Suryaa.co.in

Andhra Pradesh

మాతృభాషే మన చిరునామా!

– తెలుగువారు ఎక్కడున్నా తెలుగులోనే మాట్లాడుకోవాలి
– మనుగడ కోసం ఇతర భాషలూ అవసరమే
– తల్లిలాంటి మాతృభాష అన్నింటికన్నా ముఖ్యం
– గత ప్రభుత్వం తెలుగును చంపేయాలనుకుంది
– శాసన సభ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు

విజయవాడ: మన చిరునామా మాతృభాష అని, మాతృభాషను ప్రేమించని వాడు, తల్లిని ప్రేమించని వాడితో సమానమని ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో ఆదివారం సాయంత్రం ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర ఆధ్వర్యంలో వారధి కార్యక్రమం జరిగింది.

ముఖ్య అతిథిగా హాజరైన ఉపసభాపతి రఘురామ మాట్లాడుతూ.. తెలుగువారికి భాష మీద మమకారం ఉండేలా, ఆ మూలాలు మర్చిపోకుండా ఉండాలి అంటే వారికి మాతృభాషలో చదువుకునే విధంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అవకాశం ఇవ్వాలని అన్నారు. అదే ఉద్దేశంతో రాజ్యాంగం ప్రతిపాదిస్తే, కొందరు విద్యాశాఖాధికారులు రాష్ట్ర సరిహద్దుల్లో అటు ఇచ్చాపురంలో ఒడియా వారికి, ఇటు తమిళనాడు సరిహద్దుల్లో తమిళులకు వారి మాతృభాషల్లో పాఠశాలలు పెట్టమనే కానీ తెలుగు పాఠశాలల గురించి కాదని వక్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు.

పక్క రాష్ట్రాల వారి పిల్లలకు వారి మాతృభాష గురించి చెప్పమనడం అంటే మన రాష్ట్రంలో తెలుగు వద్దని కాదని అర్థం చేసుకోవాలని హితవు పలికారు. మనం తప్పనిసరిగా మాతృభాష మాధ్యమాన్ని అమలు చేయడంతోపాటు, వారికి కూడా అవకాశం కల్పించాలనే ఆలోచన అని, కానీ పరమానందయ్య శిష్యుల్లాగా అర్థం చేసుకోలేకపోతే తాను నచ్చజెప్పే ప్రయత్నం చేశానని వివరించారు. అయినా వారికి అర్థం కాలేదని, ఇకనైనా అర్థం చేసుకోవాలని సూచించారు.

అదృష్టవశాత్తూ తెలుగు ప్రజలు తమ భాషకు, జాతికి జరుగుతున్న అన్యాయాన్ని తెలుసుకోగలిగారన్నారు. పరాయి భాషలను నేర్చుకుందాం కానీ తెలుగును విస్మరించకూడదని పునరుద్ఘాటించారు. అందరూ తెలుగులో రాయగలగాలి, చదవగలగాలని ఆకాంక్షించారు. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అన్న తెలుగులో ఉన్న పద్యం ఇతర భాషల్లో పద్యం అనే ప్రక్రియ లేదని, అంతటి ఉత్కృష్టమైన భాష మన తెలుగని ప్రశంసించారు. ఎన్నో సాహిత్య విలువలున్న తెలుగు భాష మనకుందన్నారు.

అందుకే మనం మర్చిపోకూడదని, తెలుగు భాష సంపదను కాపాడుకుంటూ తెలుగువారందరినీ ఒక చోటకు చేర్చిన ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర అధ్యక్షుడు గంజి జగన్ బాబు, ప్రధాన కార్యదర్శి కంటె అశోక్, సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. తెలుగు మాట్లాడాలంటే కొందరు ఫీలవుతున్నారని, కానీ తమిళనాడులో తమిళం మాట్లాడకపోతే ఫీలవుతారని గుర్తు చేశారు. మనుగడకు అన్ని భాషలు అవసరమే కానీ, మాతృభాషను మర్చిపోయేలాగా కాదని ఉపసభాపతి స్పష్టం చేశారు. మనం మనుగడ సాగించాలంటే ఇతర భాషలు కూడా తప్పనిసరిగా నేర్చుకోవాలి కానీ, మన భాషను మర్చిపోయి కాదని పునరుద్ఘాటించారు.

ఈ సందర్భంగా గతంలో పార్లమెంటులో మాట్లాడింది గుర్తు చేశారు. రాజ్యాంగంలోని 350 ఏ ఆర్టికల్‌లో ఎక్కడైనా సరే ఐదో తరగతి వరకు మాతృభాష మాధ్యమంలో అవకాశం ఇవ్వాలని ఉందని, ఆ వయసులో అవగాహన, అర్థం చేసుకునే శక్తి మాతృభాషలో అయితే ఉంటుందని తెలిపారు. మాతృభాషను ప్రేమించని వాడు తల్లిని ప్రేమించని వాడితో సమానమన్న నానుడిని గుర్తు చేశారు. మన సంస్కృతి, సంప్రదాయం అయిన మన తెలుగు భాషను మనం మర్చిపోవడం చాలా దురదృష్టమన్నారు.

గత ప్రభుత్వంలో నాలుగున్నర సంవత్సరాల క్రితం తెలుగు భాషను చంపేయడం తగదని మాట్లాడినందుకు నాలుగేళ్లు ఢిల్లీలోనే ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ పుట్టిన మాజీ ముఖ్యమంత్రి జగన్ మన భాషను ద్వేషిస్తే, ఎక్కడో మహారాష్ట్రలో నివసిస్తు్న్న జగన్ బాబు మన తెలుగు భాష మాట్లాడేవారందరినీ కలపాలనే ఉద్దేశంతో ఈ సభ నిర్వహించడం ఎంతో సంతోషాన్నిస్తోందని పేర్కొన్నారు. ఫెడరేషన్ ఆఫ్ మహారాష్ట్రతోపాటు ఇప్పుడు ఏర్పాటు చేసిన ఆంధ్రా, తెలంగాణ, మహారాష్ట్ర చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ లోగోను ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమన్నారు.

తెలుగు వారిని గౌరవించుకోవాలని, తెలుగు వారు కలుసుకున్నప్పుడు మనమందరం మాతృభాషలో మాట్లాడుకోవడం మన భాషకు ప్రాచుర్యం కల్పించినట్లవుతుందని ఉపసభాపతి రఘురామకృష్ణం రాజు పునరుద్ఘాటించారు. కార్యక్రమంలో పాల్గొన్న సినీ నటుడు సుమన్ మాట్లాడుతూ తెలుగు సినిమాల్లో నటించడం వల్ల భాషపై మమకారం మరింత పెరిగిందన్నారు. తెలుగువాడిగా జన్మించడం మనకు గర్వకారణమన్నారు.

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీ శ మాట్లాడుతూ తెలుగు సాహిత్యానికి ఎంతో చరిత్ర ఉందని, ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత మనపైనే ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర ప్రతినిధులు, సాహిత్యప్రియులు, తెలుగు భాషాభిమానులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE