Suryaa.co.in

Political News

పవన్ అపరిపక్వ రాజకీయం

1. “నేటి దుష్టపాలనకు ముగింపు పలకాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదు. నేను గతంలో తగ్గి మీకు మద్దతు ఇచ్చాను. ఇప్పుడు మీరు కాస్తా తగ్గి ఆలోచించండి”. ఇదీ! జనసేన అధినేత మాటల్లోని నిగూడార్థమన్న సంకేతాన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీ టిడిపికి పంపినట్లుగా నాదెంళ్ళ మనోహర్ వ్యాఖ్యలను బట్టి వెల్లడవుతున్నది.

2. నన్ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టండంటే ఎవరైనా ఎందుకు కూర్చోబెడతారు! ఈ ఆలోచనా తీరే ఎబ్బెట్టుగా ఉన్నది. ఇందులో రాజకీయ పరిపక్వత లోపించింది.

3. దాదాపు 40% ఓట్ల బలం ఉన్న ఏ రాజకీయ పార్టీ అయినా 7% లోపు ఓట్లున్న పార్టీ నేతను ముఖ్యమంత్రిని చేయడానికి ఒప్పుకుంటుందా! నన్ను ముఖ్యమంత్రిని చేడంటే ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారు, ఎందుకు చేయాలి! కాస్తా రాజకీయ విజ్ఞతతో ఆలోచించాలి. ఆలోచనల్లో హేతుబద్ధత లోపించింది.

4. సంకీర్ణ ప్రభుత్వాల యుగంలో అది అసాధ్యమని భావించడం లేదు. ఎప్పుడంటే, ఎన్నికల తదనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏ పార్టీకీ సరిపడ శాసన సభ్యుల బలం లేనప్పుడు, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అనివార్య పరిస్థితి నెలకొన్నప్పుడు, అలా జరిగిన ఉదంతాలున్నాయి. అలాంటి చరిత్ర కూడా ఉన్నది. చిన్న పార్టీల అధినేతలు లేదా వ్యక్తులు సహితం ముఖ్యమంత్రులు/ ప్రధాన మంత్రులు అయిన అనుభవాలున్నాయి. ఆ ప్రభుత్వాలు ఎన్ని వత్తిళ్ళ మధ్య, ఎంత కాలం మనుగడ సాగించాయో కూడా విధితమే. వాళ్ళయ్యారు, నేనెందుకు కాకూడదు అన్న ఆలోచన ఉంటే అది దురాశగానే మిగిలిపోతుంది.

5. దేశం, రాష్ట్రం అభివృద్ది – భవిష్యత్తు కొలబద్ధగా తమ రాజకీయ విధానాలను పార్టీలు రూపొందించుకొని ప్రజల మద్దతును కూడగట్టుకోవాలి. అంతే కానీ, లోపభూయిష్టమైన రాజకీయ విధానాలను అమలుపరుస్తూ ప్రజలను మద్దతుకోరితే ఎందుకిస్తారు? రాష్ట్రానికి హక్కుగా ఇవ్వాల్సిన వాటిని సహితం ఇవ్వకుండా, దగా చేస్తున్న పార్టీతో జట్టు కట్టిన పార్టీకి ప్రజలు ఎందుకు అండగా నిలుస్తారు! నిలవాలి! ఆ కోణంలో ఆలోచించుకోవాలి.

టి.లక్ష్మీనారాయణ
సామాజిక ఉద్యమకారుడు

LEAVE A RESPONSE