రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు చంద్రబాబు ఆదేశాలు…
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, నవ్యాంధ్రప్రదేశ్ తొలి శాసనసభాపతి, స్వర్గీయ డాక్టర్ కోడెల శివప్రసాదరావు వర్ధంతి వేడుకలను ఈనెల 16వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు రాష్ట్ర పార్టీ కి ఆదేశాలు అందజేశారు.
తన తండ్రి స్వర్గీయ డాక్టర్ కోడెల శివప్రసాద్ రావు వర్ధంతి సందర్భంగా ఈనెల 16వ తేదీన సత్తెనపల్లి పట్టణం నందు అన్నా క్యాంటీన్ ప్రారంభం మరియు డాక్టర్ కోడెల శివప్రసాదరావు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి యువ నేత డాక్టర్ కోడెల శివరాం బుధవారం అధినేత చంద్రబాబు నాయుడును సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కోడెల శివప్రసాదరావు పార్టీకి చేసిన సేవలు వెలకట్టలేనివి అని అటువంటి మహానేత వర్ధంతిని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలని రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు కు సూచించి అందుకు సంబంధించిన ప్రణాళిక రూపొందించి వెంటనే కార్యచరణ మొదలు పెట్టాలని ఆదేశించారు.
అదేవిధంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో కూడా పార్టీని బలోపేతం చేయాలని యువ నేత డాక్టర్ కోడెల శివరాంకు అధినేత చంద్రబాబు సూచించారు. నియోజకవర్గంలో జరుగుతున్న సమస్యలు ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు గురించి అధినేత దృష్టికి డాక్టర్ కోడెల శివరాం తీసుకువెళ్లగా తాను నియోజకవర్గ పరిస్థితులపై ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తున్నానని త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ప్రజలందరినీ కలుపుకొని పోయి పార్టీని ముందుకు తీసుకువెళ్లాలని సరైన సమయంలో సముచిత స్థానం తప్పక కల్పిస్తామని చంద్రబాబు యువ నేత డాక్టర్ కోడెల శివరాం కు భరోసానిచ్చారు. కార్యక్రమంలో కోడెల వెంట తెలుగుదేశం పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.