Suryaa.co.in

Andhra Pradesh

కూటమి పాలనలో అభివృద్ధిని చూసి వైసీపీ దుష్ప్రచారం!

– జగన్, వైసీపీ డ్రామాలను యువత గమనించాలి
– వైసీపీ అబద్దాలకు రెచ్చిపోతే కేసులతో యువత భవిష్యత్ నాశనం
– జగన్ పాలనలో 2,400 మంది నిరుద్యోగులు ఆత్మహత్య
– నిరుద్యోగుల ఆత్మహత్యల్లో దేశంలో మొదటి రాష్ట్రంగా ఉంది
– నేడు రూపాయి ఖర్చులేకుండా కూటమి ప్రభుత్వం స్కిల్ సెంటర్లు పెట్టి ఉద్యోగ కల్పనకు కృషి చేస్తోంది
– జగన్ రెడ్డి పాలనలో ఉన్న కంపెనీలను తరిమికొట్టారు
– దాదాపు పది లక్షల కోట్ల పెట్టుబడులు దూరం
– రాష్ట్రంలో యువత ఉద్యోగాలకోసం పక్క రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి నెలకొంది
– రాష్ట్రాన్ని గంజాయికి రాజధానిగా మార్చారు
– మెగా డీఎస్సీ అని ఇవ్వకుండా యువతను మోసం చేశారు
– జగన్ రెడ్డి తుగ్లక్ పాలన వలన యువత తీవ్రంగా నష్టపోయింది
– దాదాపు 20 శాతం రాష్ట్ర గ్రోత్ రేట్ తగ్గుదల
– గత ఐదేళ్లు యువతకోసం ఒక్క మేలు చేయకపోగా నేడు రెచ్చగొట్టే కార్యక్రమాలు
– యువత తమ భవిష్యత్ పై దృష్టిపెట్టాలి…. వైసీపీ దుష్ప్రచారాలు తిప్పికొట్టాలి
– మీడియా సమావేశంలో సీడాప్‌ చైర్మన్ దీపక్ రెడ్డి పిలుపు

జగన్ రెడ్డి గత ఐదేళ్ల పాలనలో కంపెనీలను తీసుకురాకపోగా.. ఉన్న కంపెనీలను కూడా తరిమికొట్టడంతో.. రాష్ట్రంలో ఉద్యోగాలు దొరక్కా దాదాపు 2,400 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని.. ఉద్యోగాల కోసం పక్కరాష్ట్రాలకు వెళ్లిన పరిస్థితి ఏర్పడిందని సీడాప్‌ చైర్మన్ దీపక్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఇక్కడ మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. గత ఐదేళ్లు నిరుద్యోగులను మోసం చేసి నేడు సిగ్గులేకుండా కూటమి ప్రభుత్వంలో యువతకు జరుగుతున్న మేలును చూసి ఓర్వలేక రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ మూకల అబద్దపు ప్రచారాలను నమ్మి యువత రెచ్చిపోతే వారి జీవితాలు నాశనం అవుతాయని హెచ్చరించారు. ఆ యువత తమ భవిష్యత్ పై దృష్టి పెట్టడానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోంది. కూటమి ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఎదగాలని సూచించారు.

వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోవడంతో జగన్ రాష్ట్ర ప్రజలపై కక్షగట్టారు. అబద్దాలతో ప్రజలను మభ్యపెట్టి రెచ్చగొట్టాలని చూస్తున్నారు. గతంలో వైసీపీ పార్టీ ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ తీసుకు వస్తానని చెప్పి నిరుద్యోగ యువతను నిలువునా ముంచింది. జగన్ పాలనలో లక్షా 80 వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రాన్ని వీడి పోయాయి. జగన్ రెడ్డి ఆర్థిక ఉగ్రవాదని వెళ్లిపోయిన కంపెనీలే అన్నాయి.

సాఫ్ట్ వేర్ కంపెనీలు, హార్డ్ వేర్ కంపెనీలను తరిమేశాడు. చివరకు అండర్వేర్ కంపెనీని కూడా తరిమేశాడు. కేంద్ర ప్రభుత్వం చెప్పినా వినకుండా పవర్ కంపెనీల అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసి.. దాదాపు రూ. 12,250 కోట్లు పవర్ వాడుకోకుండానే ఆ సంస్థలకు నగదు చెల్లించిన పరిస్థితి. పోలవరం పనులు ఆగడం వలన.. దాదాపు రూ. 2 లక్షల కోట్లు నష్టపోయాం. ఈ డబ్బు గత ఐదేళ్లలో జగన్ డీబీటీలో ఇచ్చిన దానికి సమానం.

కూటమి ప్రభుత్వం వచ్చాక దాదాపు 9 లక్షల కోట్ల పెట్టుబడులపై కంపెనీలతో అగ్రిమెంట్ అయ్యింది.. కొన్ని కంపెనీలు పనులు మొదలెట్టాయి. ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. ప్రభుత్వం నుండి డీఎస్సీ ద్వారా 16,346 పోస్టులు భర్తి చేస్తున్నాం, 6,100 పోలీసు నియామకాలు చేస్తున్నాం. సీడ్ యాప్, ఏపీఎస్‌ఎస్‌డీసీ ద్వారా ఇప్పటి వరకు 82,736 ఉద్యోగాలు కల్పించారు. ఈ రెండు సంస్థల ద్వారా 30 వేలకు పైగా స్టూడెంట్స్ ట్రైన్ అవుతున్నారు. మరో రెండు నెలల్లో వారికి కూడా ఉద్యోగాలు కల్పిస్తాం.

ఆప్కాస్, ఏపీఎస్‌డీపీఎస్‌, ఐ అండ్‌ పీఆర్‌ ద్వారా 2,200 మందికి ఉద్యోగాలు కల్పించాం.. ఇవి ఓన్లీ గవర్నమెంట్ ద్వారా కల్పించినవి మాత్రమే.. ప్రైవేట్ వాటి గురించి చెప్పలేదు. ఇన్ఫోసిస్ తో కూడా..2 లక్షల మంది యువతను విదేశాలకు పంపించేందుకు అగ్రిమెంట్ చేసుకుంది. యువతలో స్కిల్ పెంచేందుకు 2024-2025 సంవత్సరానికి రూ. 1,210 కోట్లు కేటాయించింది. అనేక కంపెనీలతో మాట్లాడి.. వారికి కావాల్సిన ట్రైనింగ్ ఇప్పిస్తామన్నారు.

నాడు ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి.. ప్రత్యేక హోదా గురించి మాట్లాడకుండా యువతను మోసం చేసిన వ్యక్తి జగన్ రెడ్డి. విదేశీ విద్యకు అంబేద్కర్ పేరును తొలగించి జగన్ పేరును పెట్టుకొని ఆ పథకాన్ని నిర్వీర్యం చేసిన వ్యక్తి జగన్ రెడ్డి. గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేసిన వ్యక్తి జగన్ రెడ్డి. రూ.4,271 కోట్లు ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థులను మోసం చేసిన వ్యక్తి జగన్ రెడ్డి.

వాలంటీర్లను వారికి తెలియకుండా వారినే మోసం చేసిన వ్యక్తి జగన్ రెడ్డి. 6,508 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇస్తానని ఇవ్వకుండా మోసం చేసింది కూడా జగన్ రెడ్డే. అలాగే. గతంలో 6 లక్షల మందికి టీడీపీ ఇచ్చిన యువనేస్తంను వైసీపీ ఎగ్గొట్టి మోసం చేసింది వాస్తవం కాదా? జగన్ రెడ్డి పాలన వలన దాదాపు పది లక్షల కోట్ల పెట్టుబడులు రాకుండా పోయిన పరిస్థితి. గత టీడీపీ హయాంలో గ్రోత్ రేట్.. వైసీపీ హయాంలో గ్రోత్ రేట్ చూస్తే ఇది తెలుస్తుంది. దాదాపు 20 శాతం గ్రోత్ రేట్ తగ్గిపోయిందన్నారు.

జగన్ రెడ్డి తుగ్లక్ పాలన వలనే రాష్ట్రం నష్టపోయింది. భారత దేశంలోనే ఎక్కువ మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్రంగా నిలిచింది.. దీనికి సూటిగా జగన్ రెడ్డి సమాధానం చెప్పగలడా? ఏపీపీఎస్‌సీని కూడా నిర్వీర్యం చేసి అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చి .. నిజంగా కష్టపడిన పిల్లలతో ఆడుకున్నారు. విదేశీ విద్య పథకాన్ని మధ్యలో ఆపేసి విదేశాల్లో చుదువుకుంటున్న విద్యార్థుల జీవితాలతో జగన్ రెడ్డి ఆడుకున్నాడు. రాష్ట్రాన్ని గంజాయి, మద్యం, డ్రగ్స్ తో ముందుకు తీసుకెళ్లాడు. నిరుద్యోగులను నమ్మించి నిలువునా మోసం చేశాడు. నాడు చేయాల్సింది అంతా చేసి నేడు యువతను రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయడం సిగ్గుచేటన్నారు.

నేడు ముఖ్యమంత్రి డైరెక్షన్ లో సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ను ప్రోత్సహిస్తున్నాం. నేటి వైసీపీ డ్రామాలను యువత గమనించాలి. వైసీపీ నేతల మాటలు విన్నారంటే కేసులు తప్ప ఏమి ఉండదు. కూటమి ప్రభుత్వం రూపాయి ఖర్చు లేకుండా.. స్కిల్ ట్రైనింగ్ ఇస్తుంది. యువత తమ భవిష్యత్ పై దృష్టిపెట్టాలి. వైసీపీ దుష్ప్రచారాలు తిప్పికొట్టాలని దీపక్ రెడ్డి పిలుపునిచ్చారు.

LEAVE A RESPONSE