-ఎన్నికల తర్వాత అభివృద్ధిపైనే దృష్టి సారించాలి
-మంగళగిరి ఎన్నికల ప్రచారంలో యువనేత లోకేష్
రాష్ట్రంలో మళ్లీ పాతతరం రాజకీయాలు రావాలని తాను కోరుకుంటున్నట్లు యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడేపల్లిలోని అమరావతి ఐకాన్ అపార్ట్ మెంట్ వాసులను యువనేత మంగళవారం ఉదయం బ్రేక్ ఫాస్ట్ విత్ లోకేష్ కార్యక్రమం ద్వారా కలుసుకున్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… గతంలో చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్య లాంటివారు ముఖ్యమంత్రులుగా వ్యవహరించినపుడు విమర్శలు కేవలం విధాన పరంగా మాత్రమే ఉండేవని, వారు హుందాగా రాజకీయాలు చేశారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వ్యక్తిగత, విద్వేషపూరిత వ్యాఖ్యలతో ముఖముఖాలు చూసుకోలేని పరిస్థితులు కల్పించారని, ఇది రాజకీయాల్లో వాంఛనీయం కాదని అన్నారు. విధ్వంసం, కక్ష సాధింపు, డబ్బుతోనే రాజకీయాలు సాధ్యం కాదన్న విషయాన్ని జగన్ గమనించాలి, ఇతర రాష్ట్రాల్లో ధనిక పార్టీలు ఓడిపోయిన విషయం గుర్తించాలి.
రాష్ట్రంలో పరిశ్రమలు రావాలంటే అందుకు తగ్గ ఎకోసిస్టమ్ అవసరం, హైదరాబాద్ ఐటి హబ్ గా మారడానికి చంద్రబాబు విజన్ తో కల్పించిన వాతావరణమే కారణం. అనంతపురంలో కియా కార్ల పరిశ్రమ ఏర్పాటువల్ల అక్కడ ప్రజల తలసరి ఆదాయం పెరిగింది. అలాగే చిత్తూరు జిల్లాలో సెల్ ఫోన్ తయారీ పరిశ్రమను అభివృద్ధి చేశారు. అభివృద్ధిలో అగ్రగామిగా ఉన్న సింగపూర్, అమెరికా, చైనా, యూరప్ దేశాలు కూడా అప్పులు చేస్తాయి, అలా తెచ్చిన డబ్బును వారు మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించడంవల్ల సంపద వృద్ధిచెంది, తద్వారా పెద్దఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడానికి ఆస్కారమేర్పడింది. తెచ్చిన అప్పులను సద్వినియోగం చేసుకోలేకపోతే శ్రీలంక లాంటి పరిస్థితులు దాపురిస్తాయి.
రాష్ట్రవిభజన మనం కోరుకున్నది కాదు, ఆనాడు కట్టుబట్టలతో బయటకు వచ్చి ప్రయాణం ప్రారంభించాల్సి వచ్చింది. అయినప్పటికీ చంద్రబాబు రేయింబవళ్లు శ్రమించి తెలంగాణా, తమిళనాడు, కర్నాటకతో పోటీపడి పరిశ్రమలు తెచ్చి అభివృద్ధి సాధించారు. అన్నివిధాలా ఆలోచించాకే 5కోట్లమందిని ఒప్పించి అమరావతిని రాజధానిగా నిర్ణయించారు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కడా మూడు రాజధానులు లేవు. అవగాహన , అనుభవం లేని జగన్ మూడుముక్కలాటతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు.
అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏమిటో చంద్రబాబు చేసి చూపించారు. జగన్ పాలనలో ఒక్క పరిశ్రమ రాలేదు. విశాఖలో మాత్రం 550 కోట్లతో విలాసవంతమైన ప్యాలెస్ కట్టుకున్నారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని – అభివృద్ధి వికేంద్రీకరణ మా విధానం. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆగిపోయిన రాజధాని పనులు ప్రారంభిస్తామని లోకేష్ తెలిపారు.