– రాజ్య సభలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తొమార్ ఒప్పుకోలు
2016 లో మొదలైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రైతుల కన్నా.. బీమా కంపెనీలకే ప్రయోజనకరంగా మారింది. గత ఐదేండ్లలో రైతులు, ప్రభుత్వాలు కలిసి.. ప్రీమియం రూపంలో 1,26,521 కోట్ల రూపాయలను బీమా కంపెనీలకు చెల్లిస్తే …రైతులకు అందిన పరిహారం కేవలం 87,320 కోట్లు మాత్రమే. అంటే బీమా కంపెనీలకు మిగిలింది 39, 201 కోట్ల రూపాయలు.
అంటే రైతులు చెల్లించిన మొత్తంలో కేవలం 69 శాతాన్ని పరిహారంగా చెల్లించి, కుంటి సాకులతో వేల దరఖాస్తులను రిజెక్టు చేసి…మిగిలిన 31 శాతం నిధులను బీమా కంపెనీలు మిగిల్చుకున్నాయి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తొమార్ పార్లమెంట్ కు సమర్పించిన సమాచారం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది.
అందుకే ఫసల్ బీమా యోజనను బీమా కంపెనీలకు కాకుండా రైతులకు లాభం జరిగేలా మార్చాలంటున్నాయి రైతు సంఘాలు. అయినా కేంద్రం మాత్రం రైతులు, రాష్ట్ర ప్రభుత్వాల నెత్తి మీద ఫసల్ బీమాను వదిలి పెట్టి తన భారాన్ని తగ్గించుకుంది.