• పిఠాపురం రథాలపేటవాసులకు ఇళ్ల పట్టాలు
• 15 మంది లబ్దిదారులకు పట్టాలు అందజేసిన శాసన మండలి సభ్యులు నాగబాబు
• శ్రీ పాదగయ క్షేత్రం వద్ద నూతన బస్ షెల్టర్ కు ప్రారంభోత్సవం
సమస్య ఏదైనా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి చెప్పుకొంటే పరిష్కారం అయి తీరుతుందన్నది ప్రజల నమ్మకం. ఆ నమ్మకాన్ని మరోసారి నిలుపుకొంటూ పిఠాపురం పట్టణ పరిధిలోని రథాలపేట ప్రజలను దశాబ్దాలుగా వేధిస్తున్న సమస్యకు పరిష్కారం చూపారు. 15 మందికి శాశ్వత ఇళ్ల పట్టాలు మంజూరు చేయించారు. పిఠాపురం పర్యటనలో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం స్థానిక సాంఘిక సంక్షేమ సమీకృత బాలికల వసతి గృహంలో జరిగిన ఓ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు కొణిదెల నాగబాబు లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను అందజేశారు.
పిఠాపురం నుంచి శాసన సభ్యునిగా ఎన్నికైన వెంటనే నియోజకవర్గం పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు పవన్ కళ్యాణ్ పర్యటించిన సందర్భంలో రథాలపేట వాసులు దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న ఇళ్ల పట్టాల సమస్యను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. వారు నివాసం ఉంటున్న ఇళ్ల మధ్యకు తీసుకువెళ్లి తమ ఇబ్బందులు తెలిపారు. లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ కి సూచించారు. ఉప ముఖ్యమంత్రివర్యుల ఆదేశాల మేరకు 15 మంది లబ్దిదారులను ఎంపిక చేసి పట్టాలు సిద్ధం చేశారు. శుక్రవారం నాగబాబు చేతుల మీదుగా పట్టాలు అందజేశారు.
• అడిగిన వెంటనే వరాలిచ్చే దేవుడు పవన్ కళ్యాణ్ : కొత్తపల్లి అరుణ, లబ్దిదారు, రథాలపేట
ఈ సందర్భంగా నాగబాబు నుంచి ఇళ్ల పట్టా స్వీకరించిన రథాలపేటకు చెందిన కొత్తపల్లి అరుణ అనే మహిళ మాట్లాడుతూ.. సుమారు 40 ఏళ్లుగా రథాలపేటలో నివాసం ఉంటున్నాం. మా ఇళ్లలోకి పాములు వస్తున్నాయన్నా, మాకు తాగేందుకు నీరు లేదని చెప్పుకున్నా ఇప్పటి వరకు స్పందించిన నాథుడు కనబడలేదు. ఓట్లు వేయించుకునే వారు, సమస్యలు చెప్పుకుంటే ఉన్న ఇళ్లు ఖాళీ చేసి పొమ్మనేవారు. మా సమస్య, మేము పడుతున్న అవస్థలు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి చూపాం. ఆయన తక్షణం స్పందించారు. తాగు నీటి ఇబ్బందులు చూసి వెంటనే కుళాయి వేయించారు. ఇప్పుడు ఇళ్ల పట్టాలు ఇప్పించారు. అడిగిన వెంటనే వరాలు ఇచ్చే దేవుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు.
• సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహం ఆధునీకరణ
అభివృద్ధిలో పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే ఓ మోడల్ నియోజకవర్గంగా రూపొందిస్తానని హామీ ఇచ్చిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఒక్కో సమస్యకు పరిష్కారం చూపుతూ.. మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించారు. ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పిఠాపురంలో నిర్వహించబడుతున్న సమీకృత బాలికల వసతి గృహన్ని రూ. 36.5 లక్షల వ్యయంతో ఆధునీకరించారు. బాలికలు విశ్రాంతి తీసుకునే గదుల ఆధునీకరణతో పాటు సౌకర్యాలు మెరుగుపర్చారు.
శుక్రవారం శాసన మండలి సభ్యులు కొణిదెల నాగబాబు నూతన వసతులు కల్పించిన గదులను ప్రారంభించారు. వసతి గృహంలో అందుతున్న సౌకర్యాలు, సమస్యలపై బాలికలను ఆరా తీశారు. అనంతరం జేజేఆర్ గ్రూప్ సహకారంతో శ్రీ పాదగయ క్షేత్రం వద్ద జాతీయ రహదారిపై నూతనంగా నిర్మించిన బస్ షెల్టర్ ను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ , ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ కుమార్, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ ఛైర్మన్తుమ్మల రామస్వామి, కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, జనసేన పార్టీ పిఠాపురం నియోజక వర్గం సమన్వయకర్త మర్రెడ్డి శ్రీనివాసరావు, భీమిలి ఇంఛార్జ్ డాక్టర్ పంచకర్ల సందీప్, గోదావరి ఈస్ట్రన్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్, శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ పెంకె జగదీష్ , ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దానం లాజర్ బాబు , పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ జయ కృష్ణ , యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ నక్క నారాయణ మూర్తి, ఏలేరు ప్రాజెక్ట్ వైస్ చైర్మన్ ఊట ఆది విష్ణు, మార్కెట్ యార్డ్ చైర్మన్ వాకపల్లి దేవి సూర్యప్రకాష్, కో ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ చెల్లిబోయిన ప్రమీల నాగేశ్వరరావు, పార్టీ నాయకులు మేడిశెట్టి సూర్యకిరణ్, చల్లా లక్ష్మి, తెలగంశెట్టి వెంకటేశ్వర రావు, ఒదురి నాగేశ్వరరావు, తోలేటి శిరీష, కడారి తమ్మయ్య నాయుడు, డాక్టర్ పిల్లా శ్రీధర్, డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.