– జగన్ సర్కారుపై ఫలించని పోరాటం
– బీజేపీ పెద్దలతో పెనవేసుకున్న జగన్ బంధం
– అవ సరానికి ఆదుకుంటున్న కేంద్రం
– మళ్లీ ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీనే
– టీటీడీ నియామకాలపై పురందేశ్వరి విమర్శలు బూమెరాంగ్
– టీటీడీ బోర్డులో బీజేపీ పెద్దల సిఫార్సులే ఎక్కువ
– అమిత్‌షా, నిర్మలా సీతారామన్, షిండే, ఫడ్నవీస్ సిఫార్సులు
– అది తెలియక టీటీడీ నియామకాలపై పురందేశ్వరి విమర్శలు
– దానితో నవ్వులపాలైన పురందేశ్వరి
– జగన్ సర్కార్‌పై జంగ్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వని బీజేపీ
– దానితో సీనియర్ల మౌనరాగం
– స్పష్టత లేకుండా సమరం చేయలేమని స్పష్టీకరణ
– ఇక పురందేశ్వరిది ఉత్తుత్తి యుద్ధమేనా?
-ఏపీ బీజేపీని వీడని నైరాశ్యం
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఆ నేతలు ఇప్పుడు గాలిలో శరవేగంగా కత్తులు తిప్పుతున్నారు. ప్రత్యర్థి ఎవరో తెలియకుండా బాణాలేస్తున్నారు. గాలిలో అస్త్రాలు సంధిస్తున్నారు. చీకట్లో కన్నుకొడుతున్నారు. ఖాళీ మైదానంలో నిలబడి సింహగర్జన చేస్తున్నారు. రాజుగారు ఏ పక్షం ఉన్నారో తెలియక సైనికులు తికమక పడుతున్నారు. అసలు తాము స్వపక్షమా? విపక్షమా? అని వారికే తెలియని గందరగోళం. ప్రత్యర్థిది ఢిల్లీతో దోస్తీ. వారిది గల్లీలో కుస్తీ. ఢిల్లీ రాజు ఇక్కడ తమ ప్రత్యర్ధికి దన్నుగా నిలిస్తే, తాము మాత్రం అదే ప్రత్యర్ధిపై యుద్ధం చేయాల్సిన వైచిత్రి. తమ గమ్యం.. గమనం ఏమిటో.. ఎటువైపో తెలియని విషాదం.
అధికారపార్టీపై నిజమైన యుద్ధం చేయాలా? తమలపాకు యుద్ధం చేయాలా? అన్నదానిపై ఇప్పటికీ రాని అస్పష్టత. అదొస్తే తప్ప.. తాము పూర్తిస్థాయి కదన రంగంలోకి దిగేదిలేదన్న సీనియర్ల స్పష్టీకరణ. ఇంత గందరగోళం.. అయోమయం నడుమ ఆమె పార్టీ పగ్గాలు చేపట్టి, ఇప్పుడు బేలచూపులు చూడాల్సిన రాజకీయ వైచిత్రి. తన సొంత పార్టీ నాయకత్వ పల్సునే పట్టలేని వైఫల్యం. ఆ సైన్యాధికారి పురందేశ్వరి అయితే, సైనికులు కమల దళాలు. ఇదీ ఏపీ బీజేపీ ప్రస్తుత ముఖచిత్రం.
ఏపీ బీజేపీ చుక్కా లేని నావలా పయనిస్తోందన్న ఆవేదన, ఆ పార్టీ సీనియర్లలో వినిపిస్తోంది. ఒకవైపు ఏపీ సీఎం-వైసీపీ అధినేత జగనన్న.. ఢిల్లీ నేతలతో అంటకాగుతుంటే, మరోవైపు తాము మాత్రం అదే జగనన్న సర్కారుపై.. యుద్ధం చేయాల్సిన వైచిత్రి, బీజేపీ నేతలను గందరగోళానికి గురిచేస్తోంది.
జగనన్న సర్కారు అవిశ్రాంతంగా చేస్తున్న అప్పులకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇస్తుంటే, ఇక్కడ బీజేపీ నేతలు మాత్రం.. అప్పులు చేసి పాలిస్తున్నారని జగన్‌పై విచిత్ర విమర్శలు చేస్తూ, అభాసుపాలవుతున్న పరిస్థితి. అప్పులు ఇస్తూ జగనన్నను ప్రోత్సహిస్తున్న కేంద్రంలోని పార్టీ నేతలే.. అప్పులు చేసి పరిపాలిస్తున్నారన్న విమర్శలు, బీజేపీ నేతల డొల్లతనాన్ని సూచిస్తున్నాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
‘మా పార్టీ అధ్యక్షురాలు చేసే ఇలాంటి పసలేని విమర్శలను జనం నమ్మరు. పైగా నవ్వుకుంటారు. కేంద్రం అప్పులివ్వడం, అప్పులకు అనుమతి ఇవ్వడం ఆపేస్తే జగన్ ప్రభుత్వం ఎలా అప్పులు చేస్తుందన్న ఆలోచన-తెలివి, జనాలకు లేదనుకోవడం మా నాయకత్వ అమాయకత్వం’ అని అనంతపురం జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.
‘అసలు ముందు కేంద్రానికి-జగన్‌కు మధ్య ఉన్న సంబంధాలను తెలుసుకోకుండా విమర్శలు చేయడం సరికాదు. బీజేపీ నాయకత్వం ప్లానింగ్ లేకుండా ఏదీ చేయదు. ఇవన్నీ కొత్తగా పార్టీలో చేరి పదవులు తీసుకునేవారు మొదటగా తెలుసుకోవాల్సిన విషయాలు’ అని విశ్లేషించారు.
ఇటీవల జగన్ సర్కారు నియమించిన టీటీడీ బోర్డు పాలకమండలిపై, బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి చేసిన విమర్శలు, ఆమెను నవ్వులపాలు చేయడం చర్చనీయాంశమయింది. నిందితులు- కళంకితులకు టీటీడీలో పెద్దపీట వే శారంటూ పురందేశ్వరి చేసిన ఆరోపణలు, అంద రినీ ఆకట్టుకున్నాయి.ఇది కూడా చదవండి: ‘కొండ’పై కర్రసాము!
అయితే చివరకు ఆ నియామకాల్లో సగం.. బీజేపీ ఢిల్లీ పెద్దల సిఫార్సులే ఉండటం, ఆమెను ఇరుకున పెట్టింది. అంటే పార్టీలో ఏం జరుగుతోందో తనకు తెలియడం లేదన్న సంకేతాలిచ్చి, అవమానం పాలయ్యారు.
లిక్కర్‌స్కాంలో జైలుకు వెళ్లిన శరత్‌చంద్రారెడ్డి, గతంలో సీబీఐ అరెస్టు చేసిన కేతన్ దేశాయ్‌తోపాటు.. ఎమ్మెల్యే ఉదయభాను, తిప్పేస్వామిపై కేసులుంటే వారిని టీటీడీబోర్డులో ఎలా నియమించారంటూ పురందేశ్వరి విమర్శించారు. హిందూ ధర్మాన్ని జగన్ సర్కారు నాశనం చేసి, టీటీడీని భ్రష్ఠుపట్టిస్తుందంటూ బీజేపీ.. రాష్ట్రవ్యాప్తంగా దేవాలయ వద్ద ఆందోళనలు నిర్వహించింది. ఇది కూడా చదవండి: గోవిందా.. పరువు గోవింద!
అయితే గుజరాత్‌కు చెందిన కేతన్ దేశాయ్, కృష్ణమూర్తి వైద్యనాధన్‌ను అమిత్‌షా మూడోసారి, చెన్నైకి చెందిన డాక్టర్ శంకర్‌కు కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలాసీతారామన్ రెండోసారి, బెంగళూరులో జగన్ నివాసం ఉండే కర్నాటక బీజేపీ ఎలహంక ఎమ్మెల్యే విశ్వనాధరెడ్డికి రెండోసారి, గవర్నర్ కోటాలో టీటీడీ బోర్డు సభ్యత్వం దక్కింది. ఇక మహారాష్ట్రలో బీజేపీ మిత్రపక్ష నేత షిండే.. తన మిత్రుడైన నర్వేకర్, బీజేపీ డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ తన మిత్రుడైన అమోల్‌కాలే, బీజేపీ హెడ్డాఫీసు నుంచి సౌరభ్ బోరాకి టీటీడీ బోర్డులో మెంబర్ పదవులు సిఫార్సు చేశారన్నది బహిరంగ రహస్యం. ఇందులో గతంలో సీబీఐ అరెస్టు చేసిన కేతన్ దేశాయ్‌ను కూడా, అమిత్‌షా సిఫార్సు చేశారన్నది రహస్యేమీకాదు. ఇది కూడా చదవండి: టీటీడీని డేరాబాబా డెన్‌గా తయారుచేస్తున్న జగన్‌రెడ్డి
ఈవిధంగా రాష్ట్రానికి మద్దతునిస్తున్నామన్న ఒకే ఒక సాకుతో.. కేంద్రంలోని బీజేపీ పెద్దలు, టీటీడీ బోర్డులో తమ ఇష్టం వచ్చిన వారి పేర్లు సిఫార్సు చేశారు. నిజానికి అటు వైసీపీ నేతలు సైతం యధావిథిగా.. టీటీడీకి పేర్లు సిఫార్సు చేయమంటూ, తమకు రోజూ పనులుండే కేంద్రమంత్రుల చుట్టూ ప్రదక్షణలు చేశారట. అది వేరే ముచ్చట.
రాష్ట్రానికి నిధులు వరద పారిస్తున్న కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ కూడా.. చెన్నైకి చెందిన డాక్టర్ శంకర్‌ను రెండోసారి ఆ పదవికి సిఫార్సు చేశారు. జగనన్న సర్కారు కూడా కేంద్రంలో పనులుంటాయన్న ముందుచూపుతో, వారు చేసిన సిఫార్సులను మహదానందంగా స్వీకరించి… వారిని టీటీడీ పాలకమండలి సభ్యులుగా నియమించింది. ఇది కూడా చదవండి: తిరుమలను ఏం చేయాలనుకుంటున్నారు గోవిందా?
ఇవన్నీ రోజువారీ రాజకీయాలను పరిశీలించే వారందరికీ తెలిసిన బహిరంగ రహస్యాలే. మరి అదే జాతీయ పార్టీకి.. రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరికి మాత్రం, తమ పార్టీ పెద్దలే టీటీడీలో మెంబర్లను సిఫార్సు చేశారని తెలియకపోవడం అమాయకత్వమా? లేక తెలియనట్లు నటిస్తున్నారా అన్నది ప్రశ్న.ఇది కూడా చదవండి: ‘నరక’ దారి
అయితే ఆమె ప్రకటనల ప్రకారం.. పురందేశ్వరికి, కే ంద్రంలోని బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలు తెలియవని, అసలు ఆమెకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని అర్ధమవుతోంది. దానితో పురందేశ్వరి ఉత్సవ విగ్రహమేనని స్పష్టమవుతోందన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
ఇక జగనన్న సర్కారు చేస్తున్న అప్పులపైనా పురందేశ్వరి చేసిన ఆరోపణలు, ఆమెను అభాసుపాలు చేశాయి. ఏపీలో జగనన్న సర్కారు అప్పులు, వాటిని దారి మళ్లిస్తున్న తీరుపై పురందేశ్వరి ఢిల్లీకి వెళ్లి.. కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌కు వినతిపత్రం సమర్పించారు. అయితే ఏపీ అప్పులకు సంబంధించి కేంద్రం లోక్‌సభలో ఇచ్చిన వివరాలకు, పురందేశ్వరి చేసిన ఆరోపణలకు ఎక్కడా పొంతన కనిపించలేదు.
ఫలితంగా పురందేశ్వరి అవమానం పాలయ్యారు. ఆ తర్వాత రాష్ట్రం ఇచ్చిన వివరాలనే కేంద్రం వెల్లడించిందని, బీజేపీ నేతలు సర్దిచెప్పుకునే ప్రయత్నాలు చేశారు. అయితే సొంత పార్టీ అధ్యక్షురాలు వేరే పార్టీ ప్రభుత్వంపై ఆరోపణలు చేసినప్పుడు.. కేంద్రంలోని అధికారపార్టీ దానిని నిగ్గుతేల్చాలి. కేవలం రాష్ట్రం ఇచ్చిన వివరణలతో సరిపెట్టకుండా.. ఆర్‌బీఐ నుంచి వివరాలు సేకరించి, వాటిని లోక్‌సభలో బట్టబయలు చేయాలి.
కానీ కేంద్రంలోని బీజేపీ సర్కారు మాత్రం అవేమీ చేయలేదు. పైగా అప్పులు తీసుకున్న జగనన్నను రక్షించి, ఆరోపణలు చేసిన సొంత పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరిని మాత్రం ముద్దాయిగా నిలబెట్టింది. ఇలాంటి చిత్ర- విచిత్ర మ్యాచ్‌ఫిక్సింగ్ రాజకీయాలు బీజేపీని అప్రతిష్ఠపాలుచేస్తున్నాయి.
ఇలాంటి అస్పష్ట-గందరగోళ రాజకీయాలను.. దగ్గరుండి పరిశీలిస్తున్న బీజేపీ సీనియర్లు, ఏపీ వ్యవహారాలపై అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. తమ నాయకత్వం ఏకకాలంలో అటు జగన్- ఇటు చంద్రబాబుతో ఆడుతున్న సయ్యాటను, ఏపీ బీజేపీ సీనియర్లు ఈసడించుకుంటున్నారు. ప్రభుత్వంపై రాజకీయ యుద్ధం మానేసి, అదే పాలకులతో తెరచాటు స్నేహం చేస్తుంటే, రాష్ట్రంలో పార్టీ శ్రేణుల ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా ఎలా ఉంటుంది? వైసీపీ సర్కారుపై నేతలు, ఎందుకు చిత్తశుద్ధితో పోరాడతారని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు.
జగన్ సర్కారు ల్యాండ్-శ్యాండ్-లిక్కర్ అవినీతిలో మునిగి ఉందన్న విషయం తెలిసినా, ఢిల్లీ నాయకత్వం అంటీముట్టనట్లు వ్యవహరించడాన్ని సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇద్దరి జుట్టూ చేతిలో పెట్టుకునే వైఖరి వల్ల, రాష్ట్రంలో పార్టీ ఎలా ఎదుగుతుందన్నది వారి ప్రశ్న.
అందుకే ఢిల్లీ నుంచి స్పష్టమైన వైఖరి వచ్చేవరకూ, మౌనంగానే ఉండాలని సీనియర్లు నిర్ణయించుకున్నట్లు సమాచారం. అప్పటివరకూ జగన్ సర్కారుపై మొక్కుబడి విమర్శలు, కంటితుడుపు ధర్నాలు, పైపై ఆరోపణలతో ప్రెస్‌మీట్లు నిర్వహించి కాలక్షేపం చేస్తున్నట్లు కనిపిస్తోంది.