Suryaa.co.in

Editorial

జగన్‌ కోర్టుకు హాజరవుతారా?

ఎట్టకేలకు కోడికత్తి కేసుకు మోక్షం
విచారణ ప్రారంభించిన ఎన్‌ఐఏ కోర్టు
బాధితుడు జగన్‌ కూడా హాజరు కావాలని ఆదేశం
ఫిబ్రవరి 15న కోర్టుకు రావాలన్న ఎన్‌ఐఏ కోర్టు
కోర్టుకు జగన్‌ హాజరవుతారా? లేదా?
ఇప్పటికే సీబీఐ కోర్టులో హాజరు మినహాయింపు
హైదరాబాద్‌లో విచారణ రావాలంటే బోలెడు వ్యయమని ప్రభుత్వ వాదన
ఇప్పుడు ఎన్‌ఐఏ కోర్టు విజయవాడలోనే
కోర్టుకు కోడి కత్తి శ్రీను హాజరు
విచారణకు ప్రధానసాక్షి దినేష్‌ గైర్హాజరు
అప్పట్లో తనకు ఏపీ పోలీసులపై తనకు నమ్మకం లేదన్న జగన్‌
చికిత్స చేసిన డాక్టర్‌కు ఏపీ ఆరోగ్యశ్రీ ట్రస్టు బాధ్యతలు
( మార్తి సుబ్రహ్మణ్యం)

గత ఎన్నికల ముందు సంచలనం సృష్టించిన కోడి కత్తి కేసుకు.. నాలుగేళ్ల తర్వాత ఎట్టకేలకూ మోక్షం లభించింది. అప్పటి విపక్షనేత, నేటి సీఎం జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్టులో శ్రీను అనే నిందితుడు, కోడి కత్తితో దాడి చేసిన వైనం రాష్ర్టాన్ని కుదిపేసింది. ఆ ఘటనలో జగన్‌కు 12 కుట్లు పడ్డాయని జగన్‌ వెల్లడించారు. టీడీపీ నేతలే జగన్‌పై హత్యాయత్నం చేయించారని వైసీపీ విమర్శ దాడి చేసింది. అప్పట్లో అదొక ఎన్నికల ప్రచారాంశంగా మారింది. ఆ కేసు విచారణకు హైదరాబాద్‌ వెళ్లిన ఏపీ పోలీసులకు తాను సహకరించనని, ఏపీ పోలీసులపై తనకు నమ్మకం లేదని జగన్‌ విస్పష్టంగా చెప్పిన విషయం తెలిసిందే.

బెయిల్‌ కోసం ప్రయత్నిస్తున్న కోడి కత్తి శ్రీను కథ, విచారణ రూపంలో ఎట్టకేలకూ మొదలయింది. జగన్‌పై దాడి కేసులో నాలుగేళ్ల క్రితం అరెస్టయి, జైలులో మగ్గుతున్న శ్రీను వేసిన బెయిల్‌ పిటిషన్‌ను, కోర్టు అనేకసార్లు తిరస్కరించింది. తన కుమారుడిని అన్యాయంగా ఇరికించారని శ్రీను తలిదండ్రులు, ఇటీవల సీఎం క్యాంపు కార్యాలయం వద్దకు వచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నారు.ఈ క్రమంలో నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ కోర్టు ముందుకు ఈ కేసు విచారణకు వచ్చింది. జనిపల్లి శ్రీనివాసరావును మొదటి ముద్దాయిగా పేర్కొంటూ ఎన్‌ఏఐ 2018లోనే చార్జిషీట్‌ వేసింది.

నాలుగేళ్లపాటు విచారణకు నోచుకోని కోడికత్తి కేసు, హటాత్తుగా మంగళవారం నుంచి ప్రారంభం కావడం ఆసక్తి కలిగించింది. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న విశాఖ ఎయిర్‌పోర్టు అధికారి దినేష్‌ , తాజా విచారణకు హాజరుకాలేదు. తండ్రి మృతి చెందిన కారణంగా దినేష్‌ రాలేకపోతున్నారని, ఆయన న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. మొత్తానికి నాలుగేళ్లపాటు.. అడుగు కూడా ముందుకేయని కోడికత్తి కేసు, హటాత్తుగా విచారణకు నోచుకోవడం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

అయితే ఎన్‌ఐఏ కోర్టు ఈ కేసు విచారణ చేపట్టిన రోజునే.. ఈ కేసులో బాధితుడయిన సీఎం జగన్‌ను కూడా, కోర్టుకు హాజరుకావాలని ఆదేశించడం చర్చనీయాంశమయింది. ఆ మేరకు ఫిబ్రవరి 15న ఆయన, విజయవాడలోని ఎన్‌ఐఏ కోర్టుకు విచారణకు హాజరుకావాలని తాజా ఆదేశాల్లో పేర్కొంది.

ఈ నేపథ్యంలో ఎన్‌ఐఏ కోర్టుకు సీఎం జగన్‌ హాజరవుతారా? లేదా ? అన్న అంశం ఆసక్తికరంగా మారింది.
ఇప్పటికే హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు విచారణకు, ఆయన ప్రతి శుక్రవారం రావలసిన అవసరం లేదన్న మినహాయింపు తెచ్చుకున్నారు. ప్రతివారం హైదరాబాద్‌ రావాలంటే.. ప్రభుత్వ వ్యయం ఖర్చవడంతోపాటు, సెక్యూరిటీ కూడా ఇబ్బందికరంగా ఉంటుందని జగన్‌ న్యాయవాది వాదించారు. దానితో ఆయన కోర్టుకు హాజరుకాకుండా సీబీఐ కోర్టు మినహాయింపు ఇచ్చింది.

తాజాగా ఎన్‌ఐఏ కోర్టు జగన్‌ను ఫిబ్రవరి 15న హాజరుకావాలని ఆదేశించింది. సీబీఐ కేసు హైదరాబాద్‌ కోర్టులో ఉన్నందున, ప్రభుత్వ ధనం- సెక్యూరిటీ కారణాలు చూపించారు. కానీ ఎన్‌ఐఏ కోర్టు విజయవాడలోనే ఉన్నందున, మళ్లీ అవే కారణాలు చె ప్పడం కుదరదని న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి.

అదే సమయంలో ఫిబ్రవరి 15న హాజరువాలని ఆదేశించిన నేపథ్యంలో.. ఆరోజు మరే ఇతర ప్రభుత్వ కార్యక్రమాలు, రూపొందించుకోవడం కుదరదని విశ్లేషిస్తున్నారు. విచారణ తేదీని 15 రోజుల ముందే ప్రకటించినందున, ఆరోజున ప్రభుత్వ కార్యక్రమాలు రూపొందించుకుని. ఆ పేరుతో విచారణకు గైర్హాజరు కోరితే, న్యాయస్థానం అంగీకరించకపోవచ్చంటున్నారు. చూడాలి.. జగన్‌ హాజరుపై ఏం జరుగుతుందో!

కాగా ఈ కేసులో బాధితుడయిన జగన్‌కు చికిత్స చేసిన, సిటీ న్యూరో సెంటర్‌ వైద్యుడిని కూడా విచారణకు పిలుస్తారా? లేదా? అన్న అంశంపై ఇంతవరకూ స్పష్టత లేదు. తనకు 13 కుట్లు పడినందున, 3 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెప్పినట్లు అప్పట్లో జగన్‌ వెల్లడించారు.
ఈ క్రమంలో జగన్‌కు చేసిన చికిత్స గురించి ఆ వైద్యుడిని ఎన్‌ఐఏ విచారిస్తుందా? లేదా? అన్న దానిపై ఇంకా సమాచారం లేదు. కాగా ఆ ఘటనలో జగన్‌కు వైద్యం చేసిన డాక్టర్‌ సాంబశివరారెడ్డికి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పదవి ఇచ్చిన విషయం తెలిసిందే.

LEAVE A RESPONSE