Suryaa.co.in

Andhra Pradesh

సీబీఐ దత్త పుత్రుడి మోసపు మాటలను ప్రజలు నమ్మడం లేదు

-పోలీసులు లేనిదే బయటకు రాలేని సీఎం ఉండటం మన దురదృష్టం
-పవన్ కళ్యాణ్ కౌలు రైతుల భరోసా యాత్ర వైసీపీలో వణుకు పుట్టిస్తోంది
-రాజమండ్రి మీడియా సమావేశంలో జనసేన పార్టీ రాష్ర్ట కార్యదర్శులు  గంటా స్వరూప,  ప్రియా సౌజన్య

గణపవరం సభలో అట్టర్ ప్లాప్ అయి తన కళ్ల ముందే జనం వెళ్లిపోతుంటే తట్టుకోలేక ముఖ్యమంత్రి జగన్ రెడ్డి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై అవాకులు చెవాకులు పేలుతున్నారని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా స్వరూప మండిపడ్డారు. సీబీఐ దత్త పుత్రుడయిన ముఖ్యమంత్రి మైక్ పట్టుకోగానే ఎక్కడ మళ్లీ మోసపూరిత హామీలు ఇస్తారో అన్న భయంతో జనం సభా వేదిక వద్ద నుంచి 10 నిమిషాల్లోనే పారిపోయారని, పోలీసులు అడ్డుకున్నా నిలబడలేదని విమర్శించారు. పోలీసులు పక్కన లేనిదే సీఎంకు ప్రజల్లో తిరిగే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. మంగళవారం ఉదయం రాజమండ్రిలో రాష్ట్ర కార్యదర్శి ప్రియా సౌజన్య, జిల్లా ప్రధాన కార్యదర్శి బోడపాటి రాజేశ్వరి, రాజమండ్రి నగర కార్యదర్శి ఇందిరా , జయలక్ష్మి తదితరులు మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా గంటా స్వరూప మాట్లాడుతూ… “రైతాంగంలో పవన్ కళ్యాణ్ కి పెరుగుతున్న ఆదరణ చూసి జైల్ రెడ్డి అభద్రతా భావానికి గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులకు కేంద్ర ప్రభుత్వం నిధులు కలుపుకుంటే రైతు భరోసా పథకం కింద ఒక్కొక్క రైతుకు రూ.19,500 ఇవ్వాలి. కానీ రైతులకు ఇస్తున్నది కేవలం రూ.13,500 మాత్రమే. మిగిలిన రూ. 6 వేలు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయో ప్రజలకు సమాధానం చెప్పాలి. నేర చరిత్ర కలిగిన మీలాంటి వాళ్ళని ఎన్నుకుంటే ఎన్ని అనర్ధాలు జరుగుతాయో ప్రజలకి కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నారు. జనాలు మిమ్మల్ని ఎందుకు ఇంతలా చీదరించుకుంటున్నారు? మీ పాలన లో లోపాలు ఎక్కడ ఉన్నాయో ఒక్క
సారి ఆత్మవిమర్శ చేసుకోండి.

అన్ని వర్గాలను మోసం చేశారు
మీ పార్టీ పేరులో ఉన్న ( వైసీపీ ) యువజన, శ్రామిక, రైతు ఇలా అన్ని వర్గాలను మోసం చేశారు. ప్రతి ఏడాది జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి యువతను మోసం చేశారు. సరైన ఉపాధి అవకాశాలు కల్పించలేక శ్రామికులను ముంచేశారు. ఇక రైతులనైతే సరే సరి. అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్న కౌలు రైతు కుటుంబాలను రూ. 7 లక్షలు నష్టపరిహారం ఇస్తామని హామీ ఇచ్చి దానిని తుంగలో తొక్కారు. మూడేళ్ల పాలనలో ఆత్మహత్యలకు పాల్పడ్డ దాదాపు 3 వేల మంది కౌలు రైతు కుటుంబాలకు పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం చేస్తుంటే ఆత్మవిమర్శ చేసుకొని సిగ్గుపడాల్సింది పోయి దిగజారుడు విమర్శలు చేస్తున్నారు. ఇంతవరకు పవన్ కళ్యాణ్ మూడు జిల్లాల్లో పర్యటించి 200 పైగా కుటుంబాలకు లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించారు. వీరిలో ఎవరైనా రైతు కాదని నిరూపించే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా? అని సవాల్ చేశారు. అవినీతి కేసుల్లో 16 నెలలు చిప్పకూడు తిన్న ఈ ఖైదీ నెంబర్ 6093… నిజాయితీపరుడైన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం చూస్తుంటే నవ్వొస్తోంది. ఆయన గురించి మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. లేనిపక్షంలో జనాగ్రహానికి గురై రేపు జరగబోవు సార్వత్రిక ఎన్నికల్లో మీకు, మీ పార్టీకి డిపాజిట్లు కూడా రావు” అని హెచ్చరించారు.

మన ముఖ్యమంత్రి వ్యక్తిత్వం అలాంటిది: ప్రియా సౌజన్య
సొంత బాబాయ్ కి గొడ్డలి పోటు… తల్లి, చెల్లికి వెన్నుపోటు పొడిచిన వ్యక్తిత్వం మన ముఖ్యమంత్రిదని రాష్ట్ర కార్యదర్శి ప్రియా సౌజన్య విమర్శించారు. రైతుల గురించి మాట్లాడేటప్పుడు సంవత్సరానికి ఎన్ని పంటలు పండిస్తారు? ఏ ఏ పంటల పండిస్తారో తెలుసుకొని ముఖ్యమంత్రి మాట్లాడాలని హితవు పలికారు. తుపాన్ సమయంలో రైతులు ఇక్కట్లు పడుతుంటే వారిని పరామర్శించకుండా పోలవరం డ్యామ్ పరిశీలనకు వెళ్లడం సిగ్గుచేటని అన్నారు. సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి, 25 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని మండిపడ్డారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కళ్లు తెరచి మిగిలి ఉన్న రెండేళ్ల పదవికాలంలో అయినా ప్రజలు మెచ్చే పాలన అందించాలని కోరారు.

LEAVE A RESPONSE