– వేములవాడ రాజన్న సన్నిధిలో వదిలేసిన తలిదండ్రులు
– మాతృత్వానికి మచ్చ
( శ్రీనివాస్)
ఇది మాతృత్వానికే మచ్చ. కన్నపేగు తెంచుకుని పుట్టిన వారిని కడుపులో పెట్టుకుని కాపాడాల్సిన తలిదండ్రులు, కఠిన పాషాణ హృదయులయ్యారు. అంగవైకల్యంతో జన్మించిందన్న కారణంతో 15 ఏళ్ల కూతురిని దేవుడి సన్నిథిలో వదిలేసి తమ మానాన తాము వదిలేసిన తలిదండ్రుల వైనమిది.
కడుపున పుట్టిన పిల్లలు ఎలా ఉన్నా.. వారిని కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటారు తల్లిదండ్రులు. అంగవైకల్యం ఉందనో.. మానసిక స్థితి సరిగా లేదనో.. భారంగా భావించి పేగు బంధాన్ని వదులుకోకుండా.. తమకు శక్తి ఉన్నంతవరకు కంటికి రెప్పలా కాపాడుకుంటుంటారు. అలాంటిది ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా ఓ అమానుష ఘటన చోటుచేసుకుంది. నవమాసాలు కని పెంచిన తల్లి.. అల్లారు ముద్దుగా చూసుకోవాల్సిన తండ్రి… అంగవైకల్యంతో జన్మించిందని తన కూతురుని వదిలించుకున్నారు. మానసిక పరిస్థితి బాగాలేక, శారీరక వైకల్యంతో బాధపడుతున్న దివ్యాంగ బాలికను వేములవాడలోని రాజన్న సన్నిధిలో వదిలి వెళ్లడం అందరినీ కలచివేస్తుంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో సుమారు 15 ఏళ్ల దివ్యాంగ బాలికను వదిలి వెళ్లారు. ఆ అమ్మాయిని గమనించిన కొందరు భక్తులు.. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ అధికారులకు సమాచారం అందించగా.. ఈ విషయం కాస్తా వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న జిల్లా బాలల పరిరక్షణ అధికారి స్వర్ణలత రాజన్న ఆలయానికి చేరుకున్నారు. మానసిక పరిస్థితి బాగాలేక, శారీరక వైకల్యంతో బాధపడుతున్న బాలికను వెంటనే వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.