Suryaa.co.in

Telangana

హరీష్‌రావుపై ఫోన్‌ట్యాపింగ్ కేసు

– తన ఫోన్ ట్యాప్ చేయించారని కాంగ్రెస్ నేత చక్రధర్‌గౌడ్ ఫిర్యాదు
– పరిశీలించి కేసు నమోదు చేసిన పంజగుట్ట పోలీసులు

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో కుదుపు. బీఆర్‌ఎస్‌లో ట్రబుల్ షూటర్‌గా పేరున్న మాజీ మంత్రి హరీష్‌రావు ట్రబుల్‌లో పడ్డారు. ఫోన్‌ట్యాపింగ్ కేసులో తాజాగా ఆయనపై కేసు నమోదయింది. ఆయన సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత చక్రధర్‌గౌడ్ కొద్దిరోజుల క్రితం హరీష్‌రావుపై చేసిన ఫిర్యాదు ఆధారంగా తాజాగా పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.

తన ఫోన్‌ను ట్యాపింగ్ చేశారని పంజాగుట్ట పోలీసులకు చక్రధర్ ఫిర్యాదు చేశారు. దీంతో హరీష్ రావుతో పాటు టాస్క్ ఫోర్స్‌లో పనిచేసిన రాధాకిషన్ రావుపై కేసు నమోదు చేశారు. సెక్షన్ 120 (బీ), 386,409,506 , రెడ్ విత్ 34, ఐటీ యాక్ట్ సెక్షన్ల కింద కేసు నమోదైంది.

గతంలో హరీష్ రావుపై ఫోన్ ట్యాపింగ్‌ కేసులో డీజీపీకి, జూబ్లీహిల్స్ ఏసీపీకి చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ అయినట్లు అలర్ట్ మెసేజ్ వచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. చక్రధర్ గౌడ్ ఫిర్యాదుపై గతంలో రెండుసార్లు పోలీసులు విచారణ చేశారు.

హరీష్ రావు తన ఫోన్ ట్యాప్ చేయించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోసారి విచారణకు రావాలని పోలీసులు ఆదేశించడంతో జూబ్లీహిల్స్ ఏసీపీ ముందు చక్రధర్ గౌడ్ విచారణకు హాజరయ్యారు. ఆయన వద్ద ఉన్న ఆధారాలను పోలీసులు పరిశీలించి విచారణ చేశారు.

ఈ సందర్భంగా చక్రధర్ గౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో తన ఫోన్ ట్యాపింగ్ అయిందని, తన ఫోన్ ట్యాపింగ్ అయినట్లు ఆపిల్ కంపెనీ ద్వారా తనకు అలర్ట్ మెసేజ్ వచ్చిందని, దీనిపై గతంలో డీజీపీకి ఫిర్యాదు చేశానని తెలిపారు. గంటన్నర పాటు పోలీసులు విచారణ జరిపి.. స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారని తెలిపారు.

అప్పటి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధా కిషన్ రావు బీఆర్ఎస్ పార్టీలో చేరి హరీష్ రావుకు సరెండర్ అవ్వాలని, లేకపోతే అక్రమ కేసులు పెడతామని బెదిరింపులకు దిగారని.. తన వ్యక్తిగత ఫోన్‌తో పాటు తన భార్య, డ్రైవర్, తమ కుటుంబ సభ్యుల ఫోన్లు అన్ని ట్యాపింగ్ చేశారని పేర్కొన్నారు.

పోలీసులు అడిగిన ప్రశ్నలకు తాను సమాధానం ఇచ్చానని, తాము చెప్పినట్లు వినకపోతే తన కుటుంబాన్ని అంతం చేస్తామంటూ అప్పటి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధా కిషన్ రావు బెదిరింపులకు దిగారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్‌పై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసి పోరాటం చేస్తున్నానని, న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేసి పోరాటం చేస్తానని చక్రధర్ గౌడ్ పేర్కొన్నారు.

LEAVE A RESPONSE