స్టేజ్ పై నుంచి పడి ఐబీ అధికారి మృతి!

హైదరాబాద్ మాదాపూర్ పరిధిలో ఉన్న శిల్పకళావేదికలో విషాద ఘటన చోటు చేసుకుంది. శిల్పకళావేదికలో ఉన్న స్టేజ్ పై నుంచి ప్రమాదవశాత్తు పడిపోయి ఇంటెలిజెన్స్ బ్యూరోలో డీఎస్పీగా పని చేస్తున్న కుమార్ అమ్మిరేష్ మృతి చెందారు. శిల్పకళావేదికలో దివంగత సినీ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా వచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించి నివేదిక ఇచ్చేందుకు అమ్మిరేష్ వచ్చారు.

ఈ సందర్భంగా ఆయన స్టేజ్ పై నిలుచుని ఫొటోలు తీస్తుండగా… పొరపాటున స్టేజ్ ముందు ఉన్న గుంతలో పడిపోయారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అమ్మిరేష్ ను మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రమాదంలో ఆయన తలకు తీవ్రమైన గాయం కావడంతో… చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఆయన స్వస్థలం బీహార్ రాజధాని పాట్నా. భార్య, ఇద్దరు పిల్లలతో కలసి ఆయన జూబ్లీహిల్స్ లోని ఐబీ క్వార్టర్స్ లో నివాసం ఉంటున్నారు. ఆయన మృతి పట్ల పోలీసు అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.