడు… అప్పుల తెలంగాణ చేసి, ప్రజలకు చిప్ప చేతికిచ్చిండు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నోడు… తన కుటుంబానికే ఉద్యోగాలిచ్చి, ప్రజల సొమ్మును దండుకున్నడు. రైతులకు రుణమాఫీ చేస్తానన్నోడు… రుణమాఫీ చేయకుండా అన్నదాతల ఉసురుతీసుకుంటుండు. కర్షకుల కష్టాలను పట్టించుకోనోడు, ఉచితంగా రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వనోడు… ఇప్పుడు దేశవ్యాప్తంగా రైతన్నలకు ఉచిత విద్యుత్ ఇస్తానని ప్రకటించడం చూస్తే… చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు.
కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప, చేతలు మాత్రం గడప కూడా దాటడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం, రైతు రుణమాఫీ, కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు…. పోడు భూములకు పట్టాలు, ఇలా చెప్పుకుంటూ పోతే… కేసీఆర్ వాగ్దానాలు ఎన్నో ఇంకా నీటిమీద మూటలానే ఉన్నాయని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం అప్పులకుప్పలా తయారైందని… కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సకాలంలో జీతాలు చెల్లించలేని స్థితి ఏర్పడిందని దుయ్యబట్టారు.
ఇక ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, విద్యార్థుల పాలిట నరక కూపాలుగా మారాయని… వసతి గృహాల్లో విధ్యార్థులు కలుషిత ఆహారం తిని, మరణించిన ఘటనలను చూస్తే ఎంతో ఆవేదన కలుగుతుందన్నారు. అసలు రాష్ట్రంలో పేరుకే ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల హాస్టల్స్ ఉన్నాయని… అక్కడ కనీస వసతులు కల్పించడంలో కేసీఆర్ సర్కార్ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
నిజం చెప్పాలంటే పేద బిడ్డల వసతి గృహాలు నరకానికి ఆనవాళ్లుగా మారాయి. హాస్టళ్లలో చావు డప్పు మోగుతుంటే… దేశానికే తెలంగాణ ఆదర్శమని కేసీఆర్ డప్పుకొట్టుకుంటున్నాడు. నిజంగా సీఎం కు మానవత్వం ఉందా…? ఉంటే… ఎందుకు స్పందించడం లేదు? అని ప్రశ్నించారు. మరోవైపు ఇబ్రహీంపట్నం సీహెచ్సీ లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించిన ఘటనలో నలుగురు మరణిస్తే… సంబంధిత శాఖ మంత్రి, అధికారులపై చర్యలెందుకు తీసుకోలేదో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇక తెలంగాణలోని ప్రజలంతా కేసీఆర్ పాలనలో విసిగి, వేసారిపోయారని… వారంతా కూడా ముక్త ఖంఠంతో సాలు దొర, ఇక సెలవు దొర అంటున్నారని తెలిపారు ఎన్వీ సుభాష్. బంగారు తెలంగాణ అంటివి…. అప్పుల తెలంగాణ చేస్తివి. ఇక సాలు దొర, నీకు సెలవు దొర. 50 యూనిట్ల కరెంట్ వాడుకునే వాళ్లకు ఒకటిన్నర రెట్లు(50శాతం) బిల్లు పెంచితివి, భారం మోపితివి. ఇక సాలు దొర, నీకు సెలవు దొర. డబుల్ బెడ్రూమ్ ఇండ్లకోసం చూసిచూసి పేదల కండ్లు కాయలు కాసినయ్… ఇక సాలు దొర, నీకు సెలవు దొర. పేద పిల్లలు పురుగులన్నం తినలేము… మేము చదుకుకోము, బడికిపోము అని అంటున్నరు.
ఇక సాలు దొర, నీకు సెలవు దొర. కేజీ టు పీజీ ఫ్రీ అంటివి… ఫీజు రీయింబర్స్ మెంట్ చేయకపోతివి. ఇక సాలు దొర, నీకు సెలవు దొర. గిరిజనులకు అధికారం అంటివి. తండాలను పంచాయతీలు చేస్తివి, బిల్లులియ్యక వాళ్లను రొడ్డున పడేస్తివి. ఇక సాలు దొర, నీకు సెలవు దొర అంటూ… కేసీఆర్ తీరును ఎండగట్టారు.
ఇకపోతే, కూటిలో రాయి తీయలేనోడు… యేట్లో రాయితీస్తాడట. సరిగ్గా కేసీఆర్ గురించి ప్రజలు కూడా ఇదే చర్చించుకుంటున్నారు. తెలంగాణలో ప్రజలకు ఏమీ చేయలేనోడు… ఇక దేశ ప్రజలకు ఏం చేస్తాడని ప్రజలే సూటిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ను ప్రశ్నిస్తున్నారని చెప్పారు ఎన్వీ సుభాష్. రాష్ట్రంలోని కుల వృత్తులను నిర్వీర్యం చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని వెల్లడించారు. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని… ఇక సాలు దొర, సెలవు దొర అని కేసీఆర్ కు బైబై చెప్పేందుకు ప్రజలంతా సంఘటితమయ్యారని పేర్కొన్నారు.
దేశంలోని రాజకీయ దొంగల ముఠాలను ఏకం చేస్తూ… జాతీయ రాజకీయాలు అంటూ… దానికి కేసీఆర్ కొత్త భాష్యం చెబుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కోట్ల అవినీతికి పాల్పడిని కేసీఆర్…. ఇప్పుడు దేశవ్యాప్తంగా దోచుకునేందుకు సిద్దమయ్యారని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తన కుటుంబ ప్రమేయం లేకపోతే… కేసీఆర్ ఎందుకు స్పందించడంలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు .
త్వరలోనే ప్రజలకు అన్ని విషయాలు తెలుస్తాయని… కేసీఆర్, అతని కుటుంబం జైలుకెళ్లడం ఖాయమని చెప్పారు. కేసీఆర్ లాంటి అవినీతిపరులు, గజదొంగలు ఎంతమంది ఏకమైనా…. దేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ కాపాడుకుంటారని చెప్పుకొచ్చారు. సకలజనుల హితమే ధ్యేయంగా మోదీ పానల కొనసాగిస్తున్నారని కొనియాడారు ఎన్వీ సుభాష్. ప్రజల విశ్వాసం కోల్పోయిన కేసీఆర్ కు రోజులు దగ్గర పడ్డాయని… తెలంగాణలో వచ్చేది డబుల్ ఇంజిన్ ప్రభుత్వమేనని పునరుద్ఘాటించారు.