Suryaa.co.in

Andhra Pradesh

ఏపీఎస్ఆర్టీసీకి వంద ఎలక్ట్రిక్ బస్సులు సరఫరా చేసిన ఓలెక్ట్రా

-తిరుపతి నుంచి తిరుమలకు 50 బస్సులు
-తిరుమల నుంచి రేణిగుంట విమానాశ్రయానికి 14 బస్సులు
-కడప, నెల్లూరు, మదనపల్లి నుంచి తిరుపతికి 36 బస్సులు
-మదనపల్లి నుంచి తిరుపతికి ఓలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సు సేవలను ప్రారంభించిన ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున రెడ్డి

హైదరాబాద్, జులై 16: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) కి ఎలక్ట్రిక్ బస్సుల తయారీలో అగ్రగామి సంస్థ ఓలెక్ట్రా గ్రీన్ టెక్ వంద బస్సులను సరఫరా చేసింది. ఇప్పటికే 88 బస్సులను ఆర్టీసీకి ఓలెక్ట్రా అందించింది. మిగిలిన 12 బస్సులను సోమవారం అందజేసింది. ఈ 12 బస్సులను అన్నమయ్య జిల్లా మదనపల్లి నుంచి తిరుపతికి ఆర్టీసీ నడపనుంది. వీటిని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ ఏ.మల్లికార్జున రెడ్డి మదనపల్లి ఆర్టీసీ డిపోలో నేడు (సోమవారం) జెండా ఊపి ప్రారంభించారు.

ఏపీ ఎస్ఆర్టీసీకి వంద ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేసేందుకు ఓలెక్ట్రా ఒప్పందం చేసుకుంది. అందులో భాగంగా దశలవారీగా బస్సులను సరఫరా చేసింది. చివరిగా 12 బస్సులను అందజేసింది. దీంతో ఏపీఎస్ఆర్టీసీతో 100 బస్సుల సరఫరాకు ఓలెక్ట్రా చేసుకున్న ఒప్పందం పూర్తి చేసింది. ప్రస్తుతం 50 ఓలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు తిరుపతి నుంచి తిరుమలకు నడుస్తున్నాయి.

తిరుమల నుంచి రేణిగుంట విమానాశ్రయానికి 14 బస్సులు, కడప నుంచి తిరుపతికి 12 బస్సులు, నెల్లూరు నుంచి తిరుపతి 12 బస్సులు నడుస్తున్నాయి. తాజాగా మదనపల్లి నుంచి తిరుపతి 12 బస్సులు సోమవారం నుంచి నడుస్తున్నాయి. ఇవన్నీ అత్యాధునిక సదుపాయాలున్న ఏ సి బస్సులే.

మదనపల్లి తిరుపతి మధ్య రోజుకు ఐదు వేల కిలోమీటర్లు ఓలెక్ట్రా బస్సులు ప్రయాణిస్తాయి. కడప- తిరుపతి, నెల్లూరు – తిరుపతి , మదనపల్లి – తిరుపతి మార్గాల్లో అంటే మూడు ఇంటర్సిటీ రూట్స్లో ఓలెక్ట్రా బస్సులు ఆంధ్రప్రదేశ్లో ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా తిరుపతి, తిరుమల, తిరుమల రేణిగుంట విమానాశ్రయాల మధ్య కూడా ఓలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. తిరుమలను సందర్శించే భక్తుల సేవలో 10 బస్సులు నిమగ్నమై ఉన్నాయి.

ఇవి తిరుమల భక్తులకు ఉచితంగా సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. తిరిగే సమయంలోనే తనకు అవసరమైన శక్తిని పునరుత్పత్తి చేసుకునే సామర్ధ్యం ఉన్న 88 ఓలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో 1. 4 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించాయి. ఇంధన పరంగా 35 లక్షల లీటర్ల డీజిల్ ఆదా చేసాయి. కాలుష్య నియంత్రణలో కూడా ఈ బస్సులు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటి వరకు 9,100 టన్నుల కర్బన ఉద్గాగారాలను ఓలెక్ట్రా బస్సులు నియంత్రించాయి.

LEAVE A RESPONSE