( మార్తి సుబ్రహ్మణ్యం)
ఆంధ్రా-తెలంగాణలో వరదల టెన్షన్.. చీకోటి క్యాసినో ఈడీ టెన్షన్.. అప్పుల టెన్షన్.. ఆంధ్రాలో రోడ్లు, స్కూళ్ల విలీనాలు, మందుషాపుల టెన్షన్. వీటిని టీవీలు, పత్రికల్లో చూసి బోరెత్తిపోతున్న తెలుగు ప్రజలకు.. వాటి నుంచి రిలీఫ్ ఇచ్చేందుకు.. అంటే క్రైస్తవ పరిభాషలో చెప్పాలంటే స్వస్థత చేకూర్చేందుకు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కిలారి ఆనందపాల్ చేస్తున్న ప్రయత్నాలు ప్రజలను మెప్పిస్తున్నాయి. పాలన్నియ్య చేస్తున్న ప్రకటనలతో, బోలెడు కష్టాల్లో ఉన్న వరద బాధితులు కూడా రిలీఫ్ అవుతున్నారట. కాబట్టి ప్రజల కష్టాలు తీర్చలేని ప్రభుత్వాల కంటే, వారి కష్టాలను తన మాటలతో మర్చిపోయేలా చేసి, మనసారా నవ్విస్తున్న కేఏ పాల్ గొప్పవాడే కదా?!
ఈ రాజకీయ వ్యవస్థపై పాలన్నియ్యకు మహా చెడ్డ కోపమొచ్చింది. ఏవీ తానకున్నట్లు జరగడం లేదట. తాను ప్రపంచ దేశాల నుంచి లక్షల కోట్లు తీసుకువస్తానని మోదీ నుంచి జగన్- కేసీఆర్‌కు చెప్పినా ఎవరూ లెక్కచేయడం లేదట. లెక్కచేయకపోగా.. పట్టించుకోకపోవడమే పాలన్నియ్యకు చెడ్డ చిరాకేస్తోంది. అసలు జగన్-కేసీఆర్ లాంటివాళ్లయితే తనను కలిసేందుకే గజగజ భయపడిపోతున్నారట. పోనీ జగన్‌కు తనను బహిరంగంగా కలిసేందుకు అంత భయమయితే, తానే సీట్రెట్గా కలుస్తానని ఆఫర్ ఇచ్చినా జగనన్న తూనా బొడ్డు అంటున్నారట. చంద్రబాబునాయుడు తనను రహస్యంగా కలుద్దామని ఆఫర్ ఇచ్చినా, బాబును కలిసేదిలేదు పొమ్మంటున్నారు. తన ఫ్రెండయిన ‘పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడి’కి.. అప్పులు చేయకురా బాబూ అని ‘ముప్పియారుసార్లు’ చెప్పినా అతగాడు వినలేదట. ఇప్పుడు ఏపీ కూడా మరో శ్రీలంక అవుతుందని చెబుతున్నారు.
లేటెస్టుగా పాలన్నియ్య తానే కాబోయే ప్రధానమంత్రినని కొత్త బాంబు పేల్చారు. మోదీకి దేశాన్ని పాలించడం చేతకావడం లేదని డిసైడ్ చేసేశారు. సోనియాతో కూడా దేశాన్ని నడిపించడం కుదరదన్నారు. కాబట్టి, ఇక ప్రభువు ఆదేశాల మేరకు తానే ప్రధాని కాబోతున్నానని ప్రకటించారు. ఒక్క ప్రధానమంత్రయితే, తెలంగాణ ప్రజలను చూసుకోవడం ఇబ్బందవుతుందని ఆలస్యంగా గ్రహించి.. తెలంగాణకు తానే సీఎం కాబోతున్నానని మరో బాంబు పేల్చారు. కేసీఆర్ కుటుంబపాలనలో తెలంగాణ అప్పుల పాలయిందని, కేసీఆర్‌కు అహంకారం పెరిగి కళ్లు నెత్తికెక్కాయని కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇంకో రహస్యం కూడా పాలన్నియ్య బయట పెట్టారు. 30 లక్షల మందికి పైగా ఓటర్లు తనకు ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నారట.
అలాగే ఆంధ్రాలో పవన్ తమ్ముడు తనతో చేతులు కలిపితే, ఆయనను ఏపీ సీఎంగా చేస్తానని మాటిచ్చారు. పాలన్నియ్య ఒకసారి మాటిచ్చారంటే దాన్ని పాటిస్తారంతే. రోజూ ప్రభువుతో హాట్లైన్లో మాట్లాడేంత పవరున్న పాలిన్నియ్య చల్లని చూపు పవనన్నయ్యపై పడిందంటే, ఇక ఆయన జన్మ ధన్యమే కదా?! చంద్రబాబు నాయుడు వయసయిపోయింది. కాబట్టి ఆయన సీఎం కాలేడు.
జగన్ ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు. ఇంకొకరు చెప్పినా వినడు. కాబట్టి తనతో పవన్ తమ్ముడు చేతులు కలిపితే, ఆయన ఏపీ సీఎం కావచ్చన్నది పాలన్నియ్య సలహా. మొత్తానికి దేశ ప్రయోజనాల కోసం ప్రధానమంత్రి పదవి- తెలంగాణ ప్రజల క్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర సీఎం పదవులను జమిలిగా చేపట్టాలని పాలన్నియ్య తీర్మానించుకున్నారు. పాలన్నియ్య ఏమీ ఉత్తిగా మాట్లాడరు. ప్రభువే ఆయనతో అలా మాట్లాడిస్తుంటాడు.
అయితే ఇవన్నీ పాలన్నియ్య సీరియస్‌గా చేస్తున్న వ్యాఖ్యలే సుమా!
కానీ రాజకీయాలు తెలియని నేతలు, ఏమాత్రం ‘గ్నానం’ లేని ‘అగ్నాన’ జనం మాత్రం.. పాలన్నియ్యను సీరియస్‌గా తీసుకోవడం లేదు. కానీ యూట్యూబ్‌లో మాత్రం పాలన్నియ్య స్పీచులను తెగచూసేసి ఎంజాయ్ చేసేస్తున్నారు. బహుశా అలాంటి ‘యూట్యూబ్ చూపరులంతా’ తన ఓటర్లేనన్నది పాలన్నియ్య
భావన కామోసు. టీవీ చానెళ్ల వాళ్లు ‘మిమ్మల్ని జనం జోకర్‌గా చూస్తున్నారన్న విషయం మీకు తెలుసా’ అని అడిగితే.. ‘ఏంటి మీకు ఈ మధ్య ఏమైంద’ని పాలన్నియ్య మీడియాకు ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. నా కోసం అవతల ప్రపంచదేశాల అధ్యక్షులు కళ్లలో వత్తులు వేసుకుని ఎదురుచూస్తుంటే, మీరేంటి నన్ను జోకరంటున్నారని, పాలన్నియ్య వారిపై సీరియస్ అవుతున్నారు.
నిజమే. ఒక దేశానికి కమ్ రాష్ర్టానికి, ప్రధాని కమ్ సీఎం కాబోతున్న కిలారి ఆనందపాలన్నియ్యకు ముందస్తు శుభాకాంక్షలు. ఎలాగూ పాలన్నియ్య ప్రధాని కమ్ సీఎం అయితే, లక్షల కోట్లు వచ్చి పడతాయి కాబట్టి.. ఈలోగా రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని దాచిపెట్టేందుకు బంకర్లను తవ్వుకుంటే మంచిది. మళ్లీ రేపు ఒక్కసారిగా వచ్చే పడే డబ్బులను దాచుకోవాలన్నా ఇబ్బందేకదా మరి? ఏదైతేనేం.. మొన్న మన్మోహన్, నేడు మోదీ వల్ల కాని లక్షలకోట్ల విదేశీ సాయం, పాలన్నియ్య వల్ల అయితే ఈ దేశానికి అంతకంటే కావలసింది ఇంకేముంటుంది?