Suryaa.co.in

Telangana

మాది ఇండియా టీం….కాంగ్రెస్ ది పాకిస్తాన్ టీం

– 27న జరిగే మ్యాచ్ లోనూ కాంగ్రెస్ టీంను చిత్తుగా ఓడిస్తాం
– 14 నెలల పాలనపై ఎమ్మెల్సీ ఎన్నికలే రెఫరెండంగా తీసుకుందామా?
– సీఎం వస్తే…టీచర్లకు డీఏలు, జీపీఎఫ్ పైసలు, రిటైర్డ్ మెంట్ బెన్ ఫిట్స్ ప్రకటిస్తారని భావించినం
– గుజరాత్, మధ్యప్రదేశ్ లోనే కాదు…తెలంగాణలోనూ ఎప్పటి నుండో దూదేకులవంటి కులాలకు రిజర్వేషన్లు అమలవుతున్నయ్
– 12.5 శాతం ముస్లిం జనాభాలో 10.8 శాతం మందిని బీసీల్లో కలుపుతామంటే ఎందుకు ఒప్పుకుంటాం?
– నూటికి 88 మందికిపైగా ముస్లింలను బీసీల్లో కలిపితే బీసీల పొట్ట కొడితే ఊరుకునే ప్రసక్తే లేదు
– కాళేశ్వరం, డ్రగ్స్, ఫార్ములా ఈ రేస్ కేసుల్లో కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే దమ్ము మీకు లేదా?
– హైదరాబాద్ సొమ్మును ఆదిలాబాద్, ఆసిఫాబాద్ వంటి వెనుకబడి ప్రాంతాలకు నిధులు ఖర్చు చేస్తోంది నిజం కాదా?
– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి బండి సంజయ్

కరీంనగర్: ‘‘మొన్న జరిగిన ఇండియా పాకిస్తాన్ ఛాంపియన్ ట్రోఫీ మ్యాచ్ లో ఇండియా గెలిచింది. బీజేపీది ఇండియా జట్టు. పాకిస్తాన్ గెలిస్తే సంబురాలు చేసుకునే ఎంఐఎంతో అంటకాగుతున్న కాంగ్రెస్ ది పాకిస్తాన్ జట్టు. ఈనెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల మ్యాచ్ లోనూ గెలుపు బీజేపీదే. పాకిస్తాన్ ను చిత్తు చేసి తీరుతాం’’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ 14 నెలల పాలన బాగుందని విర్రవీగుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను రెఫరెండంగా తీసుకునేందుకు సిద్దమా? అని సవాల్ విసిరారు.

తెలంగాణసహా ఏ గ్రామానికి, ఏ మున్సిపాలిటీ, కార్పొరేషన్ కు కేంద్రం ఎన్ని నిధులిచ్చింది? రాష్ట్రం ఎంత ఖర్చు చేసిందనే వివరాలపై లెక్కా పత్రంతో సహా బహిరంగంగా చర్చించేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. తాము గతంలోనే సవాల్ చేస్తే సీఎం తోకముడిచిన విషయాన్ని గుర్తు చేశారు.

ఈరోజు ఉదయం కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు పాయల శంకర్, కాటేపల్లి వెంకటరమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్పలతో కలిసి బండి సంజయ్ మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

సంజయ్ ఏమన్నారంటే…..ఈనెల 27న ఎమ్మెల్సీ ఎన్నికల పేరుతో తెలంగాణలో ఇండియా టీం, పాకిస్తాన్ టీం మధ్య మ్యాచ్ జరగబోతోంది. ఇండియా గెలవాలనుకుంటే బీజేపీకి ఓటేయండి. పాకిస్తాన్ గెలవాలనుకుంటే కాంగ్రెస్ కు ఓటేయండి. బీజేపీ గెలిస్తే పట్టభద్రుల, టీచర్ల ఆకాంక్షలను నెరవేరుస్తాం.

కుల గణనకు మేం వ్యతిరేకం కానేకాదు. బీసీ జాబితాలో ముస్లింలను చేర్చడాన్ని వ్యతిరేకిస్తున్నాం. తెలంగాణలోనూ ఎప్పటి నుండో దూదేకుల కులాలకు ఎప్పటి నుండో రిజర్వేషన్లు అమలు… మేం ఏనాడూ అభ్యంతర పెట్టలేదు. కానీ 12.5 శాతం జనాభా ఉన్న ముస్లిం జనాభాలో 8.8 శాతం మందిని బీసీల్లో కలుపుతామంటే ఎందుకు ఒప్పుకుంటాం?. నూటికి 88 మందికిపైగా ముస్లింలను బీసీల్లో కలిపి నిజమైన బీసీల పొట్టకొడతారా?. ముస్లింలందరినీ బీసీల్లో చేర్చి బిల్లు పంపితే ఎందుకు ఆమోదించాలి? 60 లక్షల మంది బీసీల జనాభా ఎట్లా తగ్గిందో సమాధానం చెప్పాలి. సమగ్ర కుటుంబ సర్వేలో బీసీ జనాభా 56 శాతం జనాభా ఉందని నాటి మంత్రులు కేటీఆర్, హరీష్ అసెంబ్లీలో చెబితే ఎందుకు అభ్యంతరం చెప్పలేదు?.

ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైకోర్టులో పిటిషన్ వేసి సీబీఐ విచారణ జరిపించాలని కోరితే ప్రభుత్వం ఒప్పుకోని విషయం నిజం కాదా?. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాతే ప్రభాకర్ రావు, శ్రవణ్ విదేశాలకు పారిపోయారు. మీరు వాళ్లను అరెస్ట్ చేయకుండా పారిపోయేలా చేసిందే కాంగ్రెస్. మీరు విదేశాలకు పంపిస్తే…మేం పట్టుకురావాలా? కేసీఆర్ చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని పోలీసులు చెప్పిన తరువాత కూడా ఆయనకు కనీసం నోటీసు కూడా ఎందుకియ్యలే?.

కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే సాహసం కూడా చేయలేని అసమర్ధులు మీరు. ఫాంహౌజ్ డ్రగ్స్ లో కేటీఆర్ ఉన్నాడని చెప్పింది రేవంత్ రెడ్డే కదా?. విద్యుత్ కొనుగోళ్ల అక్రమాలపై జస్టిస్ లోకూర్ కమిషన్ నివేదిక ఇచ్చి 3 నెలలైనా ఇంతవరకు ఎందుకు బయటపెట్టలేదు?. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ వల్లే ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగమైందని సీఎం హోదాలో రేవంత్ రెడ్డే చెప్పారు.. ఎందుకు అరెస్ట్ చేయలేదు?

కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏడాదిగా విచారణ కమిషన్ గడువును పొడిగిస్తున్నారే తప్ప కేసీఆర్ ను ఎందుకు విచారించలేదు?. మీరు విచారణ చేస్తూ కేంద్రం ఎందుకు పట్టుకురావడం లేదంటే ఏమనాలి?. మీకు దమ్ముంటే సీబీఐ విచారణ కోరండి… కేసును సీబీఐకి అప్పగించండి. దోషులందరినీ అరెస్ట్ చేసి బొక్కలో వేస్తాం.

యమునా, గంగా, సబర్మతి ప్రక్షాళనకు అతి తక్కువ ఖర్చుతో చేశారు. కాంగ్రెస్ అగ్రనేత అల్లుడి కోసం రూ.15 వేల కోట్ల ఖర్చయ్యే మూసీ ప్రక్షాళనను రూ.1.5 లక్షలకు పెంచి కమీషన్లు దొబ్బాలనుకుంటే కేంద్రం ఎందుకు సహకరించాలి?.

తెలంగాణ నుండి రూపాయి వెళితే 42 పైసలే కేంద్రం ఇస్తోంది… బీహార్, యూపీలకు ఎక్కువ ఇస్తున్నారని చెప్పడమేంది? వెనుకబాటు ఆధారంగా కేంద్రం ఆయా రాష్ట్రాలకు నిధులను పంపిణీ చేస్తున్న విషయం మీకు తెలియదా? తెలిసి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలనుకుంటున్నారా? తెలంగాణ రెవిన్యూలో అత్యధిక షేర్ హైదరాబాద్ దే…. కానీ ఆదిలాబాద్, ములుగు వంటి వెనుకబడిన జిల్లాలకు అధిక నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది? అట్లని హైదరాబాద్ కు అన్యాయం చేసిందని అనుకోవాలా?.

యూపీఏ 10 ఏళ్ల పాలనలో 2.94 కోట్ల ఉద్యోగాలను మాత్రమే స్రుష్టించింది. మోదీ 10 పాలనలో 17 కోట్ల 19 లక్షల ఉద్యోగాలను స్రుష్టించింది నిజం కాదా?. రెండేళ్లలోనే రోజ్ గార్ మేళా పేరుతో 9 లక్షల 25 వేల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసింది నిజం కాదా?. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తానన్నవ్…ఎటు పోయింది?. తెలంగాణ అభివ్రుద్ధిలో కేంద్రం ఏం చేసింది? రాష్ట్రం ఏం చేసిందనే విషయంపై గ్రామాల వారీగా లెక్కలతో సహా చర్చకు సిద్ధం. మేం సవాల్ చేస్తే సీఎం తోకముడిచారు.

ఎమ్మెల్సీ ఎన్నికల క్రికెట్ మ్యాచ్ లో బీఆర్ఎస్ జట్టే లేదు… ఆ టీంకు సభ్యులే లేక మ్యాచ్ నుండి వైదొలగింది. వరి వేస్తే ఉరేనని కేసీఆర్ అంటే…. రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి కూడా వరి వేయుద్దు… వేస్తే నష్టపోతారని రైతులను హెచ్చరిస్తున్నారు… మీకు, బీఆర్ఎస్ పాలనకు తేడా ఏముంది? ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు పడ్డా నీటి కటకట ఎందుకొచ్చింది? మీ అసమర్ధత, పొరుగు రాష్ట్రానికి నీటిని దోచిపెట్టడంవల్లే ఈ దుస్థితి వచ్చింది.

ప్రధాని మోదీని పెద్ద బీసీ, నన్ను చిన్న బీసీ అంటూ బీసీ సమాజాన్ని అవమానిస్తవా? మోదీ బీసీయే కాదని చెప్పిన ముఖ్యమంత్రే… ఇయాళ పెద్ద బీసీ అంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు వస్తుంటే…రూ.4 వేల నిరుద్యోగ భ్రుతి, 2 లక్షల ఉద్యోగాల భర్తీ, ఉద్యోగులకు డీఏలు, జీపీఎఫ్ సొమ్ము, రిటైర్డ్ బెన్ ఫిట్స్, ఫీజు రీయంబర్స్ బకాయిలపై ప్రకటన చేస్తారని ఆశపడ్డ పట్టభద్రులు, ఉద్యోగులను నిరాశకు గురి చేసినవ్. ఉద్యోగులకు ప్రతినెలా జీతం ఇవ్వడం మీ బాధ్యత… వాళ్లు పనిచేస్తేనే జీతాలిస్తున్నవ్ కదా… ఏదో బిచ్చమేస్తున్నట్లు మాట్లాడతారా?. 6 గ్యారంటీలు సహా మేనిఫెస్టో హామీలన్నీ అమలు చేశారని భావిస్తే… ఆ పార్టీకే ఓటేయండి.

మీ సమస్యలపై నిరంతరం పోరాడుతూ సర్కార్ మెడలు వంచేది బీజేపీయే అనుకుంటే మాకు మద్దతివ్వండి. మీకు ఏ కష్టమొచ్చినా బీజేపీ అండగా ఉంటుంది. ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిల ఇప్పించేలా మీతరపున కొట్లాడుతోంది బీజేపీయే.

కాంగ్రెస్ కు ఎందుకు ఓటేయాలి? 14 నెలల్లో మీరు ఒరగబెట్టిందేమిటి? 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయనందుకా? నిరుద్యోగ భ్రుతి ఇవ్వనందుకా? మహిళలకు నెలనెలా రూ.2500లు ఇవ్వనందుకా? తులం బంగారం, స్కూటీ ఇవ్వనందుకా? రైతు భరోసా ఎగ్గొట్టినందుకా? 20 లక్షల మందికి రుణమాఫీ ఎగ్గొట్టినందుకా? విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు ఇవ్వనందుకా? ఉద్యోగ, ఉపాధ్యాయులకు 5 డీఏలియ్యనందుకా? పెన్షన్ పైసలు ఇయ్యనందుకా? దాచుకున్న జీపీఎఫ్ పైసలను కూడా ఇయ్యనందుకా? ఆఖరికి రిటైర్డ్ మెంట్ బెన్ ఫిట్స్ ఇవ్వకుండా ఉద్యోగులను రోడ్డున పడేస్తున్నందుకు మీకు ఓటేయాలా? బీజేపీకి ఓటేస్తే ప్రతిరోజు మీ పక్షాన కొట్లాడతాం… ప్రభుత్వ మెడలు వంచి మీ సమస్యలను పరిష్కరించేలా చేస్తాం.

నన్ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తప్పించి బీసీలకు అన్యాయం చేశారనడం అబద్దం.

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, కేంద్ర మంత్రిగా ప్రమోషన్ ఇచ్చింది.

కాంగ్రెస్ పాలన బాగుందని విర్రవీగుతున్న సీఎంకు సవాల్ చేస్తున్నా…మీ 14 నెలల పాలనపై ఎమ్మెల్సీ ఎన్నికలే రెఫరెండంగా తీసుకుందామా?

LEAVE A RESPONSE