Suryaa.co.in

అమరావతి రైతుల పాదయాత్రకు మద్దతుగా కువైట్ లో పాదయాత్ర
Andhra Pradesh International

అమరావతి రైతుల పాదయాత్రకు మద్దతుగా కువైట్ లో పాదయాత్ర

ఆంధ్రప్రదేశ్ కు ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలని రైతులు చేపట్టిన న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్రకు సంఘీభావంగా కువైట్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు ఓలేటి దివాకర్ ఆధ్వర్యంలో సుమారు 300 మందితో సోమవారం పాదయాత్ర నిర్వహించారు.
ఈ సందర్భంగా దివాకర్ మాట్లాడుతూ..తెలుగు జాతి వైభవం కోసం రైతుకి ప్రాణాధారమైన భూముల్ని త్యాగం చేసిన రైతులకు నైతిక మద్దతు తెలియచేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
జన్మభూమి రుణం తీర్చుకోవడానికి, రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామన్న సందేశాన్ని ఇవ్వడానికి పాదయాత్ర నిర్వహించామని పేర్కొన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చి, యువతకు ఉద్యోగాలు లభించాలంటే ఏకైక రాజధానిగా అమరావతిని మాత్రమే ఉంచాలని డిమాండ్ చేశారు.
ఏపీలో సరైన అవకాశాలు లేక మేమంతా కువైట్ రావాల్సి వచ్చింది. అమరావతి నిర్మాణం జరిగి అభివృద్ధి చెందివుంటే అందరికీ ఉద్యోగ అవకాశాలు లభించేవి. రాజధాని లేక రాష్ట్రానికి పారిశ్రామిక వేత్తలు

దూరమవుతున్నారని, నిరుద్యోగంతో యువత తీవ్ర నైరాశ్యంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రపంచ నలుమూలల నుండి పెట్టుబడులు ఆకర్షించే శక్తి అమరావతికే ఉందన్నారు.ప్రపంచంలోని అత్యుత్తమ నగరాలతో పోటీపడాలన్నా, ఏపీ అభివృద్ధి చెందాలన్నా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకుని, ఏకైక రాజధానిగా అమరావతికి మద్ధతివ్వాలని స్పష్టం చేశారు.
దళిత రాజధాని అమరావతిని కొనసాగించి ఏపీ అభివృద్ధికి తోడ్పడాలి. పాదయాత్ర చేస్తున్న రైతులపై పోలీసులు ఆంక్షలు విధించడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో మద్దినేని శ్రీనివాసులు, ములకల్ సుబ్బరాయు, పెంచలయ్య, పి.బాబు, రామకృష్ణ, నెట్టెం ఝాన్సీ, నెట్టెం రానెమ్మ, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE