Suryaa.co.in

Telangana

సమైక్య పాలకులను మించి తెలంగాణలో అవినీతి రాజ్యమేలుతోంది

-కేసీఆర్ కుటుంబ, అవినీతి, నియంత పాలనతో ప్రజలు విసిగిపోయారు
-బీజేపీని ప్రత్యామ్నాయ పార్టీగా ఆదరిస్తున్నారు
-కేసీఆర్ ఇచ్చిన హామీలపై ప్రజాక్షేత్రంలోకి వెళ్లి నిలదీయండి
-రాష్ట్ర శిక్షకుల శిక్షణా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ పిలుపు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్, టీడీపీ పాలనను మించి కేసీఆర్ పాలనలోనే అవినీతి ఎక్కువగా రాజ్యమేలుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుటుంబ అవినీతి, నియంత పాలనతో ప్రజలు విసిగిపోయారని అన్నారు. రాష్ట్రంలోని ప్రజలంతా బీజేపీని ప్రత్యామ్నాయ పార్టీగా ఆదరిస్తున్నారని, ఇటీవల ప్రజా సంగ్రామ యాత్రకు వచ్చిన ఆదరణే ఇందుకు నిదర్శనమన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతోపాటు వివిధ వర్గాలకు ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజా క్షేత్రంలోకి వెళ్లి నిలదీయాలని పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ప్రాంత ప్రశిక్షణా విభాగం ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన శిక్షకుల శిక్షణా సమావేశ ప్రారంభ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శులు మంత్రి శ్రీనివాసులు, దుగ్యాల ప్రదీప్ కుమార్, ప్రశిక్షణా కమిటీ కన్వీనర్ డా. ఓ.ఎస్.రెడ్డి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. వర్చువల్ పద్దతిలో జరిగిన ఈ సమావేశంలో ఓబీసీ జాతీయ మెర్చా అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.ప్రకాశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు….
• పాలకులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తే ప్రజలు తగిన బుద్ది చెబుతారనడానికి దేశ చరిత్రతోపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోని అనేక సంఘటనలే నిదర్శనం. కేంద్రంలోని ఇందిరా గాంధీ పాలనలో అవినీతి, కుటుంబ, నియంత్రుత్వ పాలన రాజ్యమేలింది. ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన పార్టీ బీజేపీ. ఇందిరాగాంధీ మరణానంతరం రాజీవ్ గాంధీ పాలనలోనూ అవినీతి రాజ్యమేలింది. నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని బీజేపీ అధికారంలోకి వచ్చాక ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదు.
• నాడు సమైక్య రాష్ట్రంలోనూ కాంగ్రెస్, టీడీపీ పాలనలో అవినీతి కొనసాగింది. మర్రి చెన్నారెడ్డి, అంజయ్య, కోట్ల విజయభాస్కర్ రెడ్డి పాలనలో ప్రజలు విసిగిపోయారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఫలితంగానే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగానే ఆనాడు టీడీపీని ఆదరించారు.
• కానీ ఎన్టీఆర్ హయాంలో కుటుంబ పాలన, నియంత్రుత్వ పోకడలను భరించలేని ప్రజలు ఆ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చారు. 1994లో మళ్లీ 1999 అటల్ బిహారీ వాజ్ పేయి సహకారంతో అధికారంలోకి వచ్చినా చంద్రబాబు ఏకపక్ష, నియంత్రుత్వ, అవకాశవాద పోకడలవల్ల 2004లోనూ ఘోరంగా ఓటమిపాలయ్యారు.
• ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని కాంగ్రెస్, టీడీపీ పాలన కంటే తెలంగాణలోని కేసీఆర్ హయాంలోనే అవినీతి ఎక్కువగా రాజ్యమేలుతోంది. కేసీఆర్ కుటుంబ అవినీతి, నియంత పాలనపట్ల ప్రజలు విసిగిపోయారు. ప్రజలు ఈ పాలనకు చరమ గీతం పాడాలని భావిస్తున్నారు.
• ఈ పరిస్థితుల్లో ప్రజలు బీజేపీని ప్రత్యామ్నాయ పార్టీగా చూస్తున్నారు. అవినీతి, నియంత, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా చేపట్టిన ‘ప్రజా సంగ్రామ యాత్ర’కు ప్రజల నుండి వచ్చిన విశేష స్పందన ఇందుకు నిదర్శనం. బీజేపీకి అవకాశం ఇస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందని, రాష్ట్రం అభివ్రుద్ది జరుగుతుందనే భావనలో ఉన్నారు. ఈ తరుణంలో ప్రజలకు విశ్వాసం కల్పించి వారి పక్షాన పోరాడాల్సిన బాధ్యత బీజేపీ నాయకులు, కార్యకర్తలపై ఉంది. ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వమున్న, కార్యకర్తలున్న పార్టీ బీజేపీ మాత్రమే. ఎన్నికలొస్తాయి….పోతాయి….బీజేపీ మాత్రం ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతోంది.
• బీజేపీకి నాయకులు ముఖ్యం కాదు. సిద్దాంతాలు ముఖ్యం. పార్టీకి లక్ష్యాలు, విధానాలు ముఖ్యం. నక్సలైట్ల నుండి చంపేస్తామంటూ వార్నింగులు వచ్చినా….కుటుంబాలకు దూరమై పార్టీ కోసం పనిచేసిన నాయకులెందరో బీజేపీలో ఉన్నారు. అలాంటి నాయకుల క్రుషి వల్లనే ఈరోజు తెలంగాణలో బీజేపీ అధికారంలో వచ్చే పరిస్థితి ఏర్పడింది. వారి స్పూర్తితోనే పనిచేసి ప్రజలకు మరింత చేరువ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
• అవినీతి, కుటుంబ పాలనను బీజేపీ ఎన్నటికీ సహించదు. అందుకే ప్రజలు బీజేపీని ప్రత్యామ్నయ పార్టీగా చూస్తున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం యువత, మహిళలు, రైతులుసహా ఏ వర్గానికి ఏయే హామీలిచ్చింది? వేటిని విస్మరించింది అనే అంశాలపై అధ్యయనం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లి టీఆర్ఎస్ ను ఎండగట్టాలి.
• రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాటికి కొమ్ముకాసే పార్టీ ఎంఐఎం పార్టీ. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు వాటికి ఎంఐఎం కొమ్ముకాస్తోంది. అందుకే పాతబస్తీ అభివ్రుద్దికి దూరంగా ఉంది. ఈ విషయాన్ని పాతబస్తీ ప్రజలు కూడా గుర్తించారు.
• బీజేపీ ఏ మతానికీ వ్యతిరేకం కాదు. దేశద్రోహుల పార్టీని తరిమికొట్టే విషయంలో ఎన్నటికీ వెనుకాడం. దేశంలో హిందు సమాజం శ్రేయస్సు కోసం నిరంతరం ఆలోచించే పార్టీ బీజేపీ మాత్రమే.
• బీజేపీ మూల సిద్దాంతానికి లోబడే నిర్ణయాలుంటాయి. దేశ రాజకీయ, ఆర్దిక, సామాజిక అంశాలపట్ల ఎప్పటికప్పుడు కార్యకర్తలకు అవగాహన కల్పించి ప్రజా క్షేత్రంలో పనిచేయడానికి అవసరమైన ఆయుధాలను ఈ శిక్షణా తరగతుల ద్వారా అందిస్తున్నాం. శిక్షణ పొందిన కార్యకర్తలు, నాయకులు మరింత ఉత్సాహంగా, తెగువతో పనిచేస్తే రాబోయే ఎన్నికల్లో బీజేపీకి విజయం తథ్యం. ఈ లక్ష్య సాధన కోసం ప్రతి ఒక్క కార్యకర్త సుశిక్షుతుడై పార్టీని విజయ తీరాలకు చేర్చే దిశగా ముందుకు సాగుతారని ఆశిస్తున్నా.

LEAVE A RESPONSE