-నిత్యావసర ధరలు పెంచి పేదలకు పండుగ లేకుండా చేశారు
-త్వరలోనే పేదల ప్రభుత్వం, రైతు రాజ్యం వస్తుంది
-దేశంలో నెం.1 పెత్తందారి జగనే
-వైసీపీ నేతలు మెక్కిందంతా కక్కిస్తాం
-తుని రా..కదలి రా బహిరంగ సభలో నారా చంద్రబాబు నాయుడు
-జగన్ ప్రతిపక్ష నేతగా ఇచ్చిన హామీల వీడియో సభలో ప్రదర్శించి ఇదేనా మడమ తిప్పకపోవడం అని ప్రశ్నించిన టీడీపీ అధినేత
-ప్రత్యేక హోదా, బాబాయి హత్య, మద్యనిషేధం, సీపీఎస్ రద్దు, కార్పొరేషన్ లకు నిధులు, అమరావతి వంటి అంశాలపై జగన్ ఇచ్చిన హామీల వ్యాఖ్యల వీడియోను సభలో ప్రదర్శించి నిలదీసిన టీడీపీ అధినేత
తుని : జగన్ సినిమా అయిపోయిందని మళ్లీ వైసీపీ జీవితంలో ఎప్పుడూ కూడా గెలిచే పరిస్దితి లేదని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఉమ్మడి తూ.గో జిల్లా తునిలో నిర్వహించిన రా…కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ….. నీతి నిజాయితీ మంచితనానికి మారుపేరు తూ.గో జిల్లా. రాష్ట్రంలో రాజకీయం మారిందనేదానికి ఈ తుని సభే సాక్ష్యం. ఇది ప్రారంభం మాత్రమే, త్వరలోనే సునామీగా మారుతుంది.
మరో 3 నెలల తర్వాత టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు ఖాయం. ప్రజలకు సుపరిపాలన అందించేందుకు ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నారు. అహంకారం ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. జగన్ రెడ్డి అహంకారమే అతని అంతానికి దారి తీసే పరిస్ధితి నెలకొంది. ఎన్నికల ముందు మీ కాళ్లు పట్టుకుని ఒక్క చాన్స్ అన్న జగన్ రెడ్డి నేడు పిడిగుద్దులు గుద్దుతున్నాడు. ఈ 5 ఏళ్లలో ఎవరి జీవితాల్లోనైనా వెలుగొచ్చిందా? ఊర్లు, ఊర్లు ఏకమై వచ్చే ఎన్నికల్లో ఓటు అనే ఆయుదంతో వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించి బంగాళఖాతంలో కలపాలి. జగన్ రెడ్ది రాతియుగం పోయి తెలుగుదేశం జనసేన స్వర్ణయుగం తెలుగుజాతికి రావాలని నూతన సంవత్సరంలో సంకల్పించా. వచ్చే ఎన్నికలు అహంభావంతో విర్రవీగుతున్న జగన్ కి 5 కోట్ల మందికి జరుగుతున్న పోరాటం. ఈ ఎన్నికల్లో సైకో జగన్ ని ఓడించి రాష్ట్రాన్ని గెలిపించాలి.
5 ఏళ్లలో ప్రజల జీవన ప్రమాణాలు పెరగలేదు గానీ నిత్యావసర ధరలు అన్నీ పెరిగాయి. టీడీపీ హయాంలో రూ. 70 ఉన్న పెట్రోల్ నేడు రూ. 110కి పెరిగింది. డీజిల్ రూ. 70 నుంచి రూ. 99 కి పెరిగింది. రూ. 40 బియ్యం రూ. 60 కి పెరిగాయి. రూ. 87 ఉన్న కందిప్పు రూ. 140 కి, పంచదార రూ. 26 ఉంటే రూ. 45 చేరింది. వంటనూనె రూ. 60 నుంచి 130 కి ఎల్పీజీ గ్యాస్ రూ. 726 నుంచి రూ. 1176 కి పెరిగాయి. పెరిగిన ధరలతో మళ్లీ కట్టెల పొయ్యిపై ఆడబిడ్డలు వంట చేసుకుంటున్నారు. అదే రాతియుగం. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. నాసికరం మద్యం అధిక రేట్లకు అమ్ముతున్నారు. రూ. 60 ఉన్న క్వాటర్ బాటిల్ రూ. 200 పెంచారు. రూ. 140 ఉన్న టీవీకేబుల్ కనెక్షన్ నేడు రూ. 350కి పెరిగింది. నిత్యవసర ధరలు మండిపోతుంటే ప్రజలు పండుగ చేసుకునే పరిస్ధితిలో లేరు.
సంక్షేమం, అభివృద్దితో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపింది టీడీపీనే. పేదల్ని ఆదుకునే బాధ్యత నాది. అన్న క్యాంటీన్లు మళ్లీ ఏర్పాటు చేసి పేదల ఆకలి తీర్చుతాం. టీటీడీలో కూడా భక్తులకు నాసిరకం భోజనం పెట్టడం దుర్మార్గం. త్వరలోనే పేదల ప్రభుత్వం, రైతు రాజ్యం వస్తుంది. వచ్చే సంక్రాంతికి ప్రజల ముఖాల్లో వెలుగులు నింపుతాం. మహాశక్తి పధకం కింద మహిళలకు నెలకు రూ. 1500 ఇస్తాం, అమ్మకు వందనం కింద ఎంత మంది విద్యార్దులున్నా..ఒక్కొక్కరికీ ఏడాదికి రూ. 15 వేలిస్తాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. ఆటోడ్రైవర్లు అధైర్యపడొద్దు. మిమ్మల్ని ఆదుకుంటాం.
జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ ఏమైంది? 14 ఏళ్ల టీడీపీ పాలనలో లక్షలాది టీచర్ పోస్టులు భర్తీ చేశాం. జగన్ రెడ్డి ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదు. జగన్ రెడ్డికి కప్పం కట్టలేక రాష్ట్రం నుంచి పరిశ్రమలు పారిపోయాయి. జాబు కావాలంటే బాబు రావాలి. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తాం. యువత ప్రజల్ని చైతన్యం చేయాలి. అన్నధాత పధకం కింద రైతులకు ఏడాదికి రూ. 20 వేలిస్తాం. ఆక్వా రైతుల్ని ఆదుకుంటాం. వైసీపీ పాలనలో ఆక్వా రైతులు, రైతులు చితికిపోయారు. రైతులు, కౌలు రైతులు అన్ని విధాల ఆదుకుంటాం.
టీడీపీని ఆదరిస్తుంది బీసీలే. బీసీల్లో నాయకత్వాన్ని పెంపొందించింది టీడీపీనే. రిజర్వేషన్లు తగ్గించి 16,800 స్ధానిక సంస్ధల పదవులకు బీసీల్ని దూరం చేసిన వ్యక్తి జగన్ రెడ్డి. బీసీ సబ్ ప్లాన్ నిధులు ఏమయ్యాయి? బీసీల్ని టీడీపీ జనసేన ఆదుకుంటుంది. అన్ని కులాలు, మతాలు, ప్రాంతాల్ని టీడీపీ సమానంగా ఆదరిస్తుంది. దళితుల్ని చంపి డోర్ డెలివరి చేసిన ఎమ్మెల్సీని సీఎం తన పక్కన కూర్చో పెట్టుకోవటం సిగ్గుచేటు. ఎస్సీ,ఎస్టీలంటే జగన్ నీచంగా చూస్తున్నారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీని తూ.చ తప్పకుండా అమలు చేస్తాం.
జగన్ రెడ్డి అప్పుల కోసం రైతు బజార్లు, కలెక్టరేట్ ఆఫీసులు సహా ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టారు. మళ్లీ గెలిస్తే ప్రజల్ని కూడా తాకట్టు పెడతాడు. సంపద సృష్టించి ఆదాయం పెంచుతాం. ఆ ఆదాయంతో సంక్షేమం అభివృద్ది రెండు కళ్లుగా ముందుకెళ్తాం. తెలుగు జాతిని నెం. 1 గా చేసి పేదరికం లేని సమాజాన్ని తయారు చేస్తాం. హైదరాబాద్ లా అమరావతిని అభివృద్ది చేయాలనుకున్నాం. రైతులు 34 వేల ఎకరాల భూమి ఉచితంగా ఇచ్చారు. అది టీడీపీపై ప్రజలకున్న నమ్మకం. 3 రాజధానుల పేరుతో జగన్ రెడ్డి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. మన రాజధానిగా అమరావతే ఉంటుంది.
సంపద సృష్టించేందుకు అనేక మార్గాలున్నాయి. ప్రజల ఆదాయం పెంచటమే నాలక్ష్యం. పరిశ్రమల పొల్యూషన్ కంట్రోల్ చేసి మత్స్యకారులను రక్షిస్తాం. వేట విరామ భత్యం రూ. 2 వేల నుంచి రూ. 4 వేలకు పెంచిన ఘనత టీడీపీదే. మత్య్సకారులకు పెట్రోల్ , డీజీల్ సబ్పిడీకి ఇచ్చాం. కానీ జగన్ రెడ్డి జీవో 217 తీసుకొచ్చి మత్య్సకారుల పొట్టకొట్టారు. గతంలో ఇచ్చిన ఏ ఒక్క హామీనైనా జగన్ నెరవేర్చారా? మద్య నిషేదం, పోలవరం, సీపీఎస్ రద్దు, ప్రత్యేక హోదా హామీలు ఏమయ్యాయి? జగన్ చెప్పేదొకటి చేసేదొకటి.
సొంతబాబాయిని చంపి ఆ నేరాన్ని మాపై నెట్టారు. జగన్ రెడ్డి కుట్ర రాజకీయాలు ప్రజలకు అర్దమయ్యాయి. జగన్ సినిమా అయిపోయింది. దేశంలో నెం.1 పెత్తందారి జగనే. దేశంలో అత్యధిక ఆదాయం రూ. 517 కోట్లు ఆస్తులున్న సీఎం జగనే. దేశంలోని అన్నిముఖ్యమంత్రుల ఆదాయం కలిపినా అంతలేదు. పాపం ఆయన పేదోడు అంటా అడుక్కుని అన్నం తింటున్నాడు.
తన ఎమ్మెల్యేలను జగన్ మార్చటం కాదు, జగన్ నే మార్చాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఏపీ హేట్స్ జగన్ అని నినదిస్తున్నారు. ఎమ్మేల్యేలు తప్పులు చేయటానికి కారణం జగనే. దాడిశెట్టి రాజా అక్రమాల రాజా.. చెక్ పోస్టుల్లో వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈయన మామూళ్లకు వ్యాపారులు పరార్. గాంధీనగరంలో 132 ఎకరాలు, రౌతులపూడి మండలంలో 72 ఎకరాలు కబ్జా చేశాడు. తన అవినీతిని వెలికితీసిన ఆంధ్రజ్యోతి విలేకరిని పొట్టనపెట్టుకున్నాడు. సీఎంకి ఈయన కనపడలేదా? కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి గంజాయికి ద్వారం తెరిచాడు.
వైసీపీ నేతలు మెక్కిందంతా కక్కిస్తాం. బియ్యం మాఫియాకు కర్త, కర్మ,క్రియ ద్వారంపూడి. వీళ్ల జాతకాలంతా నావద్ద ఉన్నాయి. నేను ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కన్నెర్ర చేసివుంటే వీళ్ల పరిస్ధితి ఏంటి? ఎస్సీలను, బీసీ ఎమ్మెల్యేలను మార్చుతున్నారు. కానీ పెద్దిరెడ్డి, ద్వారంపూడిని ఎందుకు మార్చలేదు? తూ.గో జిల్లాలో మిధున్ రెడ్డి పెత్తనం ఏంటి, ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిల పెత్తనం ఏంటి? నేనెప్పుడూ యనమలను మార్చలేదు, ఆయన స్వచ్చందంగా తప్పుకుని యంగ్ స్టర్స్ కి అవకాశం ఇచ్చారు. మరో ఎమ్మెల్యే కన్నబాబు చేసిన అవినీతి అంతా ఇంతా కాదు. ఎమ్మెల్యేలను మార్చటం కాదు ప్రజలే జగన్ ని మార్చేందుకు సిద్దమయ్యారు. రాష్ట్రానికి విభజనతో జరిగిన నష్టం కంటే జగన్ పాలనతో జరిగిన నష్టమే ఎక్కువ. ఇన్నేళ్లుగా తెలుగు ప్రజలు నన్ను ఆదరించారు. గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సిన బాధ్యత నాపై ఉంది.
టీడీపీ అధికారంలోకి వచ్చాక తాండవ రిజర్వాయర్ ఆధునీకరిస్తాం. పురుషోత్తపట్నం పూర్తి చేసి ఏలేరు నుంచి పేజ్ 2 లో ఫిఠాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట, తునికి నీళ్లివ్వాలనుకున్నాం. ప్రాజెక్టు పూర్తి చేసి ఏలేరుకు నీళ్లు తీసుకొచ్చాం. ఈ దుర్మార్గుడొచ్చి దాన్ని నిర్వీర్యం చేశాడు. తూ.గో జిల్లాలో రెండు పంటలకు నీళ్లిచ్చాం, పోలవరం పూర్తి చేసి భవిష్యత్తులో 3 పంటలకు నీళ్లిస్తాం. వేముల వాడ, పెద్దాపురం ఎత్తిపోతల పధకాలు రిపేర్ చేస్తాం. పుష్కర ఎత్తిపోతల పధకం, టూరిజాన్ని అభివృద్ది చేస్తాం.
కాకినాడకు పూర్వవైభవం తెచ్చే బాధ్యత టీడీపీ జనసేనదే. వచ్చే ఎన్నికలు మన జీవితాలు, మన పిల్లల భవిష్యత్తుకు సంబందించినవి. జగన్ ని నమ్మి ఒక్క చాన్స్ ఇస్తే రాష్ట్రం పరిస్ధితి ఏమైందో చూడండి. మళ్లీ పొరపాటు చేయెద్దు. అందరి భవిష్యత్తు కోసం వైసీపిని ఇంటికి సాగనంపి రాష్ట్రానికి, తెలుగుజాతికి స్వర్ణయుగం తీసుకొద్దామని చంద్రబాబు నాయుడు ప్రజలను కోరారు. తమిళనాడులో జల్లికట్టు మాదిరి ఏపీలో కోడిపందాల నిర్వహణకు కేంద్రంతో మాట్లాడి ప్రత్యేక చట్టం తెచ్చేందుకు కృషి చేస్తానని చంద్రబాబు నాయుడు అన్నారు.