Suryaa.co.in

Family

వృద్దాప్యం.. శాపమా, పాపమా?

– నేటి పౌరులే రేపటి వృద్ధులు

ప్రతి ఊరిలో ఏదో ఒక గడపలో వృద్ధాప్యంలో తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదనే వార్త అతి సాధారణమైంది.

చిన్నప్పుడు ఆలనా పాలానా చూసుకునే తల్లిని.. కనీసం గౌరవించక.. రోడ్డుపై వదిలేస్తున్న దృశ్యాలెన్నో చూస్తున్నాం, బిడ్డకు ఆకలి ఎప్పుడవుతుందో తల్లికి తెలుసు.. అలాంటి తల్లికి ఏమాత్రం చెప్పకుండానే… గడప నుంచి మాతృమూర్తిని గెంటేస్తున్న సుపుత్రులు ఎంతో మంది.

జీవితంలో బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం సహజం. పుట్టి, పెరిగి, బాధ్యతలు మోస్తూ చివరి దశకు చేరుకుంటారు. కుమారులు, కూతుళ్లను పెంచి పోషించి, విద్యా బుద్దులు చెప్పించి ప్రయోజకులను చేసి, ఆస్తి పాస్తులను సమకూర్చి, పెళ్లిళ్లు చేసి ఓ దారి చూపించి చివరి దశలో మనవళ్లు, మనవరాళ్లతో కబుర్లు చెబుతూ ఆడుతూ పాడుతూ గడిపే సమయం ఇది.

ఆ వయసులోనూ వారి ఆలోచనలు వారసుల గురించే. వారికి ఏ కష్టం రాకూడదని, జీవితాంతం హాయిగా ఉండాలని పరితపిస్తుంటారు.

ఆ దశలో కూడా ఆమె కొడుకులు ఏదేని వక్ర మార్గం అనుసరిస్తుంటే, వారిని మంచి దారిలో పెట్టే ప్రయత్నంలో కొన్ని సలహాలు, సూచనలు చేస్తుంటారు.

చాలా మందికి, వృద్ధాప్య దశలో ఉన్న తల్లిదండ్రుల సలహాలు నచ్చవు. వారిని ఇంట్లో నిరుపయోగంగా ఉన్న ఒక వస్తువులా భావిస్తుంటారు.

ఇది వృద్ధులకు శాపం లాంటిది. పిల్లలు తమను పలకరించాలని, తమతో కొంత సమయం గడపాలని వృద్ధులు కోరుకుంటారు.

కానీ మారుతున్న కాలం, వేగవంతమైన జీవన విధానం వారిని తెరచాటుకు నెట్టేస్తున్నాయి.

వారి త్యాగాలపై నిర్మించుకున్న జీవితాల్లో వారికే చోటు దొరకడం లేదు.
ఒక్కపూట అన్నం పెట్టలేక, ఆలనా పాలన చూడలేక కొందరిని రోడ్డు మీద వదిలేస్తుంటే, మరి కొందరు వృద్దాశ్రమాల్లో వదిలేస్తున్నారు.

ఈ నేపథ్యంలో వృద్ధుల పట్ల నిరాదరణ తగ్గించేందుకు, ప్రతి ఒక్కరూ ఆలోచించాలి.

ప్రపంచంలోనే ఎక్కువ మంది యువకులున్న నేటి భారత్… 2025 నాటికి 15.8కోట్ల మంది వృద్ధులకు ఆవాసం అవనుందని అంచనా.

మరి వారిని చూసుకునేవారెవరు? గుండెలపైకి ఎత్తుకుని పెంచిన వారి.. గుండెపైనే తంతున్న ఘటనలు రోజుకోకటి చూస్తున్నాం.

తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలపై కఠినంగా వ్యవహరిస్తూ… వృద్ధుల పక్షాన ఈ మధ్య కోర్టులు నిలవటం మంచి విషయం.
గ్రామాల్లో ఉపాధి కొరత… పెరుగుతున్న పట్టణీకరణ… పడిపోతున్న మానవ సంబంధాలు.. మానవతా విలువల పతనానికి దారితీస్తున్నాయి.
వయసైపోయిన వారిలో మగవారికంటే, ఆడవారే ఎక్కువ నిర్లక్ష్యానికి గురవుతున్నారట.

వయసుమళ్ళిన ఆడవారు మానసికంగా కుంగిపోతున్నారే తప్ప.. సమస్య చెప్పుకోలేరు. ఇదే వాస్తవం. ధైర్యం చేసి చెప్పినా వినేవారు ఎవరు..? ముసలివారి కోసం ప్రత్యేక ప్రభుత్వ పథకాలు, చట్టాలున్నట్లు ఎవరికి తెలుసు..? మనుషుల మనసుల్లో వస్తున్న మార్పులతో వృద్ధాశ్రమాలు పుట్టుకొస్తున్నాయి. ఈ ఆశ్రమాల్లో వసతులున్నాయేమో.. తప్ప మానసిక ఆనందం లేదు.
నేటి బాలలే.. రేపటి పౌరులు. మరి నేటి పౌరులే రేపటి వృద్ధులు కదా..! ఈ చిన్న విషయం మరిచిపోయి ఎందుకు తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదు. రేపటి రోజున.. మనమూ వృద్ధులమే.

మన భాష.. యాస.. అన్నీ నేర్చుకున్నవి తల్లి నుంచే. ‘దిల్లీకి రాజైనా తల్లికి కొడుకే’ అని గట్టిగా చెప్పే మన దేశంలో వృద్ధాప్యంలోకి వెళ్లిన తల్లిని ఎందుకలా దూరంగా ఉంచుతున్నాం. ఆలోచన తీరులో ఎందుకీ మార్పు?*
ఇప్పటి వాళ్లకు వృద్ధులను విహారయాత్రలకు తీసుకెళ్లాలంటే మహా చిరాకు. వారిపై ప్రభుత్వం నిషేధం విధించినట్లు చేస్తున్నారు పిల్లలు. కాస్త వారిని బయటకు తీసుకెళ్తేనేగా ప్రశాంతత. చిన్నప్పుడు మీరు ఏడుస్తుంటే.. మీ సంతోషం కోసం ఎన్ని మైళ్లు ఎత్తుకుని తీసుకెళ్లారో ఒక్కసారి గుర్తు చేసుకోండి.

 

LEAVE A RESPONSE