Suryaa.co.in

Andhra Pradesh

ఢిల్లీలో ఒంగోలు వైసీపీ నేత సుబ్బారావు గుప్తా నిరసన

– అమిత్ షా శరణు కోరిన సుబ్బారావు గుప్తా

ప్రకాశం జిల్లా మంత్రి బాలినేని వాసు అనుచరుడు, ఇటీవలి కాలంలో వార్తల్లో ఉన్న ఒంగోలు వైసీపీ నేత సోమిశెట్టి సుబ్బారావు గుప్తా గురువారం అకస్మాత్తుగా ఢిల్లీలో తేలాడు. ఈ మధ్య ఒక సందర్భంలో సుబ్బారావు గుప్తా.. మంత్రులు బాలినేని వాసు, కొడాలి నానితో పాటు పలువురు వైసీపీ ఎమ్మెల్యేలపై

ఘాటు విమర్శలు చేయగా , అది సంచలనం రేపటం తెలిసిందే.ఈ నేపథ్యంలో సుబ్బరావు గుప్తా నివాసంపై దాడి జరిగింది. ఆ తరువాత మంత్రి వాసు ముఖ్య అనుచరుడు సుభానీ గుంటూరులోని ఒక లాడ్జిలో గుప్తాను పట్టుకుని తీవ్రంగా కొట్టిన వీడియో వైరల్ అయింది.

దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురవడం, రాజకీయంగా ఇబ్బందులు తలెత్తడంతో మంత్రి వాసు సమయస్ఫూర్తి ప్రదర్శించి, గుప్తాను బుజ్జగించి సీఎం జగన్ జన్మదిన వేడుకలను అతని సమక్షంలో చేయించారు. దీంతో వివాదం సమసిపోయిందని అందరూ భావించారు.

సుబ్బారావు గుప్తా కూడా వాసు తో తనకు విభేదాలు లేవని, తనపై జరిగిన దాడి కేసు కేసులో చట్టప్రకారం పోలీసులు చర్యలు తీసుకుంటారని ఆ రోజున చెప్పారు. ఆ తర్వాత గుప్తాకు ముఖ్యమంత్రి జగన్ అపాయింట్మెంట్ ఇచ్చారని కూడా ప్రచారం జరిగినా అది కార్యరూపం దాల్చలేదు.

మరి తెరవెనక ఏం జరిగిందో గానీ గురువారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సుబ్బారావు గుప్తా ఒక బ్యానర్ తో నిలబడి ఆ ఫోటోలను మీడియా కు పంపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షానే తనకు ప్రాణ రక్షణ

కల్పించాలని, తన కుటుంబాన్ని కాపాడాలని, తనపై దాడి చేసిన వారిని శిక్షించాలని సుబ్బారావు గుప్తా కోరుతున్నట్లు ఆ బ్యానర్ లో ఉంది. సుబ్బారావు గుప్తా ఢిల్లీకి చేరడం సంచలనంగా మారింది. జిల్లాలో ఇదే ఇప్పుడు చర్చనీయాంశం అయింది

LEAVE A RESPONSE