విశాఖ రాజధాని కాబోతోంది.. రండి.. పెట్టుబడులు పెట్టండి

– పారిశ్రామికవేత్తలకు సీఎం జగన్‌ పిలుపు
-విశాఖపట్నంలో మార్చి 3,4 తేదీల్లో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు సందర్భంగా న్యూఢిల్లీలోని లీలా ప్యాలెస్‌ హోటల్‌లో సన్నాహక సమావేశం.
– ఇంటర్నేషనల్‌ డిప్లమాట్‌ అలియన్స్ మీట్‌.
-సమావేశంలో పాల్గొన్న వివిధ దేశాల దౌత్యాధికారులు, కంపెనీల ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు, ఏపీ ఉన్నతాధికారులు
ఈ సందర్భంగా వివిధ దేశాల ప్రతినిధులనుద్దేశించి మాట్లాడిన సీఎం

సీఎం వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే….:
గౌరవనీయులైన దౌత్యాధికారులకు, కాన్సుల్‌ జనరల్స్‌కు, రాయబారులుకు, నా మంత్రివర్గ సహచరులకు, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు, వివిధ కంపెనీల ప్రతినిధులకు, ఇతర ఆహ్వానితులకు స్వాగతం మరియు అభినందనలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గురించి మాట్లాడుతూ సవివరంగా ఇప్పటికే చాలామంది తెలియజేశారు. కియా మోటార్స్‌ ఎండీ అండ్‌ సీఈఓ జిన్‌ పార్క్, టోరె ఇండస్ట్రీస్‌ ఎండీ అండ్‌ సీఈఓ యామా గుచీ, క్యాడ్‌బరీ ఇండియా అధ్యక్షుడు(యూఎస్‌ఏ) దీపక్, ఎవర్టన్‌ టీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ (ఇటలీ) రోషన్‌ గుణవర్దన, అపాచీ అండ్‌ హిల్‌టాప్‌ గ్రూప్‌ (తైవాన్‌) డైరెక్టర్‌ సెర్జియో లీ, సెయింట్‌ గోబియన్‌ ఇండస్ట్రీస్‌ ఇండియా లిమిటెడ్‌(ప్రాన్స్‌) తరపున బి. సంతానం.. వీళ్లందరూ ఆంద్రప్రదేశ్‌ గురించి ఇప్పటికే చాలా వివరంగా మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్‌ పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు మిగిలిన రాష్ట్రాల కంటే భిన్నమైనవి. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు మా వంతు సహకారం మీకు అందిస్తాం. భారతదేశం ఇప్పటికే ఈ విషయంలో ప్రపంచ వేదికపై ముందు వరుసలో ఉంది. ఈ విషయంలో ప్రధాని శ్రీ నరేంద్రమోదీగారికి కృతజ్ఞతలు. ఇక భారతదేశంలో రాష్ట్రాలను తీసుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న సానుకూల అంశాల గురించి మీతో కొన్ని విషయాలను పంచుకోవాలి.

11.43 శాతం జీఎస్‌డీపీతో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా అగ్రగామిగా నిలిచింది. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో కూడా గడిచిన మూడేళ్లుగా ఏపీ దేశంలోనే నంబర్‌వన్‌ స్ధానంలో నిల్చింది. పరిశ్రమల స్ధాపనకు మేం చేస్తున్న కృషితో పాటు పారిశ్రామిక వేత్తలు ఇచ్చిన ఫీడ్‌ బ్యాక్‌తోనే మేం గత మూడేళ్లుగా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో నెంబర్‌వన్‌ స్ధానంలో స్ధిరంగా కొనసాగుతున్నాం. దీని ద్వారా పరిశ్రమల స్ధాపనకు, పారిశ్రామిక వేత్తలకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఎంత అనుకూలంగా ఉందన్నది స్పష్టమవుతోంది.

ఏపీకి 974 కిలోమీటర్ల సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది. నాలుగు ప్రాంతాల్లో 6 పోర్టులు ఇప్పుడు రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటకి అదనంగా మరో నాలుగు పోర్టులను నిర్మిస్తున్నాం. 6 విమానాశ్రయాలు కూడా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మూడు పారిశ్రామిక కారిడార్లను కూడా నిర్మిస్తున్నాం. దేశంలో 11 పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటవుతుంటే అందులో ఏపీలోనే మూడు కారిడార్లును అభివృద్ధి చేస్తున్నాం. రాష్ట్రంలో జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధికి, పారిశ్రామిక వేత్తలకు ఏ స్ధాయిలో ప్రోత్సహాం ఇస్తున్నామన్నదానికి నిదర్శనమిది. రాష్ట్రంలో 48 రకాల ఖనిజాల లభ్యత ఉంది. ఇవన్నీ ఏపీలో ఖనిజాధార కంపెనీల ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నాయి. ప్రధానంగా పరిశ్రమలు అనుమతులు విషయంలో సింగిల్‌ డెస్క్‌ పోర్టల్‌ విధానం అమల్లో ఉంది. పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి 21 రోజుల్లో అనుమతులు మంజూరు చేస్తున్నాం. వేగవంతంగా అనుమతులు మంజూరు చేయడం ద్వారా పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామిక వేత్తలకు ఏపీ ప్రభుత్వం అత్యంత అనుకూలంగా ఉంది.

రాష్ట్రంలో అనేక ఇండస్ట్రియల్, ఎలక్ట్రానిక్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్లు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా టాయ్‌ క్లస్టర్లు, పుడ్‌ ప్రాసెసింగ్, టెక్ట్స్‌టైల్, సిమెంట్‌ క్లస్టర్లు, మెడికల్‌ డివైసెస్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్, ఫార్మా, ఆటోమొబైల్‌ క్లస్టర్లు సిద్దంగా ఉన్నాయి. విశాఖపట్నం త్వరలో కార్యనిర్వాహక రాజధాని కాబోతుంది. విశాఖలో పెట్టుబడులకు మిమ్నల్ని ఆహ్వానిస్తున్నాం. రానున్న కొద్ది నెలల్లో నేను కూడా విశాఖకు షిప్ట్‌ అవుతున్నాను. గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ను విశాఖలో మార్చి 3,4 తేదీలలో నిర్వహించబోతున్నాం. నేను మీ అందరినీ వ్యక్తిగతంగా ఆ సమ్మిట్‌కు హాజరు కావాలని ఆహ్వానిస్తున్నాను. సదస్సుకు హాజరు కావడంతో పాటు ఇక్కడ పెట్టుబడులకు కూడా ముందుకు రావాలి. మీతో పాటు మీ సహచరులను ఇతర కంపెనీ ప్రతినిధులను కూడా ఆ సదస్సుకు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు స్ధాపన, వ్యాపారం ఎంత సులభతరమో చూపించాలి. మరొక్కసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మనందరం మరొక్కసారి విశాఖపట్నంలో సమావేశమవుదాం. ఈ సమావేశంలో ఏపీ పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌ కూడా పాల్గొన్నారు.

Leave a Reply