ఏడాదిపొడవునా అందుబాటులో ఉండే నేత తలసాని
డబుల్ బెడ్ రూం ఇళ్ల పైలెట్ ప్రాజెక్టు సనత్‌నగర్‌లోనే
అభివృద్ధిపై పట్టువదలని విక్రమార్కుడు శ్రీనివాసయాదవ్
పోలింగ్ శాతం పెంపుపై దృష్టి పెట్టండి
చేసిన అభివృద్ధి పనులు ప్రచారం చేయండి
సోషల్‌మీడియాలో వ్యతిరేక ప్రచారం తిప్పికొట్టండి
సనత్‌నగర్ నియోజకవర్గ కార్యకర్తల భేటీలో మంత్రి కేటీఆర్
పోలింగ్ శాతం పెరిగే విధంగా బూత్ కమిటీ సభ్యులు కాలనీలు, అపార్ట్ మెంట్ ల పై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. సోమవారం సికింద్రాబాద్ లోని SVIT ఆడిటోరియం లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అద్యక్షతన ఏర్పాటు చేసిన సనత్ నగర్ BRS బూత్ కమిటీ సభ్యుల సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ముందుగా సమావేశ ప్రాంగణంలో BRS పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం సమావేశంలో ఆయన మాట్లాడుతూ గడిచిన తొమ్మిదిన్నర సంవత్సరాలలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ఇంటింటికి వెళ్ళి ఓటర్లకు వివరించాలని సూచించారు. నిరంతరం ప్రజల మద్య ఉంటూ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి నాయకుడు ఉన్న సనత్ నగర్ నియోజకవర్గ ప్రజలు అదృష్టవంతులు అన్నారు. కేవలం ఎన్నికల సమయంలో ప్రచారం చేసే నాయకుడు కాదని, 365 రోజులు ప్రజలతోనే ఉండే నేత శ్రీనివాస్ యాదవ్ అని చెప్పారు.
ప్రభుత్వం ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా మొదటగా పైలట్ ప్రాజెక్ట్ ను మా నియోజకవర్గంలోనే చేయాలని పట్టుబట్టే నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ అని చెప్పారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం ప్రారంభించిన IDH కాలనీ కూడా సనత్ నగర్ నియోజకవర్గంలోనిదే అన్నారు. గొప్ప మెజార్టీతో సనత్ నగర్ నియోజకవర్గంలో తప్పకుండా గెలుస్తారని స్పష్టం చేశారు. ఎన్నికలు కేవలం 15 రోజులు మాత్రమే ఉన్నందున ప్రతి ఇంటిని, ప్రతి వ్యక్తిని కలిసే విధంగా బూత్ కమిటీ సభ్యులు ప్రణాలికలు చేసుకోవాలని చెప్పారు.
మూడోసారి ముచ్చటగా KCR ముఖ్యమంత్రి
రాష్ట్రంలో మళ్ళీ మనమే అధికారంలోకి వస్తున్నామని, ముచ్చటగా మూడోసారి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి గా బాద్యతలు చేపడతారని KTR ప్రకటించారు. ప్రజలు అభివృద్ధి, సంక్షేమం కోసం పని చేసే వారిని ఆదరిస్తారని, ఎన్నికల సమయంలో వచ్చే పొలిటికల్ టూరిస్ట్ లను నమ్మబోరని చెప్పారు. ఉన్నది లేనట్లు….లేనిది ఉన్నట్లు సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని విమర్శించారు. 400 రూపాయలు ఉన్న గ్యాస్ సిలెండర్ ను మోడీ ప్రభుత్వం 1200 రూపాయలకు పెంచి పేద ప్రజలపై ఆర్ధిక భారం మోపిందన్నారు. కానీ 800 రూపాయల భారాన్ని తామే భరిస్తూ 400 రూపాయలకే గ్యాస్ సిలెండర్ అందజేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారని తెలిపారు.
పేద ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలను చేరువ చేయాలనే ఆలోచనతో నగరంలో 350 కు పైగా బస్తీ దవాఖానా లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. టి డయాగ్నస్టిక్ ద్వారా ఉచితంగా వివిధ రకాల టెస్ట్ లను చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా కార్పోరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందించాలనే ఆలోచనతో నగరం నలు మూలల ఒకొక్కటి వెయ్యి పడకల సామర్ధంతో 4 మల్టి స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మాణం చేపట్టినట్లు వివరించారు. నగరం మద్యలో ఉన్న నిమ్స్ లో కూడా అదనంగా 2 వేల పడకల తో నూతన భవనాన్ని నిర్మిస్తున్నట్లు వివరించారు. అదేవిధంగా ఉస్మానియా ను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో చేసిన అభివృద్ధి చారాణా మాత్రమేనని, చేయాల్సింది బారాణా ఉందన్నారు.
నగరంలోని ప్రజలకు 24 గంటలు త్రాగునీరు అందించే విధంగా చూసే బాధ్యత తాను తీసుకుంటానని, సనత్ నగర్ లోనే పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. పేద ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఉచితంగా అందజేస్తున్న దేశంలోనే ఏకైక ప్రభుత్వం తెలంగాణ అన్నారు. అందులో భాగంగా GHMC పరిధిలో లక్ష ఇండ్ల నిర్మాణం చేపట్టి 70 వేల ఇండ్లను అర్హులకు పంపిణీ చేశామని, ౩౦ వేల ఇండ్ల నిర్మాణం జరుగుతుందని వివరించారు. మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేశాక మరో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మిస్తామని ప్రకటించారు.
వైకుంఠ దామాలను కూడా ఎంతో అభివృద్ధి చేసుకున్నామని, పేదల మేలు కోసం మల్టి పర్ఫస్ ఫంక్షన్ హాల్స్ ను కూడా నిర్మించుకున్నామని చెప్పారు. బేగంపేట లోని ముస్లీం లు 40 సంవత్సరాల నుండి ఖబరస్తాన్ కోసం స్థలం కేటాయించాలని కోరుతూ వస్తున్నా ఎవరు పట్టించుకోలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ఎకరాల భూమిని కేటాయించడంతో పాటు నిర్మాణ పనుల కోసం 3 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు వివరించారు.
కరోనా సమయంలో రెండు సంవత్సరాలు ఆర్ధికంగా ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలను కోల్పోయిందన్నారు. అయినా ఎక్కడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నదని తెలిపారు. ఉపాధి కోసం వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన వారికి ప్రభుత్వమే ఖర్చులు భరించి వారిని క్షేమంగా వారి గమ్య స్థానాలకు చేర్చామని వివరించారు. కుల మతాల విభేదాలు లేకుండా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలంటే, ప్రశాంతంగా ఉన్న రాష్ట్రం, నగరం ఇలాగే ఉండాలంటే BRS పార్టీని గెలిపించాలని కోరారు.
ఈ సమావేశంలో మాజీ MLC కర్నే ప్రభాకర్, సికింద్రాబాద్ పార్లమెంట్ BRS పార్టీ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, కార్పొరేటర్ లు కొలన్ లక్ష్మి బాల్ రెడ్డి, హేమలత లక్ష్మీపతి, మహేశ్వరి శ్రీహరి, మాజీ కార్పొరేటర్ లు అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్, నామన శేషుకుమారి, ఆకుల రూప హరికృష్ణ, ఉప్పల తరుణి, కిరణ్మయి, డివిజన్ అద్యక్షులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, గుర్రం పవన్ కుమార్ గౌడ్, కొలన్ బాల్ రెడ్డి, ఆకుల హరికృష్ణ, వెంకటేషన్ రాజు, శ్రీనివాస్ గౌడ్, బూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.