Suryaa.co.in

Features

అటువైపా.. ఇటువైపా?

అటువైపా.. ఇటువైపా.. అని అడిగే వాళ్లకి నా సమాధానం ఈ కవిత

నేనూ యుద్ధంలోనే ఉన్నాను
ఇప్పుడల్లా తెల్లారేలా లేదు
యుద్ధ భేరీల మధ్య
ఆట బొమ్మ కోసం
ఒక పసిపిల్ల ఏడుపులా ఉంది
నా పరిస్థితి
కత్తి అంచు మీద నడుస్తున్న కాలానికి
నా కవిత్వంతో పనేంటి ?

యుద్ధం ఎక్కడ జరిగినా
ఎప్పుడు జరిగినా
అక్కడ నేనుంటాను
ఒక క్షతగాత్రంగానో.. ఒక మృతదేహంగానో..!

యుద్ధం అనివార్యమే కావచ్చు
శాంతి అసాధ్యం కాదు
నువ్వు యుద్ధం వైపా శాంతి వైపా అంటే
అటువైపూ ఇటువైపూ ఉండే
ప్రజల వైపే అంటాను

క్రూరులు దాడులు చేస్తారు
వీరులు యుద్ధం చేస్తారు
రక్త దాహానికీ రక్త తర్పణకూ మధ్య
వేలాడుతున్న దేశం ఏదైనా
అక్కడ నేనుంటాను.
ప్రాణభయంతో పారిపోతున్న తల్లిని
పట్టుకొని ఏడుస్తున్న పిల్లాడిలా
అక్కడ నేనుంటాను

అటైనా ఇటైనా మనుషులుంటారు
ఒక చెట్టు లాంటి ఇల్లు కోసమో..
పిట్టల్లాంటి పిల్లల కోసమో
కలలు కురిసే వేళ
కనురెప్పల కింద బాంబుల మోత-
కాలిపోతున్న తోటల్లోంచి
ఎవరిని ఎవరు మోసుకుంటూ
ఏ దిక్కుకు బెదిరి చెదిరిపోతున్నా
వారు భుజం మార్చుకునే చోట
నేనుంటాను

ప్రజలకు జీవితం కావాలి
పాలకులకు రాజ్యం కావాలి
విస్తరణ కాంక్షకూ అస్తిత్వ తపనకూ మధ్య నెత్తురోడుతున్న దేశం ఏదైనా
అక్కడ నేనుంటాను
ఆరడుగుల నేలైనా
అది నా దేశమైతే చాలని
అలమటించే ఆత్మ ఆత్మలో
నేనుంటాను

అటా..ఇటా.. ఎటో
తేల్చి చెప్పమంటే నేనేం చెప్పను..
అటువైపూ ఇటువైపూ వెలిగే
శాంతి కాగడాల ప్రతి కాంతిపుంజంలో నేనుంటాను

ఆక్రమణ యుద్ధం
ఆధిపత్యం యుద్ధం
అణిచివేత యుద్ధం
యుద్ధాన్ని యుద్ధంతో ఎదుర్కొనే యుద్ధంలో
ఆత్మ రక్షణ శిరస్త్రాణగా ధరించి కదిలే
ఒక పిపీలికంతో పాటు
నేనూ యుద్ధంలోనే ఉంటాను

కాలం నిలువెల్లా తడిసిన నెత్తుటి సాక్షిగా యుద్ధం అనివార్యమే కాని
శాంతి అసాధ్యం కాదు

– ప్రసాదమూర్తి
8499866699

LEAVE A RESPONSE