Suryaa.co.in

Telangana

అధికారంలోకి వస్తాం.. తిరిగి ఖమ్మంలో విజయోత్సవ సభ నిర్వహిస్తాం

-కాలనాగులా, అనకొండలా కల్వకుంట్ల కుటుంబం తెలంగాణాను కొల్లగొట్టింది
-పేదలకు 4000 పెన్షన్ ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయం
-‘తెలంగాణ జన గర్జన’ బీఆర్ఎస్ వెన్నులో వణుకు
-అధికారులు పద్ధతి మార్చుకోకపోతే పరిణామాలు
-టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

డిసెంబర్ 9న రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం ఖమ్మం లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ లో చేరిక, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించిన జనగర్జన సభలో ఆయన ప్రసంగించారు.

అధికారంలోకి వచ్చాక ఖమ్మంలోనే విజయోత్సవ సభ నిర్వహిస్తామని చెప్పారు.తెలంగాణ ఉద్యమానికి పునాది వేసింది ఖమ్మం జిల్లానేనని రేవంత్ తెలిపారు. కల్వకుంట్ల కుటుంబంలో బందీ అయిన తెలంగాణకు విముక్తి కల్పించేందుకు మళ్లీ ఖమ్మం నుంచి నాంది పలకాలని సూచించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా కాంగ్రెస్ సభగా భారీగా తరలివచ్చారన్నారు.

తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం కొల్లగొట్టిందని మండిపడ్డారు. తెలంగాణ పొలిమేరల నుంచి కేసీఆర్ కుటుంబాన్ని అండమాన్ వరకు తరమాలని పిలుపునిచ్చారు. ఖమ్మం సభకు బీఆర్ఎస్ ప్రభుత్వం బస్సులు ఇవ్వలేదని విమర్శించారు. అయినా కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ ప్రభుత్వ గోడలను కూలగొట్టుకుంటూ ఖమ్మం సభకు తరలివచ్చారని చెప్పారు.

ఖమ్మం జిల్లాలో సీనియర్ లీడర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారని రేవంత్ రెడ్డి తెలిపారు. ఆయన చేరిక ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ 10 సీట్లలో విజయం సాధించేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు. అలాగే 109 రోజుల పాటు భట్టి విక్రమార్క పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకున్నారని తెలిపారు.

భట్టి మార్చ్ యాత్రలో దృష్టి కొచ్చిన అంశాలు మేనిఫెస్టో గా ఉంటాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అందరి అభిప్రాయాలు తీసుకుని..ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కాంగ్రెస్ మేనిఫెస్టో ఉంటుందన్నారు.

వరంగల్ సభలో రైతు డిక్లరేషన్ ప్రకటించామని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. సరూర్ నగర్ సభలో యూత్ డిక్లరేషన్ వివరించామన్నారు. ఖమ్మం జనగర్జన సభలో వృద్ధులకు రూ. 4వేల పింఛన్ ఇవ్వబోతున్నట్లు రాహుల్ గాంధీ ప్రకటించారని చెప్పారు. అధికారంలోకి వస్తే సంక్షేమం, అభివృద్ధి అనే రెండు పాదాలపై రాష్ట్రాన్ని నడిపిస్తామన్నారు రేవంత్ రెడ్డి.

LEAVE A RESPONSE