అశోక్ బాబు అరెస్ట్ కక్ష సాధింపులో భాగమే

306

– ఉద్యోగ సంఘాలు సమ్మె నోటీసు ఇచ్చిన రోజే అశోక్ బాబుపై తప్పుడు ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు
– హైకోర్టు బడ్జీలపై దూషణల కేసులో వైసీపీ ప్రభుత్వానికి సంబంధం ఉందనే కీలకమైన ఆధారాలు సీబీఐకు దొరికిన రోజే అశోక్ బాబు ని అరెస్టు చేశారు
– ప్రశ్నించే గొంతులు నొక్కడానికి, ప్రజల దృష్టిని మరల్చడానికి జగన్ రెడ్డి ఒక దుర్మార్గమైన టైంమింగ్ తో ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారు
ఒక అవినీతి ఆరోపణలున్న మెహర్ కుమార్ అనే ఉద్యోగి చేసిన పిర్యాదును ఎలా పరిగణలోకి తీసుకుంటారు?
– సోదరుడి భార్యకు డైరక్టర్ పదవి నజరానాగా పొందిన మెహర్ కుమార్ క్విడ్ ప్రోకోలో భాగంగా అశోక్ బాబు పై తప్పుడు కేసు పెట్టారా?
– కొమ్మారెడ్డి పట్టాభిరాం

ప్రభుత్వం సంకట పరిస్తితుల్లో ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకులపై కేసులు పెట్టి ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టడం సర్వ సాధారణం అయిపోయింది. రివర్స్ పీఆర్,సి తో మోసం చేసిన ప్రభుత్వ విధానాల్ని ప్రజల్లో ఎండగట్టడమేనా అశోక్ బాబు చేసిన తప్పా? ఏపీ ఎన్.జీ.ఓ అధ్యక్షుడిగా, సమైక్య ఆంద్ర జేఏసీ చైర్మన్ గా అశోక్ బాబు ఉద్యోగుల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం అలుపెరగని పోరాటం చేసిన నాయకుడు. గత మూడు సంవత్సరాల నుంచి తెలుగుదేశం నాయకుడిగా, శాసనమండలి సభ్యులుగా వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తూ ఉన్నారు. అశోక్ బాబు పై 24.01.2022 న సాయంత్రం 6 గంటలకు ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు.

అదే రోజు ఉదయం వైసీపీ ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు ఫిబ్రవరి 6 నుంచి సమ్మకు వెళుతున్నామని నోటీసు ఇచ్చారు. రివర్స్ పీఆర్.సి పై ఉద్యోగులు చేస్తున్న ఉద్యమం సమ్మె నోటీసుతో కీలక ఘట్టానికి చేరుకున్న రోజునే ఉద్యోగుల హక్కుల కోసం ప్రతినిత్యం పోరాటం చేసి మాజీ ఉద్యోగ సంఘ నాయకుడిపై కేసు నమోదు చేయడం దుర్మార్గం. ఇదే ప్రశ్నించే గొంతులకు ముందుగానే తాళం వేసే ప్రయత్నం కాదా? తప్పుడు పనులు చేయడంలో జగన్ రెడ్డికి ఉన్న టైమింగ్ ఎవరికీ ఉండదు. ఈ రాష్ట్రంలో సిఐడీ ప్రభుత్వ తోలు బొమ్మగా మారిపోయింది. సిఐడీ జనవరి 24 న చేసిన ఎఫ్.ఐ.ఆర్ లో అశోక్ బాబు పై పెట్టిన కేసులో 477ఏ, 465, 420 రెడ్ విత్ 34 ఐపీసీ అనే మూడు సెక్షన్లు పెట్టారు.

ఫిబ్రవరి 10 వ తేది అద్దరాత్రి అరెస్టు సమాచారం అని చెప్పి అశోక్ బాబు ఇంటికి అంటించిన నోటీసుల్లో 7 సెక్షన్లు పెట్టారు. జనవరి లో పెట్టిన ఎఫ్.ఐ.ఆర్ కి ఫిబ్రవరిలో పెట్టిన ఎఫ్.ఐ.ఆర్ కి అమాంతం 4 సెక్షన్లు వచ్చి చేరిపోయాయి. 466, 467, 468, 471 అనే కొత్త సెక్షన్లు వచ్చి చేరాయి. సెక్షన్ 467 కి అత్యదికంగా శిక్ష పడే కాలం 10 సంవత్సరాలు ఉంటుంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్షపడే సెక్షన్లకు 41ఏ నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేసే వీలు లేదు. 41ఏ నోటీసు నిబంధన నుంచి తప్పించుకోవడానికి అశోక్ బాబుపై అదనంగా మరో నాలుగు సెక్షన్లు పెట్టారు. మరీ ముఖ్యంగా 10 ఏళ్లు శిక్ష పడే అవకాశం ఉన్న సెక్షన్ 467 ను పెట్టారు.

కమర్షియల్ టాక్స్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తున్నప్పుడు అశోక్ బాబు గారు బీ.కాం తప్పుడు సర్టిఫికేట్ ఉపయోగించారని ఆయనపై ఆరోపణ చేస్తున్నారు. ఎమ్మెల్సీ అఫిడవిట్ లో నా విధ్యార్హతలు ఇంటర్మీడియట్ మాత్రమేనని అశోక్ బాబు తాటికాయంత అక్షరాలతో రాసారు. అశోక్ బాబు డిగ్రీ హోల్డర్ అని ఎప్పుడూ చెప్పుకోలేదు. ఎమ్మెల్సీ అఫిడవిట్ అశోక్ బాబు చూపిన విద్యార్హతలకు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది? వాస్తవాలను ఒప్పుకోవడం చట్టాలను ఉల్లంఘించినట్టా? సెక్షన్ 467 అనేది ఆస్తులకు సంబంధించిన వీలు నామాలు గానీ, దస్తావేజులు గాని పోర్జరీ చేస్తే పెట్టే సెక్షన్.

ఒక విధ్యార్హతలకు సంబంధించిన అంశంపై ఆస్తులకు సంబంధించిన సెక్షన్లను ఏ విధంగా పెడుతారు? ఇది కేవలం ఎదో ఒక రకంగా అశోక్ బాబు ని అరెస్టు చేయడానికి 467 సెక్షన్ ను తీసుకొచ్చారు. సిఐడీ చేస్తున్నా ఆరోపణలకు పెట్టిన సెక్షన్లకు ఎటువంటి సంబంధం లేదు. ఈ విషయం రాష్ట్ర ప్రజలు అర్ధం చేసుకోవాలి.

ఇదే విధమైన ఆరోపణలు గతంలో కొంతమంది చేసినప్పుడు ఆరోజున అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై విచారణ చేయమని ఆదేశించింది. 31.01.2013 న ఒక మోమో ద్వారా అశోక్ బాబు పై ఉన్న ఆరోపణలకు సంబంధించి విచారణ చేయమని ఆదేశించారు. తర్వాత 09.11.2018 న జాయింట్ కమీషనర్ విచారణ పూర్తి చేసి అశోక్ బాబు పై ఉన్న ఆరోపణలన్నీ నిరాధారం అని తేల్చి ఇకపై ఈ అంశంలో ఎటువంటి విచారణ అవసరం లేదని నివేదిక ఇవ్వడం జరిగింది. ఇదే విషయాన్ని 25.05.2019 న అప్పటి ప్రభుత్వానికి కూడా తెలియజేయడం జరిగింది.

నేడు తిరిగి అవే పాత ఆరోపణలపై ఒక నిరాధారమైన పిర్యాదు ఆధారంగా సిఐడీకి విచారణ చేయమని ఒక కమర్షియల్ టాక్స్ జాయింట్ కమీషనర్ కోరడం అనుమానస్పదం కాదా? గతంలో ఒక కమర్షియల్ టాక్స్ డిపార్ట్ మెంట్ కు చెందిన జాయింట్ కమీషన్ అశోక్ బాబు పై నిరాధారమని తేలిస్తే అదే శాఖ జాయింట్ కమీషనర్ మరలా అవే ఆరోపణలపై పిర్యాదు చేయడం ఏంటి? దీనికి ఏం సమాధానం చెబుతుంది ఈ ప్రభుత్వం.

ఈ దిక్కుమాలిన ప్రభుత్వం చెబుతున్నట్లు అశోక్ బాబు ఏ తప్పు చేయలేదు. సర్వీస్ ఎంట్రీల గురించి మాట్లాడుతున్న ఈ ప్రభుత్వం ఒక ఉద్యోగికి సంబంధించిన ఎంట్రీలను అదే ఉద్యోగి రికార్డుల్లో రాయడం వీలుకాదని తెలియదా? ఏ ఉద్యోగి కూడా తనకు తానుగా తన విద్యార్హతలు తన రికార్డులలో నమోదు చేయరు, సర్వీసు రిజిస్టర్ నిర్వహణ ప్రత్యేకంగా నియమింపబడిన కొంతమంది అధికారుల చేతుల్లో మాత్రమే ఉంటుంది. అలాంటప్పుడు అశోక్ బాబు ఆయనకు ఆయనగా తన సర్వీసు రికార్డుల్లో రాసుకోగలరు?

ఇంత నిరాధారమైన ఆరోపణ చేయడానికి ఈ ప్రభుత్వానికి సిగ్గనిపించదా? అశోక్ బాబు పై ఉన్న ఆరోపణలు నిరాధారమని ఒక్కసారి తేల్చిన తర్వాత కూడా కుట్రపూరితంగా మెహర్ కుమార్ అనే కమర్షియల్ టాక్స్ ఉద్యోగితో తప్పుడు పిర్యాదు చేయించింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అశోక్ బాబు పై తప్పుడు ఆరోపణలు చేసిన మెహర్ కుమార్ పై గతంలో వచ్చిన అనేక అవినీతి ఆరోపణల దృష్ట్యా ఆయనను 16.04.2021 న ఛీఫ్ కమీషనర్ పీయూష్ కుమార్ మెహర్ కుమార్ పనిచేస్తున్న విజయవాడ నుంచి పిడుగురాళ్లకు బదిలీ చేయడమే కాకుండా ఆయనపై ఎన్ క్వయిరీ వేయడం జరిగింది.

నేడు అటువంటి ఒక అవినీతి మరకలున్న ఉద్యోగి ఇచ్చిన ఒక నిరాధారమైన పిర్యాదును ప్రభుత్వం ఏ రకంగా పరిగణలోకి తీసుకుంటుంది.? అశోక్ బాబు పై నమోదు చేసిన తప్పుడు కేసు వెనుక ఒక క్విడ్ ప్రోకో వ్యవహారం కూడా దాగి ఉంది. మెహర్ కుమార్ సోదరుడు అరుణ్ కుమార్ భార్య మాధవీలతను బ్రాహ్మిణ్ కార్పొరేషన్ డైరక్టర్ గా ప్రత్యేకించి నియమించడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి. అశోక్ బాబు పై తప్పుడు ఫిర్యాదు చేసినందుకు క్విడ్ ప్రోకోగా మెహర్ కుమార్ తమ్ముడి భార్యకు డైరక్టర్ పదవి నజరానాగా ఇచ్చారా? దీనిని బట్టి జగన్ సర్కార్ కుట్ర తేటతెల్లమౌతుంది.

విచారణ ముగిసి ఆరోపణలు నిరాధామని తేల్చిన అంశంపై తిరిగి తప్పుడు పిర్యాదు ఇప్పించడానికి ఈ ప్రభుత్వానికి ఎందుకు అంత ప్రత్యేక శ్రద్ధ. అశోక్ బాబు పై సిఐడీ విచారణ కోరిన జాయింట్ కమీషనర్ గీతామాధురి కానీ, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే అంశంపై విచారణ చేయాలని విడుదల చేసిన మెమోలలో గానీ ఎక్కడ కూడా ప్రైమ్ ఆఫ్ పాసీ ఆధారాలు చూపలేదు. కనీస ఆధారాలు లేకుండా సిఐడీ ఇన్ని సెక్షన్ల ఏ విధంగా పెడుతుంది? ఒక ఉన్నతాధికారి అయిన గీతా మాధురి గారు ఒక్క ఆధారం కూడా లేకుండా సిఐడీకి ఏ విధంగా ఫిర్యాదు చేస్తారు?

అశోక్ బాబు ఉద్యోగస్తుల తరపున గట్టినా పోరాటం చేస్తున్నారనే ఆయనపై తప్పుడు కేసు నమోదు చేశారు. కక్షసాధింపులో భాగంగానే అశోక్ బాబు పై ఇన్ని సెక్షన్లు పెట్టారు. జడ్జిలపై దూషణల కేసులో సీబీఐ విచారణ చేస్తున్న సంధర్బంలో కొన్ని సంచలనమైన ఆధారాలు దొరికాయి. హైకోర్టు జడ్జిలపై చేసిన

అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి ఏపీ డిజిటల్ కార్పొరేషన్ లో మూలాలు ఉన్నాయనే ఆధారాలు సీబీఐకు దొరికాయి. డిజిటల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న కొంత మంది ఉద్యోగుల ఐపీ అడ్రస్సుల నుంచే హైకోర్టు జడ్జిలపై దూషణలు చేశారని ఆధారాలు దొరికాయి. దీనికి సంబంధం ఉన్న కీలకమైన వ్యక్తులను కూడా 10.02.2022 న సీబీఐ విచారణ చేసింది. జడ్జీలపై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి సీబీఐ విచారణ వేగవంతమై, ఇందులో ప్రభుత్వానికి లింక్ ఉందని తేలిన రోజునే సీఐడీ రంగంలోకి దిగి అశోక్ బాబు ని అరెస్టు చేశారు.

అశోక్ బాబు పై ఎప్.ఐ.ఆర్ నమోదు చేసిన రోజు ఉద్యోగులు సమ్మె నోటీసు ఇచ్చిన రోజు. ఆయనను అరెస్టు చేసిన రోజు జడ్జీలపై అనుచిత వ్యాఖ్యల కేసులో ప్రభుత్వం పాత్ర ఉందని కీలక ఆధారాలు దొరికిన రోజు.. ఈ టైమింగులను చూస్తే ఇదంతా ప్రశ్నించే గొంతులు నొక్కడానికీ, ప్రజల దృష్టి మరల్చడానికి జగన్ ఆడిన నాటకం అని సామాన్యుడికి కూడా అర్దమైపోతుంది. ఇది కక్షసాధింపులో భాగమే. అశోక్ బాబు డిగ్రీ సర్టిఫికేట్ ఆధారంగా ఎటువంటి లబ్దిపొందలేదు. పదోన్నతీ పొందలేదు. ఎక్కడా ఒక రికార్డును తారుమారు చేయలేదు. ఆయన సర్వీసు మొత్తం కూడా ఇంటర్ మీడియట్ పైనే సాగింది. ఆయన ఒక అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ హోదాలోనే ఉద్యోగ విరమణ చేశారు.

ఉద్యోగుల పక్షాన అశోక్ బాబు తన గళాన్ని బలంగా వినిపిస్తున్నారనే దురుద్దేశంలో ఆయనపై తప్పుడు కేసు నమోదు చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో అశోక్ బాబు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ విధంగా పోరాటం చేశారో ప్రజలు చూశారు. అటువంటి ఉద్యమ నాయకుడికి ప్రజలందరూ అండగా నిలబడాలి. వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులపై చీకటి అరెస్టులు ఆపాలి. లేదంటే, తెలుగుదేశం పార్టీగా మేమందరం, మా పార్టీ జాతీయ అధ్యక్షులు గా చంద్రబాబు నాయుడు అశోక్ బాబు గారి తరపున న్యాయపోరాటం చేస్తారు. తెలుగుదేశం ప్రతీ కుటుంబ సభ్యుడు అశోక్ బాబు గారికి అండగా నిలబడుతారు. కడిగిన ముత్యంలా ఆయన బయటకు వచ్చి మరలా ఉద్యోగుల హక్కుల కోసం పోరాటం చేస్తారు.