Suryaa.co.in

Andhra Pradesh National

రాష్ట్రపతి ఎన్నికల బ్యాలెట్ బాక్సును కట్టుద్దిమైన భద్రతతో డిల్లీకి పంపిన అధికారులు

అమరావతి, జూలై 19: భారత రాష్ట్రపతి ఎన్నికకు సోమవారం రాష్ట్రంలో జరిగిన పోలింగ్ లో శాసన సభ్యులు వేసిన ఓట్లతో భద్రపర్చిన బ్యాలెట్ బాక్సును కట్టుద్దిమైన భద్రత నడుమ మంగళవారం ఉదయం అధికారులు డిల్లీకి పంపారు. శాసన సభా ప్రాంగణంలో సీల్డు బ్యాలెట్ బాక్సును ఉంచిన స్ట్రాంగ్ రూమ్ ను ఎన్నికల పరిశీలకులు చంద్రేకర్ భారతి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా మరియు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి కె. రాజ్ కుమార్ సమక్షంలో అధికారులు మంగళవారం ఉదయం తెరిచి సీల్డు బ్యాలెట్ బాక్సును భయటకు తీశారు. తదుపరి రాష్ట్ర అసెంబ్లీ చీఫ్ మార్షల్ థియో ఫిలాస్ నేతృత్వంలో పటిష్టమైన పోలీస్ భద్రత మధ్య గన్నవరం విమానాశ్రయానికి ఆ సీల్డు బ్యాలెట్ బాక్సును ప్రత్యేక వాహనంలో తీసుకువెళ్లారు. అక్కడ నుండి ఉదయం ఎయిర్ ఇండియా విమానంలో డిల్లీలోని పార్లమెంట్ భవనానికి అప్పగించేందుకు ఆ సీల్డు బ్యాలెట్ బాక్సును అధికారులు తీసుకువెళ్లారు. ఎన్నికల పరిశీలకులు చంద్రేకర్ భారతితో పాటు రాష్ట్రపతి ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు కె.రాజ్ కుమార్, వనితారాణి తదితరులు ఈ సీల్డు బ్యాలెట్ బాక్సును తీసుకుని డిల్లీ వెళ్లారు.

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా, డిప్యుటీ సి.ఇ.ఓ. వెంకటేశ్వరరావు, అసిస్టెంట్ సి.ఇ.ఓ. జె.వి.శ్రీనివాసశాస్త్రి తదితరులు గన్నవరం విమానాశ్రయం వరకూ ఈ సీల్డు బ్యాలెట్ బాక్సు వెంటన వెళ్లారు.

LEAVE A RESPONSE