-మనలాగే ఇతర మీడియా సంస్థలు కూడా వల్గర్ గా బొమ్మలను చిత్రీకరించే పరిస్థితి తీసుకురావద్దు
-చెత్త పేపర్ల ద్వారా ప్రతిపక్ష పార్టీ లలో పనిచేస్తున్న మహిళలను అవమానించడం ద్వారా, మన పార్టీలో పని చేస్తున్న మహిళలకు ఆ దుస్థితి తీసుకురావద్దు-కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి మార్గదర్శిపై దాడులా?
-రానున్న లోక్ సభ ఎన్నికల్లో మా పార్టీ మూడు నుంచి నాలుగు స్థానాలు గెలిచే ఛాన్స్
-తిరుపతి కొండలపై భూమన వ్యాఖ్యలు హాస్యాస్పదం… హిందువుల మనోభావాలను గౌరవించే విధంగా చర్యలు తీసుకోండి
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు
మీడియా సంస్థలపై దాడిని ప్రజలు హర్షించరు. మీడియా సంస్థలపై పనిగట్టుకొని దాడి చేస్తే అందరూ ముఖాన కాండ్రించి ఉమ్మేస్తారు. పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత అయిన రామోజీరావు క్యారి కేచర్ ను సాక్షి దినపత్రికలో నగ్నంగా వేయడం దుర్మార్గం. ఇతర మీడియా సంస్థలు కూడా మన లాగే వల్గర్ గా క్యారి కేచర్ చిత్రించే పరిస్థితి తీసుకురావద్దు. చెత్త పేపర్ల ద్వారా ప్రతిపక్ష పార్టీలలో పని చేస్తున్న మహిళలను అవమానించడం ద్వారా, మన పార్టీలో పని చేస్తున్న మహిళలకు ఆ దుస్థితి తీసుకురావద్దని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి హితవు పలికారు.
గురువారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… మన పార్టీలో పని చేసే మహిళలు మాత్రమే సంసారులవుతారా?, ప్రతిపక్ష పార్టీలకు ఓట్లు వేసే మహిళలు, ఆ పార్టీలలో పని చేసే మహిళా నాయకురాళ్లందరికీ పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగానే కనిపించినట్లుగా రంకును అంటగట్టేస్తారా? అని ప్రశ్నించారు. అదే మీ కుటుంబాలకు అంటగట్టి ఫేక్ న్యూస్ రాసిన వారిని ఐదు నిమిషాల వ్యవధిలో పట్టుకుంటారు. మరి ప్రతిపక్ష పార్టీల నాయకురాళ్లపై, వారికి ఓటేసిన మహిళలపై తప్పుడు వార్తలను రాసి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన వారిని సీతారామాంజనేయులు పట్టించుకోరా? అని ఆయన నిలదీశారు.
ప్రతిపక్ష పార్టీ నాయకురాళ్ల గురించి అసభ్యంగా వార్తలు రాసిన వారిని పట్టుకొని ప్రజల ముందు నిలబెట్టాలని, లేకపోతే సామూహికంగా మహిళలు మన పార్టీకి దూరమయ్యే పరిస్థితి నెలకొంటుందని రఘురామకృష్ణం రాజు హెచ్చరించారు. ఇటువంటి పనికిమాలిన చర్యలు మానకపోతే, మన పార్టీ తీవ్రంగా నష్టపోతుందన్నారు. బరితెగించిన బ్యాచ్ ఇటువంటి దాడులు చేస్తూనే ఉంటుందన్న ఆయన, ఈ తరహా దాడులను ప్రజలంతా ముక్తకంఠంతో ఖండించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు అనిత తో పాటు పలువురు మహిళా నాయకురాళ్ల ఫోటోలను వేసి ఫేక్ ఆంధ్ర పేరుతో సోషల్ మీడియాలో వదిలారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోకపోగా, పోలీసులు కేసులు కూడా నమోదు చేయలేదంటే… ఇది ఎవరి పనో ఇట్టే అర్థమవుతూనే ఉందని అన్నారు.
నిజాలు నిర్భయంగా చెప్పడానికి వ్యాపారాన్ని కూడా పణంగా పెట్టిన రామోజీరావు
నిజాలను నిర్భయంగా చెప్పడానికి, ఈ ప్రభుత్వ అవినీతి అక్రమాలను ఎండగట్టడానికి తన వ్యాపారాలను కూడా రామోజీరావు పణంగా పెట్టి పోరాడుతున్నారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. రామోజీరావు వ్యాపార సంస్థలపై ప్రభుత్వం చేస్తున్న దాడులను ప్రజలంతా ఖండించాలని ఆయన కోరారు. ప్రజల పక్షాన ప్రభుత్వంపై ఈనాడు దినపత్రిక ద్వారా పోరాడుతున్న రామోజీరావుకు సంపూర్ణ సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. మార్గదర్శి సంస్థపై ఒక్క ఫిర్యాదు కూడా లేకపోయినప్పటికీ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పదేపదే దాడులు చేస్తోంది.
ప్రభుత్వం నమోదు చేసిన కేసులపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హై కోర్టు లు స్టే విధించాయి. అయినా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తన దాడులను ఆపడం మానలేదు. మార్గదర్శి రోజు వారి కార్యకలాపాలను అడ్డుకునేందుకు ప్రయత్నించగా, ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు వచ్చి అబద్ధాలు ఆడారు. తాము మార్గదర్శి రోజు వారి కార్యకలాపాలను అడ్డుకోలేదని పేర్కొన్నారు.
మార్గదర్శి రోజు వారి కార్యకలాపాలకు ఎటువంటి అడ్డంకులు కలిగించరాదని ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు తన ఉత్తర్వులలో ప్రభుత్వం తరఫున ప్రాతినిధ్యం వహించిన హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ తో పాటు ఇతరులను ఆదేశించింది.. అయినా, గుంటూరు పట్టణంలోని అరండల్ పేట మార్గదర్శి బ్రాంచ్ లో షెట్టర్ల ను మూసివేసి, సీసీ కెమెరాలను తొలగించిన దృశ్యాలు వెలుగు చూశాయి. మార్గదర్శి సంస్థలపై దాడి కోసం రెండు మానిటరింగ్ గ్రూపులతో పాటు, 37 సబ్ గ్రూపులను ఏర్పాటుచేసి, తాడేపల్లి ప్యాలెస్ సమీపంలోని సిఎస్ఆర్ కళ్యాణ మండపంలో వారికి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి, దిశా నిర్దేశం చేశారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని రంగంలోకి దింపి, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మార్గదర్శి బ్రాంచ్ లలో అగ్నిమాపక శాఖ అనుమతులు పరిశీలించడం, విద్యుత్ బకాయిలు, జీఎస్టీ చెల్లింపులు, ఇంటి పన్నులు, భవన నిర్మాణ అనుమతులలో ఉల్లంఘనలను గుర్తించాలని దిశా నిర్దేశాన్ని చేశారు.
కోర్టు స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కూడా మార్గదర్శి సంస్థను జమోరె ప్రభుత్వం వేధిస్తోంది. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖను రంగంలోకి దించి ఏజెంట్లను ఏదో రకంగా భయపెట్టి కేసులు నమోదు చేయాలని చూస్తోంది. మార్గదర్శి సంస్థ ఏ చిన్న పొరపాటు చేసినా దాన్ని సాకుగా తీసుకొని సిఐడి పోలీసులు, సమీప పోలీస్ స్టేషన్లో కేసు నమోదుకు రంగం సిద్ధం చేశారు. సి ఎస్ ఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించిన సమావేశానికి హాజరైన సిబ్బందిని మొబైల్ ఫోన్లు వెంట తీసుకురావద్దని ఆదేశించారట.
అయినా, ప్రభుత్వ కుట్ర బయటకు వచ్చింది. ఈ ప్రభుత్వం మరో ఎనిమిది నెలల్లో కూలిపోతుందని భావించిన వారు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కుట్రలను బయటపెట్టారు. ప్రభుత్వ దాడులపై మార్గదర్శి సంస్థ తక్షణమే కోర్టు ధిక్కరణ కింద న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని రఘురామకృష్ణం రాజు సూచించారు. ఇది మార్గదర్శి సంస్థ పై జరుగుతున్న దాడి కాదు. ఈనాడు దినపత్రిక లక్ష్యంగా జరుగుతున్న దాడి.
నిజాలను నిర్భయంగా రాస్తూ, ప్రభుత్వ అవినీతి అక్రమాలను ఎండగడుతున్న ఈనాడు పత్రిక అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి గిట్టడం లేదు . ప్రజా ప్రయోజనాలను కాపాడడానికి ఈనాడు దినపత్రిక నిజాలను రాస్తూ, ప్రభుత్వ అవినీతి అక్రమాలను వైఫల్యాలను ప్రజల ముందు చర్చకు పెడుతోంది. అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రుచించడం లేదు. నిజాలను రాసే జర్నలిస్టులను బెదిరించడం, మీడియా సంస్థలపై దాడి చేయడం, హింస ద్వారా ఏదైనా సాధించవచ్చునని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది.
పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత అయిన రామోజీరావు క్యారికేచర్ ను నగ్నంగా వేయడం సిగ్గుచేటు. ఇదేనా సాక్షి దినపత్రిక పాటించే జర్నలిజం విలువలని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. ఈనాడు దినపత్రికలో కూడా జగన్మోహన్ రెడ్డి నగ్న క్యారి కేచర్ ను ప్రచురిస్తే, ఆయన భరించగలరా?, జగన్మోహన్ రెడ్డే కాదు… మేము కూడా భరించలేము. చెత్త రాతలు, పిచ్చి బొమ్మలు వేయడం అవసరమా? అని రఘురామకృష్ణంరాజు నిలదీశారు.
క్షేత్రస్థాయి వాస్తవాలకు భిన్నంగా సర్వే నివేదిక
రాష్ట్రంలో క్షేత్రస్థాయి వాస్తవాలకు భిన్నంగా ఒక ఆంగ్ల దినపత్రిక సర్వే ఫలితాలను వెల్లడించింది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో 25 స్థానాలకు గాను, 24 స్థానాలను ప్రస్తుతం నా పార్టీ గెలుస్తుందని తన సర్వే లో పేర్కొంది. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మూడు నుంచి నాలుగు స్థానాలకు మించి గెలిచే అవకాశం లేదు. సదరు ఆంగ్ల దినపత్రికకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎనిమిదిన్నర కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్ రెవిన్యూ ఇస్తున్నందుకే, ఇటువంటి తప్పుడు సర్వేలను ప్రకటిస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది . ఈ సర్వేల ఆధారంగా కేంద్రంలోని బిజెపి పార్టీని, రాష్ట్రంలో ఇతర పార్టీలతో పొత్తు కుదుర్చుకోకుండా చూడాలని ఎత్తుగడ వేస్తున్నారు.. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లి సామాన్యుడిని ప్రశ్నించిన మా ప్రభుత్వాన్ని అమ్మనా బూతులు తిడుతున్నారని, వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే, దానికి భిన్నంగా సర్వే ఫలితాలు వెల్లడించడం ఆశ్చర్యకరంగా ఉందని రఘురామకృష్ణం రాజు అన్నారు .
తిరుపతి కొండలను బోడి గుండులని అవమానించడం సబబేనా ?!
తిరుపతి కొండలను బోడి గుండులని టిటిడి చైర్మన్ గా నియమితుడైన భూమన కరుణాకర్ రెడ్డి అవమానించడం సబబేనా ? అని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. కరుణాకర్ రెడ్డి వర్ణన జుగుస్సాకరంగా ఉందన్నారు. తన వ్యాఖ్యల ద్వారా భగవంతుడిపై ఆయనకున్న భక్తి తెలియజేస్తుందన్నారు. ఎంతో విద్యావంతుడైన కరుణాకర్ రెడ్డి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ద్వారా, తాను కూడా తాడేపల్లి ప్యాలెస్ బానిసనని చెప్పకనే చెప్పాలనిపిస్తుంది . తిరుపతి కొండను దర్శించుకున్న వారి ఫోటోలు నూట నలభై సంవత్సరాల కిందటే ఉన్నాయి. కానీ, భూమన కరుణాకర్ రెడ్డి మాత్రం దానికి భిన్నంగా 1954 నుంచే ఫోటోగ్రాఫ్ లు అందుబాటులోకి వచ్చాయని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది.
తిరుమల కొండలపై చిరుత పులులు అన్నవే లేవని, కొండలపై చెట్లన్నవే లేవని, శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్టు కూడా తామే నాటామని ఆయన అంటారేమోనంటూ ఎద్దేవా చేశారు. శేషాచలం అడవుల విధ్వంసం వల్లే అడవుల్లోని వన్య మృగాలు తమ దారిని మార్చాయి. వన్య మృగాలను వేటాడి తినే క్రూర మృగాలు కూడా వాటిని అనుసరిస్తున్నాయి. చిరుతపులులను కొట్టడానికి చిరుత పులుల నుంచి సంరక్షణ పథకంలో భాగంగా కర్ర ఇస్తున్నట్లుగా చెబుతున్నారు. తిరుమలలో మూడు చిరుతపులులను ఇప్పటికే పట్టుకున్నట్లుగా చెబుతున్నారు.
తిరుపతిలో భూముల విలువ పెరగడం వల్ల, చిరుతలు, ఉడుతలు పెట్టడానికి జూ స్థలాన్ని అటవీ ప్రాంతంలోనే కేటాయించాలని కేంద్రాన్ని కోరుతారేమో. ప్రస్తుతమున్న అయిదారు వేల ఎకరాల స్థలాన్ని కొట్టేస్తారన్న భావనలో ప్రజలు ఉన్నారు. ప్రజలన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. చిరుతల నుంచి సంరక్షణ కోసం కర్రలు ఇవ్వడం కాదు, గాలిగోపురం నుంచి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ప్రస్తుతం ఉన్న రోడ్డు మార్గం పైనుంచి వాక్ వే నిర్మించండి. నేను చెప్పాను కాబట్టి ముఖ్యమంత్రి ఆయన కాపలాదారుడికి నచ్చకపోవచ్చు. దీనికంటే బెటర్ సొల్యూషన్ ఉంటే సరే… లేకపోతే వాక్ వే నిర్మించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. భక్తుడికి భగవంతున్ని ఎలా దూరం చేసే ప్రయత్నాలను మానండి.
నడక దారిలో గతంలో 40,000 మంది ప్రస్తుతం ఆ సంఖ్య 20వేలకు చేరుకున్నట్టు తెలిసింది. కాలినడకన వస్తామని భక్తులు మొక్కుకుంటే, నడిచి వెళ్లకపోతే మొక్కు తీరనట్టే. మా మనోభావాలను దెబ్బతీయవద్దు. మీ దేవుడు పాపులను రక్షించవచ్చు కానీ మా దేవుడు పాపులను శిక్షిస్తాడనేది నమ్మకం. మీ నమ్మకాన్ని మేము కాదనం. మా నమ్మకాన్ని మీరు కాదన వద్దు. అయినా నడక దారిలో మిట్ట మధ్యాహ్నం నడిచి వెళ్ళమనడం ఎంతవరకు సమంజసం. నడక దారిని రెండు గంటలకే మూసి వేస్తానని పేర్కొనడం సహేతుకం కాదు.
తిరుమల దర్శనానికి వచ్చిన అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం తాను అన్య మతస్థుడినైనా తనకు ఈ భగవంతుడిపై నమ్మకం ఉందని అంగీకరిస్తూ సంతకాన్ని చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా తన కన్సెంట్ ఇచ్చి, దేవాలయ సాంప్రదాయాలను పాటించారు.
దేవాలయానికి కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. ఆఫ్ట్రాల్ ముఖ్యమంత్రి పోస్టులో ఉండి, దేవాలయ సాంప్రదాయాలను ధిక్కరించడం కరెక్టు కాదు. తిరుపతి దేవాలయంలో కన్సెంట్ ఇస్తే నీకు ఓట్లు వేసే ఒక వర్గం సింహభాగం ఓట్లు పోతాయని భయం నీకుంది. అందుకే నువ్వు కన్సెంట్ ఇవ్వడం లేదని జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి రఘురామకృష్ణంరాజు ఫైర్ అయ్యారు. ఇటీవల కొండపై అపచారాలు పెరిగాయి. మాంసం, మద్యం సేవించడం, గంజాయి కూడా వినియోగిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
విజిలెన్స్ విభాగం తనిఖీలు తగ్గడం వల్లే ఈ దరిద్రం చోటు చేసుకుంటుంది. ఇటువంటి అపచారాలు జరిగినప్పుడే అపశృతులు దొర్లుతాయని పెద్దలు చెబుతున్నారు. హిందూ ధర్మాన్ని కాపాడకపోయినా, నాశనం మాత్రం చేయకండి. ఆగమపండితులతో సంప్రదించి ఇటువంటి అపశృతులు దొర్లకుండా చేయాల్సిన కార్యక్రమాలను చేపట్టాలని రఘురామకృష్ణం రాజు కోరారు.