ఏంటో…ఈ ఆస్కార్ గోల…!?

( సంపత్‌రాజు)

మన్యం వీరుడి
జీవిత కథ ఇతివృత్తంగా నభూతో…
న భవిష్యత్ అన్న స్థాయిలో హీరో కృష్ణ తీసిన
అల్లూరి సీతారామరాజు…
సినిమా ఆస్కార్ పరిశీలనకు వెళ్లిందా…లేదే…!

గిరిజన పోరాట వీరుడు
కొమరం భీం జీవిత చరిత్రను
అల్లాణి శ్రీధర్ తనదైన శైలిలో
తెరకెక్కిస్తే ఆ సినిమా హిట్టు కూడా కొట్టలేదు…!

అల్లూరి సినిమాకి…కొమరం భీం బైస్కోపుకి అవార్డులైతే వచ్చాయి గాని వారి కథలను తనకు నచ్చిన రీతిలో మార్చేసి…సినిమా తీస్తే అది ప్రభంజనం…జనాల్లో అల్లూరి…కొమరం భీం సినిమాలు చూసినప్పుడు ఉప్పొంగని దేశభక్తి ఇప్పుడు
పరవళ్ళు తొక్కేసింది…!

అల్లూరి…అఫ్కోర్స్… స్వాతంత్ర సముపార్జన కోసమే బ్రిటిష్ దొరల దగ్గర
కూలీకి పని చేసినట్టు చూపిస్తే…ఆ సినిమా కళాఖండం అయింది…

ఇంతకీ…ఆ సినిమాలో కొమరం భీం స్వతంత్ర సాధన కోసం చేసింది ఏమిటో…
గోండు జాతి పిల్లని దొరసాని తీసుకుపోయి తన అంతఃపురంలో బందీగా ఉంచుకుంటే ఆ పిల్లని విడిపించడానికి నడుం కట్టి సాహసాలు చేశాడు…అదే క్రమంలో రాజు మంచోడే
అని తెలుసుకుని అతన్ని విడిపించి ప్రేమించిన అమ్మాయి చెంతకు చేరుస్తాడు…!

ఇదేగా కథ…స్థూలంగా రెండు లవ్ స్టోరీలు…వాటికి స్వతంత్ర పోరాటం బ్యాక్ గ్రౌండ్ అద్ది మొత్తం సినిమా అంతా స్వరాజ్య సాధన కోసం ఇద్దరు వీరులు సాగించిన దేశభక్తి ప్రేరకమైన
పోరాటంగా బిల్డప్ ఇచ్చి…మొత్తంగా జరిగిన హంగామా…!

ఈ లవ్ స్టోరీల్లో మళ్లీ భీం ప్రేమకథ 1979 లో వచ్చిన శ్యామ్ బెనెగల్ జనూన్ కథ కాపీ…ఇది ఎవరూ లాగని కూపీ…!

మొత్తమ్మీద ఇన్ని కథలు కలగలిపి చేసిన కిచిడీ…
ఇక దొరలకి తెలియని సాంకేతిక విలువలా…
మన విఠలాచార్య చూపించని మేజిక్కులా…!

సరే..రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమాకి…సారీ అందులోని
నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు రావడం తెలుగు వారికే కాదు యావత్ భారత జాతికి గర్వకారణమే…విశ్వవేదికపై
తెలుగు సినిమా పతాకం
ఉవ్వెత్తున ఎగరడం తెలుగువారందరికీ సంతోషమే…అయితే ఈ పాట క్రెడిట్ ఎవరిది…ఆలోచన పుట్టి
ఆ సన్నివేశం క్రియేట్ చేసిన దర్శకుడు…ఆయన చెప్పిన సన్నివేశానికి తగినట్టో… తగనట్టో…మొత్తానికి తగ్గనట్టో పాట రాసి పెట్టిన రచయిత…నాటు నాటు స్ఫూర్తికి సరిపడా బీటు సమకూర్చిన సంగీత దర్శకుడు…ఆయన కోరిన రీతిలో పాడిన గాయకులు…
ఆ బీటుకు అతికినట్టు నృత్య దర్శకత్వం…
అంతిమంగా అది సినిమా గనక…హీరోల సామ్రాజ్యం గనక అద్భుతంగా అభినయించిన ఇద్దరు నాయకులు… ఇందరి సమిష్టి కృషి ఆస్కార్…ఈ గెలుపు
భారతీయ సినిమాకు పండగ…నిస్సందేహం…!

ఇంతకు మించిన కథ… చిత్రీకరణ…అత్యద్భుత సాహిత్యం…అపురూప గానం…అసాధారణ అభినయం…తెలుగు వీర లేవరా…దీక్ష బూని సాగరా…దేశమాత స్వేచ్చ కోరి తిరుగుబాటు చేయరా
స్వతంత్రం వచ్చిన ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత కూడా(1947…అల్లూరి సీతారామరాజు విడుదలైన సంవత్సరం 1974)తెల్ల దొరలను గడగడలాడించిన
మహాకవి గీతం ఇప్పుడు తెల్లబోదా…!

ఓకే…ఆస్కార్ అవార్డు ఒక్క నాటు నాటు పాటకు మాత్రమే రాలేదు కదా…
మన దేశంలోనే ఒక మహిళ
తీసిన డాక్యుమెంటరీ
ది ఎలిఫెంట్ విస్పరర్స్
గురించి ఇంత హంగామా లేదే…ఇది మన జాతికి గర్వకారణం కాదా…
ఈ విజయం గురించి
చాలా తక్కువ మాటాడుతున్నారే…
గ్రౌండ్ వర్క్…పోస్ట్ పబ్లిసిటీ లేవనేగా…!

నిజానికి ఇది కూడా చాలా గొప్ప విజయం…దీని వెనక
కోట్ల రూపాయల ఖర్చు లేదు…ఆదాయం అంతకంటే లేదు…సాంకేతిక హంగామా…ప్రచారం…మేనేజ్మెంట్…ఇవేవీ కానరావు…
చెప్పాలంటే ఒక సాధారణ మహిళ…తన కుటుంబం సహకారంతో తీసిన లఘు చిత్రం…సోలోగా ఆస్కార్ అవార్డు …అది కూడా దర్శకురాలు భరతమాతకు
అంకితం చేసిన వైనం…
ఇవన్నీ గుర్తింపునకు నోచుకోని విధానం…
కమర్షియల్ సినిమా మహత్తు…దాని వెంటే పడుతుంది కదా
ఈ జగత్తు…!

నాటు నాటుకు ఆస్కార్ రావడం నాకూ సంతోషమే…
కాని సంతోషించి ఊరుకోలేము కదండీ…
అన్ని కోణాలు చూడాల్సిందే కదా…

Leave a Reply