తెలంగాణ ఉద్యమకారులకు పింఛను ఇవ్వాలి

  • ఇల్లులేక ఇస్త్రీ డబ్బాలో నివసిస్తున్న వృద్ధ దంపతులు
  • వారి దుస్థితిని చలించి పోయిన బండి సంజయ్

పాదయాత్రలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈరోజు రామన్నపేటలో రోడ్డుపక్కనే ఉన్న ఓ ఇస్త్రీ డబ్బావద్దకు వెళ్లారు. బట్టలు ఇస్త్రీ చేస్తున్న వృద్ధ దంపతులు ధనూరి బక్కమ్మ, శంకరయ్యలను కలిశారు. ’’సార్ మాకు ఉండటానికి ఇల్లు.. పిల్లల్లేరు. ఆస్తిపాస్తుల్లేవు. ఆ డబ్బాలోనే తింటున్నాం..ఇక్కడే పడుకుంటున్నాం.. మాకు ఏ ఆధారమూ లేదు సారూ..‘’’అని కన్నీటి పర్యంతమయ్యారు. వారి దుస్థితిని చూసి చలించిపోయిన బండి సంజయ్ అక్కడికక్కడే కొంత ఆర్దిక సాయం అందించారు. మీరేం బాధపడొద్దని… అండగా ఉంటానని భరోసానిచ్చారు. వారికి ఇల్లుసహా కనీస సౌకర్యాలు అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలంటూ స్థానిక నేతలను కోరారు.

కొబ్బరి బొండాం తాగుతూ….
అనంతరం బండి సంజయ్ ముందుకు సాగుతుండగా అక్కడే కొబ్బరి బొండాలు అమ్ముతున్న అనిత అనే మహిళ వద్దకు వెళ్లారు. కొబ్బరి బొండాం తాగారు. ఆమె కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కొంత ఆర్దిక సాయం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం నుండి ఏదైనా సాయం అందుతుందా? అని అడిగారు.. తమకు ఏ సాయమూ అందడం లేదని, కొబ్బరి బొండాల అమ్మకంతోనే జీవనాధారాన్ని కొనసాగిస్తున్నామని ఆమె పేర్కొనడంతో ఏమీ బాధపడొద్దని… బీజేపీ అధికారంలోకి వచ్చాక తోడ్పాటు అందిస్తామని హామీ ఇస్తూ ముందుకు సాగారు..

సంజయ్ ను కలిసిన బిల్ కలెక్టర్లు, కారోబార్లు
పాదయాత్రలో భాగంగా తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కాసోజు నాగరాజు ఆధ్వర్యంలో పలువురు బిల్ కలెక్టర్లు, కారోబార్లు బండి సంజయ్ ను కలిసి తమ సమస్యలను మొరపెట్టుకున్నారు. 30 ఏళ్లుగా పనిచేస్తున్నప్పటికీ తమను గుర్తించడం లేదని వాపోయారు. పంచాయతీల్లో పనిచేస్తున్న కారోబార్లు, బిల్ కలెక్టర్లలకు ప్రత్యేక హోదా కల్పించాలని, జీవో నెంబర్ 51ని వెంటనే సవరించాలని, ఉద్యోగాలకు భద్రత కల్పించాలని, రూ.10 లక్షల జీవిత భీమా కల్పించాలని, కారోబార్, బిల్ కలెక్టర్లకు కార్యదర్శులుగా పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు. వారి సమస్యలను విన్న బండి సంజయ్ బీజేపీ అధికారంలోకి రాగానే బిల్ కలెక్టర్ల, కారోబార్ల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

గుడి నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారు
బండి సంజయ్ కు రామన్నపేట గ్రామస్తుల ఫిర్యాదు
పాదయాత్రలో భాగంగా రామన్నపేటకు వచ్చిన బండి సంజయ్ కు స్థానిక ప్రజలు పలువురు కలిసి తాము కనకదుర్గ దేవాలయాన్ని నిర్మిస్తుంటే… స్థానిక నేత ఎడ్ల స్వయంరెడ్డి తన రాజకీయ పలుకుబడిని ఉపయోగిస్తూ గుడి నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. తమ ఆరాధ్యదైవమైన కనకదుర్గమ్మ గుడి విషయంలో ఎలాంటి ఆటంకాల్లేకుండా నిర్మాణం కొనసాగేలా చూడాలని కోరారు. సానుకూలంగా స్పందించిన బండి సంజయ్ ఈ విషయంలో వారికి అండగా ఉంటూ గుడి నిర్మాణం కొనసాగేలా చూడాలంటూ స్థానిక నేతలను కోరారు.

తెలంగాణ ఉద్యమకారులకు పింఛను ఇవ్వాలి
బండి సంజయ్ ను కోరిన బీసీ రిజర్వేషన్ సాధన సమితి నేతలు
తెలంగాణ రాష్ట్ర సాధనకై పోరాడిన ఉద్యమకారులను స్వాతంత్ర్య సమరయోధులుగా గుర్తించి ప్రతినెలా రూ.10 వేలు ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరుతూ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ బండి సంజయ్ ను కోరుతూ వినతి పత్రం అందజేశారు. అదే సమయంలో తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన పోలీస్ కిష్టయ్య, శ్రీకాంతచారి సహా 1400 కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. సానుకూలంగా స్పందించిన బండి సంజయ్ బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత తెలంగాణ ఉద్యమకారులను ఆదుకునే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరోవైపు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు సైతం బండి సంజయ్ ను కలిసి ఎస్సీ వర్గీకరణ అంశంపై వినతి పత్రం అందజేశారు.

Leave a Reply