-ప్రభుత్వానికి అక్కరకు లేని… మన పార్టీకి మాత్రమే కావలసిన వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ
-డేటా చౌర్యం పై గతంలో గొంతు చించుకున్న జ. మో. రె, ఇప్పుడు చేస్తున్నది ఏమిటి?
-బి ఎల్ ఓ లతో ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు సమన్వయం చేసుకొని ఓటర్ జాబితాను తనఖీ చేయాలి
-ఓటరు జాబితాలో లేని వారి పేర్లను తిరిగి నమోదు చేయించాలి
-రానున్న ఎన్నికల్లో టిడిపి, బిజెపి,జనసేన కలిసి పోటీ చేస్తాయన్న పవన్ కళ్యాణ్
-గడాఫీ విధానాలను అనుసరిస్తున్న జ. మో. రె
-పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి మాయ చేసి రుణం పొందారు
-నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు
ప్రభుత్వ సొమ్ముతో మన పార్టీకి సోకు చేసుకోవడానికి కావలసిన వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థని ప్రజలందరూ పసిగట్టారు. ప్రభుత్వానికి అక్కరకు లేని, మన పార్టీకి కావలసిన వ్యవస్తే ఈ వాలంటీర్ వ్యవస్థ. పార్టీ సభ్యుడిగా నేను ప్రశ్నిస్తున్నాను… ముఖ్యమంత్రి గుండెల మీద చేయి వేసుకొని సమాధానం చెప్పండి. వాలంటీర్ వ్యవస్థ మన పార్టీకి అవసరమా?, ప్రజలకు అవసరమా??, ప్రజలను ఎన్నాళ్ళని వెర్రి పప్పలను చేస్తారు. అయినా ప్రజలెవరూ మనల్ని విశ్వసించడం లేదని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘు రామకృష్ణంరాజు అన్నారు.
సోమవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… వాలంటీర్ వ్యవస్థ పై మాట్లాడాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను మా పార్టీ నాయకులే రెచ్చగొట్టారు. పవన్ కళ్యాణ్ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన తరువాత, వాలంటీర్ల పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని మా పార్టీ నాయకులు కొత్త రాగాన్ని అందుకున్నారు. వాలంటీర్లు ప్రజలకు చేస్తున్న సేవ ఏమిటి?, వాలంటీర్ వ్యవస్థ అన్నది అవసరమా?? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.
ప్రజలకు వాలంటీర్లు చేస్తున్న మేలు ఏమిటి?, మా పార్టీకి చేస్తున్న మేలు ఏమిటో ప్రజలకు స్పష్టంగా తెలుసు. ప్రతి కుటుంబం వివరాలను సేకరించి, వ్యక్తిగత డేటా చౌర్యానికి పాల్పడుతున్న విషయం ప్రజలందరికీ తెలిసిపోయింది. గతంలో వాలంటీర్ వ్యవస్థ పై నేను మాట్లాడాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ధైర్యంగా అందరూ మాట్లాడుతూనే ఉన్నారు. ఇందులో దుష్ప్రచారం ఏముంది?. వాలంటీర్ వ్యవస్థ వద్దని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇన్చార్జీలు, ఎమ్మెల్యేలతో పాటు పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న కార్యకర్తలు కోరుకుంటున్నారు.
వాలంటీర్ వ్యవస్థ వల్ల సర్పంచ్ కు ఓటరుకు మధ్య సంబంధం లేకుండా పోయింది. అలాగే ఎమ్మెల్యేకు ఓటర్ కు మధ్య దూరం పెరిగింది. ఏమన్నా అంటే మనకు వాలంటీర్ ఉన్నాడని అంటున్నారు. ప్రస్తుతం ఐదు వేల రూపాయలకు పనిచేస్తున్న వాలంటీర్, రేపు మరొక మంచి అవకాశం లభించి ఉద్యోగం మానివేస్తే ఓటరుకు పార్టీకి మధ్య గ్యాప్ ఏర్పడుతుంది. ఆ గ్యాప్ ను భర్తీ చేసేది ఎవరు?
అందుకే , ఈ పనికిమాలిన వ్యవస్థ ఎప్పుడు పోతుందోనని మా పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు అందరూ ఎదురు చూస్తున్నారు. వాలంటీర్లుగా పనిచేస్తున్న వారంతా పదవ తరగతి చదివిన వారే. వారికి సాంకేతిక శిక్షణను ఇచ్చి మెరుగైన ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించేందుకు చర్యలు తీసుకోవాలి. ప్రజలకు విషయ పరిజ్ఞానం లేదని అనుకుంటున్నారా?. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు. వాలంటీర్ వ్యవస్థను జమోరె ప్రభుత్వం ఎందుకనీ తీసుకువచ్చిందో ప్రజలకు కూడా అర్థమయ్యింది. ప్రజలే తిరగబడి కొట్టే పరిస్థితి ప్రభుత్వ పెద్దలు తీసుకు వస్తున్నారని రఘురామకృష్ణం రాజు అన్నారు .
చెక్ యువర్ ఓటు… గెట్ యువర్ ఓటు
చెక్ యువర్ ఓటు… గెట్ యువర్ ఓటు అనే ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. దేశంలో ఎక్కడ కూడా ఇలాంటి దారుణమైన పరిస్థితి లేదు. ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరుల ఓట్లను ఓటరు జాబితా నుంచి అక్రమంగా తొలగిస్తున్నారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అయిన ఓటును తొలగించడం అనేది దారుణం.
గుంటూరు నుంచి నాకు ఒక వ్యక్తి ఫోన్ చేశారు. భార్యాభర్తల ఓటును ఓటరు జాబితా నుంచి తొలగించారట. గతంలో వారు తమ ఓటు హక్కును వినియోగించుకున్న వారే. ఇప్పుడు ఎందుకు తొలగించారని ఆరా తీస్తే… వారు ప్రధాన ప్రతిపక్ష నేత సామాజిక వర్గానికి చెందిన వారిని, రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తారని తొలగించారట. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో లేకపోతే, రాష్ట్రంలోని కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల ఓట్లను తొలగించే పనిలో ఉన్నారు. ఇదే విషయమై నాతో ముగ్గురు, నలుగురు వ్యక్తులు మాట్లాడారు. ఎవరికి వారే తమ ఓటు ను ఓటరు జాబితాలో పరిశీలించుకోవాలి.
అయితే ఇది వ్యక్తిగతంగా అయ్యే పని కాకపోవడంతో, బూతు లెవల్ ఆఫీసర్ ( బి ఎల్ ఓ ) లతో ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు సమన్వయం చేసుకొని, ఓటరు జాబితాను పరిశీలించి అర్హులైన ఓటర్ల పేర్లు లేకపోతే, తిరిగి చేర్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇటువంటి ప్రజాస్వామ్య ద్రోహులు పరిపాలిస్తున్న దిక్కుమాలిన వ్యవస్థలో మనం ఉండడం… దురదృష్టవశాత్తు నేను ఆ వ్యవస్థలో భాగస్వామిని కావడం చాలా అసహ్యంగా ఉంది. ఇదే విషయమై ఎన్నికల కమిషన్ అధికారులను కలుస్తాను. ఇప్పటికే నేను పలుమార్లు లేఖలు రాశాను.
తమకు ఓటు వేయరని తెలిసిన వారి ఓటును ఓటరు జాబితా నుంచి తొలగిస్తున్న వైసీపీ గ్యాంగ్, దొంగ ఓట్లను అడ్డుకోవాలని, అనర్హుల ఓట్లను ఓటరు జాబితాలో చేర్చకుండా చూసుకోవాలని నీతి కబుర్లు చెప్పడం సిగ్గుచేటు. ఒక్కొక్క ఇంటిలో పాతిక నుంచి 50 దొంగ ఓట్లను చేర్పించింది వారే. డోర్ నెంబర్ లేని ఒక ఇంట్లో 500 ఓట్లను నమోదు చేయించారు. ఓడిపోతామని తెలిసే, ఇలా దొంగ ఓట్ల నమోదు ప్రక్రియకు తెరలేపి ఇప్పుడు దొంగే దొంగా దొంగా అన్నట్లుగా సకల శాఖామంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉందని రఘురామకృష్ణంరాజు విమర్శించారు.
టీడీపీ,బీజేపీ, జనసేన పార్టీలలోని కోవర్టుల ఆటలు సాగవు
తెలుగుదేశం పార్టీ, జనసేన, బిజెపి లోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేసే కోవర్టుల ఆటలు సాగవు. టిడిపి, జనసేన కలిసి పోటీ చేయడం ఖాయమన్న వార్తలు టిడిపిలోని కోవర్టులకు రుచించడం లేదు. జనసేనతో పొత్తు పొసగకూడదని చంద్రబాబు చెవిలో ఏదో చెబుతున్నారు. అలాగే జనసేన లోని కోవర్టులు కూడా పవన్ కళ్యాణ్ చెవిలో కూడా ఏదో చెప్పే ప్రయత్నాన్ని చేస్తున్నారు.
బిజెపిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే నాయకులు, రానున్న ఎన్నికల్లో తాము జనసేన మాత్రమే కలిసి పోటీ చేస్తామని చెబుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్కడ కూడా తాము బిజెపి మాత్రమే కలిసి పోటీ చేస్తామని చెప్పడం లేదు. ఎవరెన్ని విధాలుగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ను మేని ప్లేట్ చేయాలని చూసినా వారి పప్పులు ఉడకవు.
టిడిపి జనసేన, బిజెపి కలిసి పోటీ చేస్తాయని ప్రకటించిన తరువాత, పవన్ కళ్యాణ్ ఇంతవరకు మరొక ప్రకటన చేసింది లేదు. దీన్నిబట్టి పరిశీలిస్తే రానున్న ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేయడం ఖాయం. రానున్న పది రోజులపాటు ప్రతి ఒక్కరూ తమ ఓటు, ఓటరు జాబితాలో ఉన్నది లేనిది పరిశీలించుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని రఘురామకృష్ణం రాజు సూచించారు.
ఇప్పుడు నార్త్ ఆఫ్రికా విధానాన్ని అనుసరించే ప్రయత్నం చేస్తున్న జ.మో.రె
దక్షిణాఫ్రికాలో మాదిరిగా మూడు రాజధానుల విధానాన్ని అనుసరించాలని చూసిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు నార్త్ ఆఫ్రికా విధానాన్ని అనుసరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయిల్ నిక్షేపాలతో కూడుకున్న లిబియాను గడాఫీ అనే నియంత 40 ఏళ్ల పాటు పాలించారు. ఆయన విధానాలు నచ్చని ప్రజలు కొట్టి చంపేశారు.
గడాఫీ ఎప్పుడూ తన చుట్టూ మహిళలను రక్షణ కవచంగా పెట్టుకునేవారు. ఇప్పుడు జమోరె కూడా మహిళలను రక్షణ వలయంగా వాడుకోవాలని నిర్ణయించారట. ఓ 60 మంది మహిళలకు శిక్షణ కూడా ఇచ్చారు. మహిళలు దాడి చేస్తారని నిఘా వర్గాల నివేదిక ఆధారంగా, మహిళలను రక్షణ వలయంగా వాడుకోవాలని జమోరె భావిస్తున్నారు. ఆల్రెడీ పురుషులు దాడి చేస్తారని పరదాలను కట్టుకు తిరుగుతున్న జమోరె, చెట్లపై నుండి ఎవరైనా దాడి చేస్తారని వాటిని నరికించి వేస్తున్నారు. మహిళల నుంచి కూడా రక్షణ లేదని భావిస్తున్నా ఆయన ఇంకా ప్రజా జీవితంలో ఉండడం ఎందుకు?!
మహిళలంటే భయం, చెట్లు అంటే భయం, చివరకు మనుషులంటే కూడా జమోరె కు భయమని రఘురామ కృష్ణంరాజు ఎద్దేవా చేశారు. ప్రజా జీవితంలో ఉన్నవారు ఎవరు కూడా ఇంతగా ప్రజలకు భయపడిన దాఖలాలు ప్రపంచ చరిత్రలో లేవు. నేను నా సొంత నియోజకవర్గానికి వస్తానంటే, కేసులు పెట్టి వేధిస్తున్నారు. ప్రభుత్వ అధినేత మాత్రం ప్రజల్లోకి వెళ్లడానికి భయపడుతున్నారు. ఇప్పుడు మహిళలంటే భయపడుతున్న జమోరె, రేపు పిల్లలు కూడా దాడి చేస్తారని, చిన్నపిల్లలను కూడా రక్షణ వలయంగా పెట్టుకుంటారేమోనని అపహాస్యం చేశారు.
ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్లడానికి భయపడుతుంటే యువ గళం పాదయాత్ర ద్వారా నారా లోకేష్, వారాహి యాత్ర ద్వారా పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి నిర్భయంగా వెళుతున్నారు. ప్రజలు, ముఖ్యంగా మహిళలు వారికి బ్రహ్మరథం పడుతున్నారు. రాష్ట్రంలో 51 శాతం ఓటు బ్యాంకు కలిగిన మహిళలు దాడి చేస్తారని, మహిళా బౌన్సర్ల రక్షణ వలయంలో సంచరించాలని భావిస్తున్న జమోరె, సభ్య సమాజానికి ఇస్తున్న సందేశం ఏమిటి?!, గడాఫీ విధానాలను అనుసరించడం ద్వారా పార్టీకి మహిళ ఓటర్లను దూరం చేయవద్దని రఘు రామకృష్ణంరాజు సూచించారు.
గతంలో గొంతు చించుకున్న జగన్… ఇప్పుడు చేస్తున్నది ఏమిటి?
గతంలో డేటా చౌర్యం పై ప్రతిపక్ష నేతగా గొంతు చించుకున్న జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ద్వారా చేస్తున్నది ఏమిటి?. గతంలో మహిళల ఫోన్ నెంబర్లు అడిగారని ఆవేదన వ్యక్తం చేసిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ఏకంగా ఫోటోలనే తీయిస్తున్నారు. ఈ సమాచారాన్ని అంతా రాజ్ కసిరెడ్డి నేతృత్వంలో నిర్వహిస్తున్న యూనికాన్ సంస్థ సేకరించి చేస్తున్న పని ఏమిటని పార్టీ సభ్యుడిగా, ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నాను.
మన పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేసే వారి ఓటును ఓటరు జాబితా నుంచి తొలగించడమే కదా మన పని. మనకు అనుకూలంగా లేని వారి ఓటును తొలగించి, ఎక్కడెక్కడ నుంచో వ్యక్తులను తీసుకువచ్చి దొంగ ఓట్లు చేర్పించడం ప్రజలందరికీ తెలుసు. ససమ, జమోరె కలిసి ఆడుతున్న నాటకమే ఇది. నేను ప్రస్తుతం కొనసాగుతున్న పార్టీ దొంగ ఓట్లను నమోదు చేసి, అర్హులైన వారి ఓట్లను జాబితా నుంచి తొలగిస్తుందని రఘురామకృష్ణం రాజు అన్నారు.
పీఏసీ చైర్మన్ పయ్యావుల చెప్పింది నూటికి నూరుపాళ్ళు నిజం
పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఆర్ఈసి నుంచి రుణాలను ఎత్తారు. ఈ విషయంలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ( పిఎసి ) చైర్మన్ గా పయ్యావుల కేశవ్ చెప్పింది అక్షరాలా నిజం. ఇదే విషయాన్ని నేను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకు వెళ్లాను. ఆయన కూడా వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణం మంజూరు చేయడానికి సంబంధం ఏమిటని ప్రశ్నించాను. దానికి మోటర్లు పంపులు, కరెంటు వినియోగిస్తూ నిర్వహించే యంత్రాలకు మాత్రమే రుణం ఇవ్వాలనుకుంటున్నామని చెప్పారు.
అటువంటప్పుడు హౌసింగ్ లోన్లు కూడా పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ఇస్తుందా అని నేను అడిగితే మాత్రం సమాధానం లభించలేదు. ఇలా ప్రశ్నించినందుకు పర్యవసానంగా నన్ను పార్లమెంటరీ కమిటీ నుంచి మా పార్టీ నాయకత్వం తొలగించింది. ఎన్జీటీకి తప్పుడు డిక్లరేషన్ ఇచ్చి, ఆ ప్రాజెక్టును టెక్నో ఎకానమిక్ ఫీజిబిలిటీ అధ్యయనం మాత్రమే చేస్తున్నామని చెప్పి, ప్రాజెక్టు చేయడం లేదని అండర్ టేకింగ్ ఇచ్చారు. ఎలక్ట్రో మెకానిక్ కాంపోనెంట్ కింద 900 కోట్ల రూపాయల ప్రాజెక్టులో 700 కోట్ల రూపాయలు ఎందుకు ఉంటుందో తెలియదు.
ఫిజికల్ గా లేని ప్రాజెక్టు కోసం కాంట్రాక్టర్ కు రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు ఇవ్వకుండా నేరుగా రుణాన్ని మంజూరు చేశారు. రాయలసీమ కరువు కార్పోరేషన్ అప్పటికి ఏర్పాటు చేయలేదు. జల వనరుల శాఖ ని ఈ పనులను పిలిచింది. కార్పొరేషన్ పేరుమీద జరగని పని, చేయడం లేదని చెప్పిన పనికి వారు ఎలా రుణాన్ని మంజూరు చేశారన్నది అర్థం కావడం లేదు. కాంట్రాక్టర్ మేనేజ్ చేశారా?, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు మేనేజ్ చేశారా?
అన్న దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గతంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పది మంది ఐఏఎస్ అధికారులు జైలు పాలయ్యారు. ఇంకా కేసులు కొనసాగుతున్నాయి. ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు చేసే పని వల్ల ఐఏఎస్ అధికారులంతా జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. తప్పుడు డిక్లరేషన్ ఇచ్చి డబ్బులు డ్రా ఎలా డ్రా చేశారు. పీఏసీ చైర్మన్ పబ్లిక్ గా ఈ విషయాన్ని చెప్పిన తర్వాత, ఇలా చేసిన వారిని ఏమి చేయాలి. ఇందులో ఇన్వాల్వ్ అయిన అధికారులకు శిక్ష పడుతుంది. తప్పులు చేసి నేను బటన్ నొక్కాను అని జమోరె చెప్పడం సిగ్గుచేటు.
2024 లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడుతుందని విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా పేర్కొనడం హాస్యాస్పదం. దానికి ఒక సర్వే నివేదికను జత చేశారు. టైమ్స్ నౌ సంస్థ కు ఏడాదికి ఎనిమిదిన్నర కోట్ల రూపాయలు, మూడేళ్లకు 25 కోట్ల 50 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులు వెచ్చించినందుకు ఆ సంస్థ, అధికార పార్టీకి అనుకూలంగా సర్వే నివేదికలను ఇచ్చింది. మీరు రాయించుకున్నది నిజమని ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు.
ఇంకెన్నాళ్లు కులాల మధ్య కుంపట్లు పెడతారు?!
రాష్ట్రంలో కులాల మధ్య కుంపట్లను పెట్టి, చలి మంటలు కాచుకునే దుర్మార్గానికి అధికార పార్టీ తెరలేపింది. నరసారావు పేట లో కులాల మధ్య చిచ్చు పెట్టారు. ప్రశాంతంగా ఉండే శ్రీకాకుళం జిల్లా రాజాంలో గతంలో తెలుగుదేశం పార్టీ తరపున సర్పంచ్ గా ఎన్నికైన మాస్టర్ ను గుడ్లు పీకేసి దారుణంగా అధికార పార్టీ నాయకులు హత్య చేశారు. ఆ మాజీ సర్పంచ్ కూడా అధికార పార్టీలో చేరినప్పటికీ, అప్పటికే ఆ పార్టీలో కొనసాగుతున్న వారు ఈ దుర్మార్గానికి ఒడి కట్టారు.
అయినా ముఖ్యమంత్రి, సకల శాఖామంత్రి, ఆ ఏరియా ఇన్చార్జ్ అయిన సుబ్బారెడ్డిలు కనీసం సంతాపం కూడా తెలియజేయలేదు. కానీ ప్రధాన ప్రతిపక్ష నేత ఈ సంఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తూ, దారుణ హత్యకు గురైన మాస్టారు మృతికి సంతాపాన్ని తెలియజేశారు. కర్తవ్యం చిత్రంలో విజయశాంతి మాదిరిగా వ్యవహరిస్తూ, అంజూ యాదవ్ అనే సిఐ, జనసైనికులపై దాడి చేయడాన్ని నిరసించినందుకు యాదవ సంఘాలను ఉసిగొలిపే ప్రయత్నం చేశారు.
ధనలక్ష్మి అనే మహిళను జుట్టు పట్టుకొని అంజూ యాదవ్ స్టేషన్ కు తీసుకు వెళ్లినట్లుగా ఫిర్యాదులు ఉన్నాయి. అలాగే ఆమెపై ఇంకా ఎన్నో ఫిర్యాదులు ఉన్నాయి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న అంజూ యాదవ్ పై చర్యలు తీసుకోవాల్సింది పోయి, పవన్ కళ్యాణ్ పై కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని 153A సెక్షన్ కింద కేసులు నమోదు చేయడం సిగ్గుచేటు. ఇక నా పై అయితే 12 కేసుల్లో 153A సెక్షన్ నమోదు చేశారు.
అన్ని కులాలను గౌరవిస్తూ, అందరితోనూ సామరస్యంగా మెలిగే నేనెక్కడ కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశానో ప్రజలే ప్రశ్నించాలి. ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో సగటున 80 శాతం పదవులను జమోరె తన సామాజిక వర్గానికి చెందిన వారికి కేటాయిస్తే, ఐదువేల రూపాయల జీతానికి పని చేసే వాలంటీర్లలో 80% మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ కులాలకు చెందినవారు ఉన్నారు. 5వేల రూపాయలతో సేవ చేసే వాలంటీర్లుగా పనిచేయడానికి ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందినవారు ముందుకు రారా అని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు.