– రాష్ట్ర విభజన నుంచి జరిగిన అన్ని స్కామ్‌లపై చర్చిద్దామని కోరాం
– టీడీపీ హయాంలో జరిగిన స్కామ్‌లపై చర్చకు ప్రభుత్వం నిరాకరించింది
– కేవలం గత ప్రభుత్వ స్కాంలపైనే చర్చ జరగాలని టీడీపీ పట్టుబట్టింది
: శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ
అమరావతి: వైయస్ఆర్‌సీపీ పాలనపై బుదరచల్లేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. అసెంబ్లీ బయట మీడియా పాయింట్‌లో వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ గత వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో జరిగిన స్కాంలపై చర్చించాలంటూ అధికారపక్షం పట్టుబట్టడం వెనుక కుట్ర దాగి ఉందని అన్నారు. అసలు విచారణే జరగకుండా కేవలం ఆరోపణలను స్కామ్‌లుగా చిత్రీకరించి వైయస్‌ఆర్‌సీపీ పాలనపై విషం చిమ్మేందుకు ప్రయత్నించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
లేనిది ఉన్నట్లుగా… ఉన్నది లేనట్లుగా చిత్రీకరించడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. అలాగే ఈ రోజు స్కామ్‌లపై చర్చ అంటూ మండలిలో అధికారపక్షం హంగామా చేసింది. రాష్ట్ర విభజన తరువాత నుంచి ఇప్పటి వరకు అంటే 2014-24 వరకు జరిగిన స్కామ్‌లపై చర్చించాలని వైయస్‌ఆర్‌సీపీగా ప్రభుత్వాన్ని కోరాం. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం కేవలం వైయస్‌ఆర్‌సీపీ పాలన అంటే 2019-24 వరకు మాత్రమే చర్చకు సిద్దమని ప్రకటించింది.
అసలు గత అయిదేళ్ళ పాలనలో జరిగిన వాటిపైన కూటమి ప్రభుత్వం ఈ పదినెలల్లో పలు ఆరోపణలు మాత్రమే చేసింది. ఈ ఆరోపణలపై దర్యాప్తు కూడా పూర్తి కాలేదు, నిరూపణ జరగలేదు. అటువంటప్పుడు వైయస్‌ఆర్‌సీపీ పాలనలో స్కామ్‌లు అంటూ మీరు చేసిన తప్పుడు ఆరోపణలపైన సభలో ఎలా చర్చిస్తారని అధికారపక్షాన్ని నిలదీశాం. 2014-19 మధ్య తెలుగుదేశం పాలనలో పలు కుంభకోణాలు జరిగాయి. వాటిపై కేసులు కూడా నమోదయ్యాయి. దర్యాప్తు కూడా పూర్తయ్యింది. వాటిపై మాత్రం చర్చకు వచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించడం లేదు.
ఇది కూటమి ప్రభుత్వ ద్వందవైఖరి కాదా? స్కామ్‌లపై చర్చకు వైయస్‌ఆర్‌సీపీ సిద్దంగా ఉంది. ప్రజలకు వాస్తవాలను వెల్లడించేందుకు సుముఖంగా ఉంది. కానీ దురుద్దేశపూర్వకంగా చర్చను గత ప్రభుత్వ కాలానికే పరిమితం చేయాలని చూడటం దుర్మార్గం. దీనికి నిరనసగా మండలి నుంచి వాకౌట్ చేశాం.