– 68లక్షల మంది లబ్ధిదారులకు పంపిణీ
– రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ
నెల్లూరు: ప్రతినెలా ఒకటో తేదీన రాష్ట్రంలో పింఛన్ల పండుగరోజు అని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నగరంలోని మంగళవారం ఉదయం 42వ డివిజన్ మన్సూర్ నగర్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పింఛన్లు అందించి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ప్రజలతో మమేకమవుతూ వారు తెలిపిన పలు సమస్యలకు వెంటనే పరిష్కారం చూపించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెల ఒకటో తారీఖున రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ పండుగరోజుగా చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెల ఒకటో తారీకు 68 లక్షలు మంది లబ్ధిదారులకు పింఛన్లు అందజేస్తున్నామన్నారు. ఒకటో తారీఖునే 99 శాతం పింఛన్లను పంపిణీ చేస్తున్నామన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు పెంచి వృద్ధులకు రూ. 4 వేలు, వికలాంగులకు రూ. 6 వేలు, మంచానికి పరిమితమైన వికలాంగులకు రూ.15 వేలు అందిస్తున్నామని చెప్పారు.
పింఛను పొందుతున్న లబ్ధిదారుల కళ్ళలో ఆనందం చూస్తే సంతోషంగా ఉందని, 34 వేల కోట్లు ఏడాదికి పెన్షన్ లకు ఖర్చు అవుతోందన్నారు. భారతదేశంలో ఎక్కడా కూడా ఇంత పెద్దమొత్తం చెల్లించట్లేదని చెప్పారు. జూన్ 12 నుంచి తల్లికి వందనం అమలు చేస్తున్నామని, త్వరలోనే రైతులకు 20 వేలు అందిస్తామన్నారు.ఆగస్టు నుంచి మహిళలకు ఉచిత బస్సుప్రయాణం అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఖజానా ఖాళీగా వున్నప్పటికీ ముఖ్యమంత్రి అపార అనుభవంతో అభివృద్ధితో పాటు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ఎన్నికల హామీలను అమలుచేస్తున్నట్టు మంత్రి చెప్పారు.
పింఛన్ల పంపిణీలో సీఎం చరిత్ర సృష్టించారు : ఎంపీ వేమిరెడ్డి
ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. జిల్లాలో 3.40 లక్షల పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ. 130 కోట్లు పెన్షన్ దారులకు ప్రభుత్వం వెచ్చిస్తోందన్నారు. రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నా మాటప్రకారం పింఛన్లు పెంచి ఇస్తున్నట్టు చెప్పారు. పింఛన్ల పంపిణీలో సీఎం చంద్రబాబు చరిత్ర సృష్టించారన్నారు. పేదలు, వికలాంగులు, వితంతువులు సీఎం కు కృతజ్ఞతలు తెలుపుతున్నారని, వాళ్ళ ఆనందం చూస్తే చాలా సంతోషంగా ఉందన్నారు.
మన ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. రాత్రి, పగలు తేడా లేకుండా మంత్రి నారాయణ అభివృద్ధికి కృషిచేస్తున్నారని చెప్పారు. ఇటువంటి మంత్రి మనకి ఉండటం నెల్లూరు ప్రజల అదృష్టంగా ఎంపీ కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ నందన్, డిప్యూటీ మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్, స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.