Suryaa.co.in

Features

ఓ మహాత్మా మన్నించు..!

బాపూ..
నువ్వొచ్చావు..
తెల్లదొరలను తరిమేసావు..
నువ్వెళ్ళావు..
నల్లదొరలను మామీదకు
ఒదిలేసావు..
స్వరాజ్యమంటే సురాజ్యమనుకున్నావు..
స్వార్ధపరుల ఇష్టారాజ్యమని ఊహించలేదుగా..
ఎన్ని పోరాటాలు..
లాఠీ దెబ్బలు..
కారాగారవాసాలు..
సత్యాగ్రహాలు..
ఉప్పొంగే నదుల జలాలు ఉప్పుసముద్రం పాలు
అన్నట్టు స్వరాజ్యఫలాలు
దుష్ట పాలకుల
ఇంటి దీపాలు..!

సత్యమేవజయతే..
నీ నినాదం
ఇప్పుడు సత్యానికే
ముంచుకొచ్చింది ప్రమాదం..
అసత్యమే వర్ధతే..
అదే అందరికీ ఆమోదం..
అహింస నీ ఆయుధం
ఇప్పుడు అధికారమే
అక్రమాలకు వజ్రాయుధం..!

రౌండ్ టేబుల్ కి వెళ్ళినా
మారలేదు నీ వేషం..
కట్టుబాటు..కట్టుబట్ట
కావెన్నడూ నీరసం..
ఇప్పుడా..గంటకో వేషం
పూటకో మోసం..
అహింసో పరమో ధర్మః
అర్థాలే తెలియని పాలకుల
ఏలుబడి మా ఖర్మ..!

ఎన్ని కలలు కన్నావో..
ఎలాంటి దేశాన్ని చూడాలనుకున్నావో..
169 రోజులే నువ్వున్నావు..
కంపు మొదలయ్యేలోగా వెళ్ళావు..
ఉండి ఉంటే ఇంకొన్నాళ్లు
ఇంకిపోయేవేమో నీ కన్నీళ్లు..
వెళ్తూ వెళ్తూ అన్నావు
హే రామని..
ఊహించలేదుగా
ఈ దేశభవిత
ఇంత ఘోరమని..
నువ్వు కుప్పకూలింది
ఒక్కసారే..ఒక్కరోజే
ఏమనుకోకు మహాత్మా…
నీ ఆదర్శాలు
కుప్పకూలుతున్నాయిక్కడ
ప్రతిరోజు..
ఇది గాంధీ పుట్టిన దేశమే..
గాంధీ పెట్టిన దేశం కాదు..!

ఓ మహర్షీ..
నీ సిద్ధాంతాలు
నీ మరణంతోనే
శుద్ధ అంతాలు..
నీ దేశంలో
ఇప్పుడవి
మెట్ట వేదాంతాలు..!

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE