-భాజపాకు భారాస బీ టీమ్
-మోదీ చేతిలో కేసీఆర్ రిమోట్
-కేసీఆర్ అవినీతికి ప్రధాని మోదీ అండదండలే కారణం
-బీఆర్‌ఎస్ అంటే బీజేపీకి బంధువు పార్టీ
-ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఖిల్లా
-మీ మనసుల్లో.. మీ రక్తంలో కాంగ్రెస్ ఉంది
-మిషన్ భగీరథలో రూ.వేల కోట్లు దోచుకున్నారు
-కాళేశ్వరంలో రూ.లక్షకోట్లు దోచుకున్నారు
-తెలంగాణలో భాజపా పని అయిపోయింది
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేయూత పేరుతో వృద్ధులు, వితంతులకు రూ.4వేలు పింఛను ఇస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. పోడుభూములన్నీ గిరిజనులకు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిక, భట్టి పాదయాత్ర ముగింపు సందర్భంగా ఖమ్మంలో నిర్వహించిన తెలంగాణ జనగర్జన సభలో రాహుల్‌గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఖమ్మం వేదికగా ఎన్నికల హామీలు ప్రకటించారు. కర్ణాటకలో మాదిరిగా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
‘‘భారత్ జోడోయాత్ర తర్వాత తెలంగాణకు రావడం సంతోషంగా ఉంది. దేశాన్ని ఏకం చేసేందుకు జోడో యాత్ర చేశా. ప్రజల్లో విద్వేషం తొలగించే ప్రయత్నం చేశా. అది కాంగ్రెస్‌పార్టీ సిద్ధాంతం. దేశమంతా భారత్ జోడో యాత్రను సమర్థించింది. జోడో యాత్రలో పాల్గొన్నందుకు మీకందరికీ ధన్యవాదాలు. భారాసను వీడి కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని స్వాగతిస్తున్నా. పొంగులేటి పులిలా పోరాడుతున్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఖిల్లా. మీ మనసుల్లో.. మీ రక్తంలో కాంగ్రెస్ ఉంది. పీపుల్స్ మార్చి పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకున్న భట్టి విక్రమార్కకు అభినందనలు.
తెలంగాణ రాష్ట్రం కావాలని ఓ స్వప్నంగా ఉండేది. తెలంగాణ.. పేదలు, రైతులు అందరికీ ఓ స్వప్నం. తొమ్మిదేళ్ల పాటు ఆ కలను భారాస ధ్వంసం చేసింది. బీఆర్‌ఎస్ అంటే భాజాపా రిష్తేదార్ పార్టీ (భాజపా బంధువుల పార్టీ). సీఎం కేసీఆర్ తెలంగాణకు రాజుగా భావిస్తున్నారు. ఈ రాష్ట్రం ఆయన జాగీరు అనుకుంటున్నారు. ధరణితో భూములు ఎలా దోచుకుంటున్నారో భారత్ జోడో యాత్ర సందర్భంగా మీరు చెప్పారు.
ఈ భూములు కేసీఆర్‌వి కావు.. మీవి. మిషన్ భగీరథలో రూ.వేల కోట్లు దోచుకున్నారు. కాళేశ్వరంలో రూ.లక్షకోట్లు దోచుకున్నారు. సమాజంలో అన్ని వర్గాలను కేసీఆర్ దోచుకున్నారు. పార్లమెంట్‌లో భాజపాకు భారాస బీ టీమ్‌గా పనిచేసింది. రైతుల బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకిస్తే.. భారాస మద్దతు పలికింది. కేసీఆర్ రిమోట్ ప్రధాని మోదీ చేతిలో ఉంది. వరంగల్‌లో కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్, హైదరాబాద్‌లో యూత్ డిక్లరేషన్ ప్రకటించింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఒక అవినీతి ప్రభుత్వాన్ని ఓడించింది.
కర్ణాటకలో రైతులు, ఆదివాసీలు, పేదలు అందరూ కాంగ్రెస్ పక్షాన నిలిచారు. తెలంగాణలో కూడా ఇదే జరగబోతోంది. తెలంగాణలో భాజపా పని అయిపోయింది. మొదట్లో ఇక్కడ ముక్కోణపు పోటీ అనుకున్నారు. కానీ, భాజపా బీటీమ్ భారాస, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంది. కర్ణాటకలో భాజపాను ఓడించిన విధంగానే తెలంగాణలో భాజపా బీటీమ్‌ను ఓడించబోతున్నాం.
భారాసతో కాంగ్రెస్‌కు ఎలాంటి ఒప్పందం ఉండదు. ఇటీవల దిల్లీలో విపక్షాల సమావేశం జరిగింది. విపక్షాల భేటీకి భారాస వస్తుందా అని అడిగాం. భారాస వస్తే మేం హాజరుకాబోమని చెప్పాం. కేసీఆర్ అవినీతికి ప్రధాని మోదీ అండదండలే కారణం. కేసీఆర్ ఏ స్కామ్‌లు చేశారో కేంద్ర దర్యాప్తు సంస్థలకు, మోదీకి తెలుసు. అందుకోసమే భారాస భాజపాకు బీటీమ్‌గా ఉంది’’ అని రాహుల్ గాంధీ ఆరోపించారు.
భారత్ జోడో యాత్రకు తెలంగాణ ప్రజలు అండగా నిలిచారని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఖమ్మంలో తెలంగాణలో జన గర్జన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, దేశాన్ని కలపడం మన విధానం.. విడదీయడం బీజేపీ విధానం.. కాంగ్రెస్ సిద్ధాంతాలకు ప్రజలు అండగా నిలిచారన్నారు. ప్రజల మనస్సుల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది’’ అని రాహుల్ పేర్కొన్నారు.
‘‘అనేక వర్గాల ప్రజలకు తెలంగాణ స్వప్నంగా ఉండేది. 9 ఏళ్ల పాలనలో ప్రజల ఆకాంక్షలను బీఆర్‌ఎస్ పట్టించుకోలేదు. బీఆర్‌ఎస్ అంటే బీజేపీకి బంధువు పార్టీ తెలంగాణ తాను రాజుగా కేసీఆర్ భావిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో లక్ష కోట్ల అవినీతి జరిగింది. ధరణితో ముఖ్యమంత్రి భూములు దోచుకుంటున్నారు. మిషన్ భగీరథలో వేల కోట్లు దోచుకున్నారు’’ అని రాహుల్ దుయ్యబట్టారు.
రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. తెలంగాణ జనగర్జన వేదికపై రాహుల్ గాంధీ పార్టీ కండువా కప్పి పొంగులేటిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. పొంగులేటితో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు రాహుల్ సమక్షంలో పార్టీలో చేరారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్ రావు ఠాక్రే తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.