– మరోసారి జగన్ విశాఖ అస్త్రం
– పెట్టుబడులు పెట్టాలని పిలుపు
– తానూ అక్కడికే ఫిష్టవుతున్నానని వ్యాఖ్య
– వివేకా హత్య కేసును పక్కదారి పట్టించే ఎత్తుగడేనంటున్న రాజకీయ విశ్లేషకులు
– ఇప్పటికే అమరావతి రాజధాని అని హైకోర్టు తీర్పు
– సుప్రీంకోర్టులో కొనసాగుతున్న విచారణ
– ఇన్ని తెలిసి జగన్ కోర్టు ధిక్కరణకు పాల్పడతారా?
– విపక్షాలను రెచ్చగొట్టడమే జగన్ వ్యూహమా?
– రాజధాని సమరంపై సమస్యలు పక్కదారి
– ఇది కోర్టు ధిక్కరణ అన్న టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్
– జగన్ వలలో మళ్లీ చిక్కుతున్న విపక్షం
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఏపీ సీఎం జగన్ ‘విశాఖ’ వ్యూహానికి విపక్షాలు మరోసారి చిక్కాయి. ఢిల్లీలో పెట్టుబడులదారుల భేటీ వేదికగా, జగన్ సంధించిన అస్త్రం అనుకున్నట్లుగానే విపక్షాలకు తాకింది. దానితో విశాఖ రాజధాని రచ్చ మళ్లీ మొదలయింది. ఫలితంగా .. వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ అంశం, సహజంగానే తెరవెనక్కి వెళ్లేందుకు కారణమయింది.
అన్నింటికీ అనువైన ప్రాంతమైన విశాఖలో పెట్టుబడులు పెట్టాలని, సీఎం జగన్ తాజాగా ఢిల్లీలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్, పారిశ్రామికవేత్తల సమావేశంలో పిలుపునిచ్చారు. ‘‘రాబోయే రోజుల్లో రాజధానిగా మారనున్న విశాఖకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. నేను కూడా కొద్ది నెలల్లో విశాఖకు షిఫ్టు అవుతున్నా’’నని.. నింపాదిగా మరో బాంబు పేల్చారు. అంటే విశాఖనే ఏపీ రాజధాని అని, జగన్ వారికి సంకేతాలిచ్చారన్నమాట. జగన్ ఢిల్లీలో పేల్చిన విశాఖ బాంబు, ఆంధ్రాలో రాజకీయ ప్రకంపనలు రేపాయి. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ జగన్ ప్రకటనపై విరుచుకుపడింది.
ఒకవైపు మూడు రాజధానుల అంశం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉండగా, జగన్ విశాఖ రాజధాని ప్రస్తావన తీసుకురావడం, కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు. వివేకా హత్యకు సంబంధించిన కాల్‌డేటా.. సీబీఐ వెలుగులోకి తీసుకువచ్చిన వైనాన్ని ప్రజల దృష్టి మళ్లించేందుకే, విశాఖ రాజధాని అంశాన్ని తెరపైకి తెచ్చారని కేశవ్ విమర్శించారు. యధావిధిగా వామపక్ష నేతలు కూడా, జగన్ ప్రకటనపై విమర్శల వర్షం కురిపించారు.
రోగి కోరుకున్నదీ -వైద్యుడు ఆశించిందీ ఒక్కటే అన్నట్లు.. జగన్ ఆశించిన ప్రతిస్పందనే విపక్షాల నుంచి లభించింది. నిజానికి వివేకా హత్య కేసుపై.. సీబీఐ దూకుడు పెంచిన వైనం, అధికార పార్టీకి ఇరకాటంగా మారిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జగన్‌కు సోదరుడయిన ఎంపి అవినాష్‌రెడ్డిని సీబీఐ విచారించడం, ఆయన విచారణలో మరో ఇద్దరి పేర్లు వెలుగులోకి వచ్చిన వైనం, వైసీపీకి రాజకీయంగా ఇబ్బంది కలిగించే అంశమేనని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
ఇది కింది స్థాయికి వెళ్లి, దానిపై చర్చ జరిగితే అధికారపార్టీకి నష్టం కలిగించే అంశమవుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ తాజా విశాఖ రాజధాని ప్రస్తావన.. కచ్చిత ంగా ‘పొలిటికల్ డైవర్షన్ స్కీమే’నని స్పష్టం చేస్తున్నారు. ఆమేరకు విపక్షాలను విజయవంతంగా రెచ్చగొట్టడంలో, జగన్ వ్యూహం ఫలించిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
వివేకా హత్య కేసుతోపాటు, కోర్టు తీర్పులు, విపక్షాల విమర్శల దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న అధికార పార్టీని, మళ్లీ విశాఖ అంశం రక్షిస్తోందంటున్నారు. విశాఖ అంశం సమస్యలను పక్కదారి పట్టించే అంశం అని విపక్షాలకు తెలిసినా, ఆ అంశాన్ని విపక్షాలు విస్మరించలేని పరిస్థితికి జగన్ తీసుకువచ్చారు. రాష్ట్రంలో ఏదో ఒక ఉపద్రవం, క్లిష్ట సమస్య వచ్చినప్పుడల్లా మంత్రులను ముందుకునెట్టి.. విశాఖలో రాజధాని వస్తుందని చెప్పించడం గత మూడేళ్లుగా చూస్తున్నదే.
అయినా, దానికి సంబంధించి ఎలాంటి చర్యలూ ఇప్పటిదాకా ప్రభుత్వం చేపట్టలేదు. మంత్రుల ప్రకటనలు.. రిషికొండలో అధికార నిర్మాణం ఒక్కటి తప్ప.. రాజధాని విశాఖకు తరలివెళుతోందని చెప్పే ఆధారం, ఇప్పటివరకూ ఒక్కటీ కనిపింలేదు. రాజధాని తరలింపుపై అప్పట్లో ఉద్యోగ సంఘ నేతల హడావిడి, సచివాలయ- కమిషనరే ట్ ఉద్యోగుల్లో కొంత చర్చ జరిగేది. వచ్చే నెలలో తమ ఆఫీసులు విశాఖకు వెళ్లిపోతాయంటూ, అప్పట్లో చర్చలు జరిగేవి. ఇప్పుడు అవి కూడా వినిపించడం లేదు.
ఈ నేపథ్యంలో సీఎం జగన్ చేసిన విశాఖ రాజధాని ప్రకటన, విపక్షాలకు చేతినిండా మరోసారి పని కల్పించినట్టయింది. అది కూడా జగన్ కోరుకున్నదే కావడం విశేషం. నిజానికి ఈ ప్రకటన జగన్ అన్నీ ఆలోచించిన తర్వాత, వ్యూహాత్మకంగానే చేసినట్టుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జగన్ తన వ్యాఖ్యలు, కోర్టు ధిక్కరణకు గురవుతాయన్న అంశం తెలియనంత అమాయకుడు కాదంటున్నారు.
పైగా సుప్రీంకోర్టులో రాజధానిపై ప్రభుత్వం వేసిన అప్పీలు, ఇంకా పెండింగ్‌లోనే ఉందని కూడా జగన్‌కు తెలియదనుకుంటే అమాయకత్వమే అవుతుంది. సుప్రీంకోర్టులో కేసు ఎప్పటికి తేలుతుందో చెప్పడం కష్టం. అందుకే ఆయన నేరుగా విశాఖను రాజధానిగా ప్రకటిస్తున్నామని చెప్పకుండా, దానిని అనేక మలుపులు తిప్పి మాట్లాడిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
‘రాబోయే రోజుల్లో రాజధానిగా మారనున్న’ అనే పద ప్రయోగం, అందులో భాగమేనంటున్నారు. ‘నేను కూడా విశాఖకు మారుతున్నానన్న’ వ్యాఖ్య కూడా , వ్యూహాత్మకంగానే కనిపిస్తోంది. నిజానికి సీఎం ఎక్కడైనా ఉండవచ్చు. విశాఖలో క్యాంపు ఆఫీసు ఏర్పాటుచేసుకునే అధికారం కూడా ఉంది. ఆ కోణంలో జగన్ ఒక బాణం వేస్తే, అది ఎక్కడ-ఎవరికి తగలాలో, సరిగ్గా అక్కడే తగలడం విశేషం.
కాగా ఈ అంశంపై అటు టీడీపీ సీనియర్లు కూడా, తమ పార్టీ నాయకత్వ వైఖరిని తప్పుపడుతున్నారు. తమను రెచ్చగొట్టడానికి, సమస్యలను ప్రజల దృష్టి మళ్లించేందుకే, జగన్ ప్రతిసారీ రాజధాని అంశాన్ని తెరపైకి తీసుకుస్తున్నారని విశ్లేషిస్తున్నారు. ఈ విషయం తెలిసి కూడా, తాము జగన్ ట్రాప్‌లో పడటం ఆశ్చర్యంగా ఉంద ంటున్నారు. గతంలో ప్రత్యేక హోదా అంశంలో కూడా ఇదేవిధంగా, జగన్ ట్రాప్‌లో పడి.. బీజేపీకి దూరమయి, రాజకీయంగా దెబ్బతిన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
‘ జగన్, ఆయన మంత్రులు సమస్యల్లో పడ్డప్పుడల్లా రాజధాని అంశాన్ని ప్రస్తావించడం, మేం దానిపై కొన్ని రోజులు యాగీ చేయడం, ప్రభుత్వం ఎదుర్కొంటున్న సమస్యలు విజయవంతంగా పక్కదారి పట్టడం మూడేళ్లుగా చూస్తున్నాం. అంటే మేమే జగన్ సర్కారు వలలో పడుతున్నాం. ఒకరకంగా సమస్యలను మేమే పక్కదారి పట్టిస్తున్నాం. ఇప్పుడు కూడా అదే పనిచేస్తే ఇక మాకంటే తెలివితక్కువ వారెవరూ ఉండర’ని టీడీపీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఇన్నేళ్ల తమ అనుభవం కన్నా, జగన్ చాలా అనుభవం ఉన్న నేతలా ఎత్తులు వేస్తున్నారన్న వ్యాఖ్యలు టీడీపీ సీనియర్ల నుంచి వినిపిస్తున్నాయి.