Suryaa.co.in

Andhra Pradesh

పవన్ బ్రతుకే అబద్ధం

-ప్రభుత్వాన్ని దూషించటమే పవన్‌ పనిగా పెట్టుకున్నారు
-రైతుల పరామర్శ పేరుతో చంద్రబాబు అనుకూల రాజకీయం
-చంద్రబాబు కోసమే పవన్ పార్టీ పెట్టారు
-రైతులకు అండగా జగన్ ప్రభుత్వం నిలిచింది
-రాజకీయాల్లో కుల ప్రస్తావన తెచ్చింది పవన్ కాదా?
-కులప్రస్తావన లేకుండా ఒక్క రోజైనా పవన్ మాట్లాడారా?
-జనం కోసం పట్టుమని 10 రోజులు పనిచేశావా పవన్‌?
-ఆరు నెలలకు ఒకసారి పవన్ రోడ్డుపైకి వస్తున్నాడు
-ఎప్పుడైనా జగన్‌ పైనే పవన్‌ విమర్శలు
-చంద్రబాబు హయాంలో ముద్రగడ కుటుంబాన్ని హింసించారు..
-చంద్రబాబులా కాపులను మోసం చేయనని జగన్‌ ముందే చెప్పారు
-సుప్రీంకోర్టు తీర్పుకు లోబడే రిజర్వేషన్లు ఉంటాయని జగన్‌ నిజాయితీగా చెప్పారు
-కాపులను బీసీల్లో చేరుస్తామని హామీ ఇచ్చి చంద్రబాబు మోసం చేశాడు
-కాపుల కోసం ముద్రగడ పోరాడితే దాడి చేశారు
-ఆనాడు పవన్ ఎందుకు నోటికి తాళం వేసుకున్నాడు
-కాపులను దగా చేసింది పవన్, చంద్రబాబు కాదా?
-కాపులను పవన్ బ్లాక్‌ మెయిల్ చేస్తున్నాడు
-భీమ్లా నాయక్‌ సినిమాకు ఏపీలో నష్టాలు వచ్చాయంటున్నారు
-సినిమా బావుంటే జనం చూస్తారు.. లేదంటే చూడరు
-రూ.100 కోట్లు దాటిన పవన్ సినిమా ఏదైనా ఉందా?
-రూ.100 కోట్ల మార్కెట్టే లేనప్పుడు రూ.30 కోట్ల నష్టం ఎలా వస్తుంది?
-చంద్రబాబును తిడితేనే పవన్‌లో మానవత్వం పొంగుతుందా?
-సీఎంని టీడీపీ నాయకులు బరితెగించి మాట్లాడితే కనీసం ట్వీట్ చేశావా?
-చంద్రబాబు, పవన్ ఒక్కటేనని మొదటి నుంచి చెబుతున్నాం
-చంద్రబాబు హయాంలో ఆలయాలను ధ్వంసం చేస్తే ఏం చేశావ్?
-కుల, మత రాజకీయాలతో పవన్ పబ్బం గడుపుతున్నాడు
-చంద్రబాబు భజనే పవన్ చేస్తున్నారు
– మాజీ మంత్రి పేర్ని నాని

పేరు ఏమో రైతుల పరామర్శ. పవన్‌ చేసేదంతా చంద్రబాబు అనుకూల రాజకీయం
రాష్ట్రంలో రైతులకు ఎప్పుడు ఏ విపత్తు వచ్చినా అండగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిలబడింది. అలాంటి ప్రభుత్వాన్ని దూషించటానికి ఆంధ్రప్రదేశ్‌లో పవన్‌ కాలు పెట్టారు. దానికి పవన్‌ పెట్టిన పేరు రైతుల పరామర్శ. చేసేదంతా చంద్రబాబు అనుకూల రాజకీయం. చంద్రబాబు కోసమే.. టీడీపీ పది కాలాల పాటు బాగుండాలని.. ఒక రాజకీయ పార్టీని పవన్‌ కల్యాణ్‌ ఏర్పాటు చేశారు.

ఆరు నెలలకు ఒకసారి రోడ్డు మీదకు పవన్‌ వచ్చేది జగన్ పై విమర్శల కోసమే
పవన్‌ కల్యాణ్‌ టెంపరితంగా మాట్లాడతారు. పవన్‌ కంటే పది ఆకులు ఎక్కువే ప్రజలే చదివారు. వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు అంతా నన్ను తిట్టడానికి మాత్రమే రోడ్ల మీదకు వస్తున్నారు. మరి, పవన్ కల్యాణ్ ఆరు నెలలకు ఒకసారి జగన్‌ ని తిట్టడానికి తప్ప దేనికి వస్తున్నావు. ఇవాళ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రతిపక్ష నాయకుడుగా జగన్ ఉన్నప్పుడు కూడా ఆయన్ను తిట్టడానికి తప్పిస్తే పవన్ ఎందుకు వచ్చాడు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన్ను తిట్టడానికి రావాలి. కానీ, జగన్‌ ని తిట్టడానికి ఆరు మాసాలకు ఒకసారి రోడ్డు ఎక్కే వ్యక్తి పవన్. ఈ విషయం పవన్‌ రాజకీయ చరిత్ర చూస్తే.. అందరికీ అర్థమవుతుంది.

వారాహి యాత్ర అంటాడు. వాయిదాలు వేస్తూపోతాడు
జూన్ నుంచి ప్రజల్లో తిరగటానికి సిద్ధంగా ఉన్నారట. గ్రామాల్లో, బస్తీల్లో, పేటల్లో అప్పు రేపు అని రాస్తారు. అలాగే వాయిదాల పద్ధతిలో ఎప్పుడు చూసినా అప్పు రేపే. నవంబరులో అమ్మవారి దగ్గరకు వచ్చి పూజలు అన్నాడు. ఏదీ ఆ వ్యాన్. దసరా నుంచి రాష్ట్రమంతా తిరిగి.. సందు సందు బజారు బజారు తిరుగుతాను అంటున్నాడు. రేపు జూన్ నుంచి తిరుగుతాను అంటాడు. మళ్లీ షరతులు వర్తిస్తాయి. డిసెంబరులో ఎన్నికలు వస్తే జూన్‌ నుంచి తిరుగుతాను అంటాడు. రాజకీయాల్లో ఇంతటి పనోడు మనకు ఎవ్వడూ దొరకడు.

ప్రజల కోసం పదిరోజుల పనిచేయకుండా సీట్లు ఇవ్వలేదనటం ఏమిటో?
ప్రజాజీవితంలో పవన్‌ పనిచేసింది ఎక్కడ? పట్టుమని పదిరోజులు షూటింగ్‌కు వెళ్లకుండా జనం కోసం పనిచేసింది ఎక్కడ? 2013లో పార్టీ పెట్టావు. ఇప్పుడు 2023. పదేళ్లలో ఎప్పుడైనా పట్టుమని పదిరోజులు ఆంధ్రాలో జనం కోసం బ్రతికింది ఏముంది? ఏ ఒక్కరోజైనా ఏ ఒక్క ట్రిప్‌లో అయినా.. శని, ఆదివారం రావటం. రెండు రోజుల్లో నాలుగు మాటలు జగన్‌ను తిట్టడం వెళ్లి షూటింగ్‌ చేసుకోవటం, ప్యాకప్‌.

నాదెండ్ల, నాగబాబు తప్ప ప్రజల మాటలు విన్నావా పవన్‌
ప్రజల కోసం బ్రతుకుతున్నామంటే అది ఒక రాజకీయ నాయకుడు వారి మధ్య తిరగాలి కదా. ప్రజల మధ్య బ్రతకాలి కదా. వారి కష్టాలు వినాలి కదా. ఎంతసేపూ నాదెండ్ల మనోహర్ మాటలు వినటం తప్పితే ప్రజల మాటలు విన్నావా? మీ ఇంకో అన్నయ్య (నాగబాబు), నాదెండ్ల మనోహర్ తప్పితే పవన్‌తో మాట్లాడినవారు ఎవరైనా ఉన్నారా? 2 లక్షల పుస్తకాలు చదివాను అంటావు. రోబోలో రజనీకాంతా ఏమిటీ?

కాపులను బీసీల్లో చేరుస్తామని హామీ ఇచ్చి మోసం చేసింది చంద్రబాబే
2014 ముందు కాపుల్ని బీసీల్లో చేరుస్తానని చంద్రబాబు ఊరూరా తిరిగి చెప్పటమే కాకుండా మేనిఫెస్టోలో కూడా పెట్టారు. మరి అప్పుడు పవన్, చంద్రబాబు ప్రభుత్వమే కదా. మరి ఆనాడు చంద్రబాబు ఎందుకు ప్రశ్నించలేదు. చంద్రబాబు ఆ హామీ మేరకు పనిచేయకపోతే ప్రభుత్వంపై ఒత్తిడి మేరకు ముద్రగడ ఉద్యమం చేస్తే.. దీక్ష చేస్తున్న ఆయన కుటుంబంపై వందలాది పోలీసులు జొరబడి తన్నుకుంటూ తీసుకెళ్లి ఎదురుకాల్పుల పేరుతో ముద్రగడ పద్మనాభంను చంపేస్తారేమో అని చిరంజీవి, దాసరి నారాయణరావు భయపడి రాజమండ్రి వస్తే వారిద్దరినీ ఎయిర్‌పోర్టులో అరెస్టు చేసి హైదరాబాద్‌లో దింపారు. అంత దాష్టీకం, అకృత్యం, దుర్మార్గం చేస్తే.. ఇవాళ కాపులను ఓటేయలేదని నిందిస్తున్న పవన్‌ ఆరోజు ఎందుకు నోటికి తాళం వేసుకుని కూర్చున్నారు. కాపుల్ని మోసం చేసిన నీ పార్టనర్ చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదు.

కాపులను ఎమోషనల్‌ బ్లాక్‌ మెయిల్ చేస్తున్న పవన్
పైగా వైఎస్‌ఆర్‌సీపీలో ఉన్న కాపుల్ని మీరు ఎలా కొమ్ము కాస్తారని పవన్ ప్రశ్నించటం హాస్యాస్పదం. కాపులకు రిజర్వేషన్లు వ్యతిరేకించారంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పు దృష్ట్యా 50% మించి రిజర్వేషన్లు ఇచ్చే అధికారం ఏ ప్రభుత్వానికి లేదు. అది నా చేతుల్లో లేదు. అది ఇవ్వలేను. కాపుల సంక్షేమం కోసం ఏటా రూ.2000 కోట్లు చొప్పన ఐదేళ్లు రూ.10 వేల కోట్లు వెచ్చిస్తానని జగన్‌ చెప్పారు. చంద్రబాబులా మోసం చేయనని జగన్ గారు ఎన్నికలకు ముందే చెప్పారు. దమ్మున్న నాయకుడు జగన్‌ నిజం మాట్లాడారు. ఆ నిజం కాపులకు నచ్చింది. పవన్, ఆయన పార్టనర్‌ చంద్రబాబు కలిసి ఎన్నికల మేనిఫెస్టోలో కాపులను బీసీ చేస్తానని మోసం చేశారు. అలా మోసం చేయటం నాకు చేతకాదని జగన్ గారు చెప్పారు. ఇది చేయను.. ఇది చేస్తానని చెప్పిన జగన్ నిజాయితీ కాపులకు నచ్చింది. కాబట్టి అత్యధిక మంది కాపులు జగన్‌ ని బలపరిచారు. పవన్, చంద్రబాబు కలిసి కాపులను దగా చేశారు. ఇవాళ కాపు రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్నారని నిందవేస్తారు. చంద్రబాబు కోసం దుర్మార్గంగా అసత్యాలు, అబద్ధాలు పవన్ మాట్లాడుతున్నారు. కాపులను ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్ చేయటానికి మాట్లాడతారు.

భీమ్లా నాయక్‌ సినిమాకు ఏపీలో నష్టాలు వచ్చాయంటున్నారు
భీమ్లా నాయక్‌ సినిమాకి రూ.30 కోట్లు నష్టం కలిగించారని పవన్ మాట్లాడతారు. పవన్‌కు సినిమా మార్కెట్ ఎంత? రూ.100 కోట్లు దాటిన సినిమా ఏమైనా ఉందా? ఆ సినిమాకు పెట్టుబడి ఎంత పెట్టారు. రూ.30 కోట్లు నష్టం వచ్చిందంటే.. లెక్కలు చెప్పండి. రెమ్యునరేషన్ ఎవరెవరికి ఎంతెంత ఇచ్చారు. రండి.. లెక్క పెడదాం. సినిమా బావుంటే.. ఆడుతుంది. జనాలు చూస్తారు. సినిమా బాగోలేకపోతే? సినిమా బావుంటే చూస్తారు. ఎవరి భిక్షతో సినిమాల్లోకి నటుడిగా వచ్చావో.. ఆ పేరు మర్చిపోయి.. నేను ఒక కానిస్టేబుల్ కొడుకు అని చెప్పుకుంటున్నావు తప్పితే నేను చిరంజీవి తమ్ముడిని చెప్పుకోవటానికి సిగ్గుపడిపోతున్నావు. 60 ఏళ్ల వయస్సులో వాల్తేరు వీరయ్య సినిమా తీస్తే.. సినిమా బావుంది. బ్రహ్మాండమైన కలెక్షన్లు వచ్చాయి. నువ్వు సినిమా బాగా తీయి జనాలు చూస్తారు. చీప్‌గా సినిమా చుట్టేయాలి. ఎందుకు వస్తాయి. ఒకసారి ప్రశ్నించుకో. సినిమా బాగోలేకపోతే.. జగన్‌ కి సంబంధం ఏంటి? పవన్ సినిమాలు ఏనాడైనా రూ.100 కోట్లు దాటింది ఏదైనా ఉందా? పచ్చి మోసపు మాటలు. ఎమోషనల్ మాటలు. కులాన్ని రెచ్చగొట్టాలి. చిరంజీవి సినిమా బాగోలేకపోతే .. చూడరు. వాల్తేరు వీరయ్య అద్భుతంగా ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది. జనాలు చూశారు. సినిమాలు ఏమో.. డబ్బింగ్.. ఓటీటీ సినిమాలు. ఏదో ఒకటి రీమేక్‌ చేసి డబ్బులు వేసేసుకోవాలి. ఆ ఆత్రంలో ఉంటే సినిమా ఎందుకు బావుంటుంది.

రాజకీయాల్లో కుల ప్రస్తావన తెచ్చింది పవన్ కాదా?
రాజకీయాల్లో కుల ప్రస్తావన తెచ్చేది.. మాట్లాడేది పవన్‌. కులం.. కులం అని మాట్లాడతావు. మొన్న బందరులో లెక్క చెప్పాను కదా. ఏ కులం గురించి ఎన్నిసార్లు మాట్లాడావో. మీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున కులాల గురించి మాట్లాడింది పవనే. 2018 నుంచి 2023 దాకా ఈ ఐదారేళ్లలో కులాల ప్రస్తావన లేకుండా నోరు విప్పావా? కుల ప్రస్తావన లేకుండా నోరు తెరుస్తున్నావా? చంద్రబాబుకు నాకు మధ్య అక్రమ సంబంధాలు లేవు. చంద్రబాబును తిడితే.. మానవతా వాదిగా స్పందించాను. టీడీపీ ఆఫీసులో పట్టాభి అనే వ్యక్తి సీఎం జగన్‌ ని అమానవీయంగా, పచ్చిగా అనకూడని మాట అంటే.. ఆరోజున పవన్‌ మానవత్వం చచ్చిపోయిందా? నోరు విప్పావా? బయటకు వచ్చి మాట్లాడావా? రోడ్డు ఎక్కలేదే. కనీసం ట్వీట్ చేయలేదు. ఎందుకు మాట్లాడలేదు. చంద్రబాబును తిడితేనే మానవత్వం పొంగి పొర్లుతుందా? టీడీపీలో చోటామోటా నాయకుల కోసం మానత్వం లావాలా రోడ్ల వెంట పొంగిపొర్లుతుంది. పవన్ వచ్చి మాట్లాడతారు. ట్వీట్లు చేస్తారు. ఇంత గొప్ప మానవతా వాదివి.

ముసుగులు ఎందుకు. చంద్రబాబు, పవన్‌ కలసి వెళ్తామని చెప్పండి
గతం కంటే జనసేనకు ఆదరణ పెరిగింది. కృష్ణా నుంచి శ్రీకాకుళం వరకు 25%, గోదావరి జిల్లాల్లో 35% రాష్ట్ర వ్యాప్తంగా 18%. టీవీ ఛానల్స్, పేపర్లకు అడ్వర్టేజ్‌మెంట్ వింగ్‌లు ఉంటాయి. ఆ మార్కెటింగ్‌ వాళ్లు మాకు ఇంత రేటింగ్‌ ఉంటుంది. పది సెకన్లు ఇంత అవుతుందంటారు. పేపర్ వాళ్లు ఇంత సర్క్యులేషన్ ఉంది.. అంగుళానికి ఇంత అవుతుందని బేరం ఆడతారు. పవన్ చెప్పేది చంద్రబాబు దగ్గర బేరానికి ఉపయోగపడుతుంది తప్ప ఎవరికి ఉపయోగం. కేడర్‌లో ఉత్సాహం రావటానికో మాట్లాడటానికో చెప్పు. నాదెండ్ల మనోహర్, పవన్ అసెంబ్లీలోకి కలిసి వెళ్లాలనుకుంటే మార్కెటింగ్‌కి పనికి వస్తుంది. త్రిముఖ పోటీలో బలి అవ్వొద్దు. నిన్ను బలి అవమని ఎవరు చెప్పారు. మొదటి రోజు నుంచి పవన్, చంద్రబాబు ఒక్కటే అని చెబుతున్నాం. ఇప్పుడు ఈనాడు ఆంధ్రజ్యోతిని మించి బరితెగించి రాసేస్తోంది. గతంలో ఎన్టీఆర్‌కు వ్యతిరేరకంగా ఏ ప్రభుత్వం ఉన్నా ఈనాడు జాగ్రత్తగా ఎలక్షన్ల వరకు పంచదార కోటింగ్ వేసి.. లోపల చేదు వార్తలు రాస్తుంది. ఎన్నికల ఏడాదిలో టీడీపీ అనుకూల వార్తలు రాసేది. ఈనాడు, రామోజీలా ముసుగు ఎందుకు.. చంద్రబాబు, పవన్‌ కలిసి వెళ్తామని చెప్పండి.

చంద్రబాబు, పవన్ ఒక్కటేనని మొదటి నుంచి చెబుతున్నాం
2014లో చేసినట్లు పోటీ చేయకుండా చంద్రబాబు బస్సు ఎక్కి తిరుగు. చంద్రబాబు, పవన్ గోతికాడ నక్క తెలివితేటలు కాకుండా నేరుగా ప్రజలకు చెప్పండి. మేం ఇద్దరం కలిసి పోటీ చేస్తామని చెప్పండి. లాలూచీ కుస్తీ వ్యవహారం. WWFలా కొట్టుకున్నట్లు పవన్, చంద్రబాబులు నటించొద్దు. కలిసి మెలిసి పోటీ చేయండని చెబుతున్నాం. మీరిద్దరూ కలిసిపోతారు. ముసుగు తీయండని 2019 మొదటి రోజు నుంచి చెబుతున్నాం. ఇది చేస్తారని మాకు తెలీదా. చంద్రబాబుతో వెళ్లిపోతారని మాకు తెల్సు. చంద్రబాబు కోసం ముసుగేసుకుని మోసం చేయటంపై ముందు నుంచి ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నాం. వీళ్లద్దరూ ఒకేతానులో ముక్కలు. వీళ్లద్దరూ ఒక్కటే. తేడా లేదని చెబుతున్నాం. మొన్న పవన్ పోటీ చేసింది 137 స్థానాలకు. జగన్ 175 స్థానాలకు పోటీ చేశారు. 2018లో జగన్‌ ప్రజలతోనే పొత్తు అని టీవీ ఛానల్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు ఉంటారు. ప్రజలు అవకాశం ఇచ్చే వరకు పోరాటం చేస్తానని చెప్పారు. జనం, దేవుడిని నమ్ముకుని ఉన్నానని జగన్ చెప్పారు. శత్రువులు ఎలా వచ్చినా.. జనం ద్వారా మిమ్మల్ని 2019లో చిత్తు చేశారు. 2024లోనూ చేస్తారు.

తాడేపల్లిగూడెంలో రథం తగలబెడితే ఏం చేశారు? కనీసం రథాన్ని పునర్‌ నిర్మించారా?
ఆలయాల మీద దాడులు చేసినవారిని అరెస్టులు చేయలేదని పవన్ అంటాడు. గతంలో పవన్, బీజేపీ, టీడీపీ ఉన్నప్పుడు తాడేపల్లిగూడెంలో ఒక రథాన్ని తగలబెడితే.. కనీసం ముద్దాయిల్ని పట్టుకోవటం కానీ, కేసును ముందుకు తీసుకువెళ్లని మీ ప్రభుత్వం తరుపున హిందువులకు ఎప్పుడైనా సంజాయిషీ ఇచ్చారా? ఆ రథాన్ని పునర్‌ నిర్మించటానికి పవన్, బీజేపీ, చంద్రబాబు సాయం చేశారా? ఇవాళ మతాన్ని, కులాన్ని రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకుందామని తద్వారా చంద్రబాబుకు మేలు చేద్దామని పవన్ చేస్తు్న్న కుట్రల్ని ప్రజలు చిత్తుచిత్తు చేస్తారు.

పవన్‌కు నచ్చకపోవటానికి ప్రభుత్వం ఏమైనా సినిమా హీరోయిన్‌నా?
జగన్ పథకాలు మేం కూడా అమలు చేస్తామంటున్నారంటే.. ప్రభుత్వ పాలన బావుందనే కదా
పవన్‌కు నచ్చని ప్రభుత్వం ఉండటానికి వీల్లేదు. పవన్‌కు నచ్చదు అంటే ఏమిటి? సినిమా హీరోయిన్లులా అందంగా ఉండాలా? ఏమిటి? పవన్‌కు ఏం నచ్చాలి. నచ్చకపోతే ఇన్నాళ్లూ జగన్ గారి ప్రభుత్వం అమలు చేసిన పథకాలూ అమలు చేస్తామని చంద్రబాబు, పవన్ చెప్పటం జగన్ ప్రభుత్వ విజయం కాదా? ఇది మంచి ప్రభుత్వమని మీ నోటితో మీరు చెబుతున్నట్టే కదా. ఇంతకంటే ప్రజా ప్రభుత్వం ఇంకేం కావాలి. ఈ ప్రభుత్వం అద్భుతంగా ఉందని.

మీ హయాంలో ఒక్క ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ వచ్చిందా?
చంద్రబాబు ఏనాడైనా ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ స్థాపించారా? ఒక నర్సు కాలేజీ అయినా స్థాపించారా? ప్రజలకు ఏం మేలు చేశారు. మా హయాంలో 17 మెడికల్ కాలేజీలు స్థాపించనున్నాం. చదువులు అనేవి ప్రభుత్వానికి బాధ్యతలేదనిచంద్రబాబు మాట్లాడారు. పవన్‌ కావాలంటే చంద్రబాబు మాటల వీడియోలు కూడా పంపిస్తాం. పేద, మధ్యతరగతి వర్గాల చదువు మొత్తం నా ప్రభుత్వానిది బాధ్యత అన్నారు.

దేశ చరిత్రలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్టేట్ ఫస్ట్ వచ్చిన దాఖలాలు ఉన్నాయా?
ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా ప్రైవేటు కాలేజీలతో పోటీ పడి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు స్టే్‌ట్‌ టాపర్లుగా రావటం ఎప్పుడైనా జరిగిందా? విద్య ప్రైవేటీకరణ చెందిన తర్వాత ప్రైవేటు పాఠశాలలతో పోటీ పడి ప్రభుత్వ పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు స్టేట్‌ టాపర్లు అయ్యారు. ఇది మార్పు కాదా? వైద్యం, విద్యలో, సామాజిక సమతుల్యంలో మార్పు. జనాభా దామాషా ప్రకారం ప్రతి కులానికి సముచిత స్థానాన్ని, గౌరవాన్ని ప్రభుత్వంలో ఇవ్వటం జరిగింది. ఇలా ఎప్పుడైనా జరిగిందా?

చంద్రబాబు కోసమే పవన్‌ రాజకీయాలు
చంద్రబాబు కోసం పవన్‌ కల్యాణ్‌ నిసిగ్గుగా రాజకీయాలు చేస్తున్నారు. ఎంతసేపూ సీఎం జగన్ మోహన్ రెడ్డి ని లక్ష్యంగా పవన్‌ దూషించటం, ద్వేషిస్తున్నారు. చంద్రబాబు పట్ల పవన్‌కు మమకారమే ఎక్కువ. పవన్‌ కల్యాణ్‌ చేస్తోంది చంద్రబాబు భజనే. మా నాయకుడు జగన్ కాబట్టి ఆయన చేసిందే చెబుతున్నాం.
పవన్‌ కల్యాణ్‌కు నాయకుడు చంద్రబాబు అని ఒప్పుకో.. భజన చేసుకో. ఆమాట చెప్పుకుండా ఈ భజన దేనికి. ఈ తప్పుడు.. ముసుగు రాజకీయాలు మానేసి. చంద్రబాబు కోసమే రాజకీయంగా బ్రతుకుతామని చెప్పు. షంషేర్‌గా చంద్రబాబు కోసమే బ్రతుకుతున్నానని చెప్పు. మేం ఎలా కాపు బిడ్డలం అని చెప్పుకుంటున్నాము. మాకు పోటీగా నికార్సయిన కాపు బిడ్డ దొరికాడనుకుంటాం. రాజకీయాలు చేస్తే.. చిరంజీవిలా, వంగవీటి రంగాలా చేయి. ఈ తోడేలు, నక్క రాజకీయాలు కట్టిపెట్టమని పవన్‌కు హితవు చెబుతున్నాం.

మీడియా ప్రశ్నలకు సమాధానం చెబుతూ..
– కర్నాటక రాజకీయాలకు, ఏపీకి సంబంధం ఏంటి? కర్నాటకలో బిస బిల్లా బాత్ తింటారు. ఏపీలో అన్నం తింటారు. ఎవరి జిహ్వరుచి వారిది.
– ఇంతకంటే నమ్మకమైన ప్రభుత్వం ఎక్కడ దొరుకుతుంది. ఏపీలో మళ్లీ జగన్ ప్రభుత్వమే వస్తుంది.
– బీజేపీ కర్నాటకలో నాశనమైపోతే.. ఆంధ్రాలో పొత్తు పెట్టుకోవాలని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అంటారా?
– కర్నాటకలో బీజేపీ ఓడిపోతే.. వైఎస్‌ఆర్‌సీపీకి వణుకు ఎందుకు?
– 2019లో జరిగినట్లే 2024లోనూ శృంగభంగం తప్పదు.
– ఇప్పుడు పేద ప్రజల్లో సీఎం జగన్‌ కి భారీ ఆదరణ ఉంది. ఇది ప్రజా ప్రభుత్వం 2024లోనూ జగన్ గారి ప్రభుత్వం కొనసాగి తీరుతుంది.

LEAVE A RESPONSE