Suryaa.co.in

Andhra Pradesh

పరివాహక ప్రాంతాల్లో కట్టడాలపై ప్రజల్లో చైతన్యం రావాలి

– సుద్ధగడ్డ వాగు సమస్యకు పూర్తి స్థాయి పరిష్కారం చూపుతా
– చంద్రబాబు నాయుడు రాత్రింబవళ్లు పని చేస్తున్నారు

పిఠాపురం: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం మధ్యాహ్నం నుంచి కాకినాడ జిల్లాలోని ఏలేరు రిజర్వాయర్ వరద ప్రాంతాల్లో పర్యటించారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులోని జగనన్న కాలనీ లో పర్యటించారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మీడియాతో ఏమన్నారంటే.. ఏలేరు రిజర్వాయర్ పరిస్థితిపై ఎప్పటికప్పుడు కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ సగిలితో మాట్లాడుతూనే ఉన్నాను. ముంపు ప్రభావిత ప్రాంతాలలో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశాను.

సుద్ధగడ్డ వాగు సమస్యకు ఇక్కడి ఎమ్మెల్యేగా పూర్తి స్థాయి పరిష్కారం చూపుతాను. గత ప్రభుత్వం జగనన్న కాలనీలు పేరుతో చేసిన తప్పులకు ప్రజలు నష్టపోయారు. ఆ తప్పులను కూటమి ప్రభుత్వంలో మేము సరి చేయాల్సిన అవసరం ఏర్పడింది. గొల్లప్రోలులోని జగనన్న కాలనీ స్థలాన్ని లోతట్టు ప్రాంతంలో కొనేశారు. రూ. 30 లక్షల ఎకరా భూమి మార్కెట్ ధరను రూ. 60 లక్షలు చెల్లించి కొన్నారు.

ఏలేరు రిజర్వాయర్ వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షించి తగు సూచనలు ఇస్తున్నాం. ప్రజల బాధలు వెతలు స్వయంగా పరిశీలించేందుకే ఈ రోజు ఆరోగ్యం సరిగా లేకపోయినా క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చాను. గత ప్రభుత్వంలో పంచాయతీలు పూర్తిగా నిర్వీర్యం అయ్యే పరిస్థితి వచ్చింది. కష్టాల్లో ఉన్న పంచాయతీలను ఆదుకోవడం బాధ్యతగా తీసుకున్నాను.

బుడమేరుకు సంబంధించిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా వంటి వ్యవస్థ కంటే ముందుగా ఆక్రమణలు చేసిన వారితో మాట్లాడాలి. బుడమేరు ఆక్రమణలు చాలా మంది తెలిసో తెలియకో చేసిన వారు ఉన్నారు. ఆక్రమణ స్థలం అని తెలియక కొన్నవారు కూడా ఉన్నారు. ముందుగా ఆక్రమణలు గుర్తించి అందరితో కలిసి కూర్చుని మాట్లాడి చర్యలు తీసుకుంటే మంచిది అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం.

నదీ పరివాహక ప్రాంతాలు వాగు పరివాహక ప్రాంతాల్లో కట్టడాలపై ప్రజల్లో చైతన్యం రావాలి. అనుకోకుండా వచ్చిన భారీ వర్షాలతోనే ఈ పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రమంతటా ఈ వర్షాలున్నాయి. వరద విపత్తు నుంచి కోలుకోవడానికి విజయవాడకు కాస్త సమయం పట్టొచ్చు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలలో కూడా వరదలు విపత్తులు వచ్చిన వేళ కోలుకోవడానికి సమయం పడుతుంది.

వరద బాధితులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాత్రింబవళ్లు పని చేస్తున్నారు. అధికారులను దగ్గరుండి అప్రమత్తం చేసి అలాగే వరద బాధితులకు సహాయం చేయడంలో ప్రభుత్వం చొరవ చూపింది.

LEAVE A RESPONSE