శ్రీ మహాలక్ష్మీ ఆలయం..ముంబై

ముంబై లోని ఈ ఆలయంలో ముగురమ్మలూ కొలువై ఉన్న పవిత్ర క్షేత్రం.సముద్రతీరంలో మహాలక్ష్మి వెలసివున్న ఆ ప్రాంతాన్ని కూడా ‘మహాలక్ష్మి’ పేరిటనే వ్యవహరించటం విశేషం.
లక్ష్మీదేవి ఆలయమైనా, అక్కడ దేవి, కుడివైపున శ్రీమహాకాళి, ఎడమవైపున శ్రీమహా సరస్వతి కనిపిస్తారు.
ఆ విధంగా మూడు రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్న ఆ చల్లని తల్లి కొలువైవున్న మహాలక్ష్మి ఆలయ విశేషాలు.
పురాతన దేవాలయాల్లో ముంబయి లోని మహాలక్ష్మి దేవాలయం ఒకటి.
ఈ దేవాలయం ముంబయి నగరంలో బ్రీ చ్ క్యాండీలోని బి.దేశా య్ రోడ్‌లో నెలకొని ఉంది. అరేబియా సముద్రపు ఒడ్డున కొలువైవున్న మహాలక్ష్మి మాతను సందర్శించి ఆమె దీవెనలు పొందేందుకు లక్షలమంది భక్తులు వస్తుంటారు. అష్టైశ్వర్యాలను ఒసగే మహాతల్లిగా హిందువులు మహా లక్ష్మిని కొలుస్తారు.
ఈ దేవాలయాన్ని ఒకసారి పరికించి చూస్తే… ఆలయ ప్రధాన ద్వారం అద్భుతంగా తాపడం చేయబడి వుంటుంది.
లక్ష్మీమాతకు పూజలు చేసేందుకు పూలు, ఇతర పూజ సామగ్రి ఆలయ ప్రాంగ ణంలోని షాపులలో లభ్యమవుతాయి.
స్వర్ణాభరణాలతో సంపదల తల్లిగా గోచరించే ఇక్కడి మహాలక్ష్మి రూపు హిందూ గృహాల్లో కనబడుతుంటుంది.
సిరిసంపదలనొసగే ముంబయి మహాలక్ష్మికి భక్తకోటి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు.
దేవాలయం చరిత్ర గురించి చూసినప్పుడు… ఆలయానికి ప్రత్యేకమైన చరిత్ర వుంది.

ఆలయ చరిత్ర
నాలుగు దశాబ్దాల క్రితం విదేశీయుల ఆక్రమణలకు వెరచిన స్థానికులు తమ దేవతలను కాపాడుకోగలిగిన వారు కాపాడుకున్నారు. కుదరనివారు, ఆయా దేవతలను సగౌరవంగా సముద్రం పాలు చేశారు.అలా సమద్రగర్భం లోకి చేరిన కొన్ని విగ్రహాలు కాలాంతరాన కొట్టుకువచ్చి, మళ్లీ జనం చేత పూజలందున్న గాథలూ వున్నాయి. సరిగ్గా అలాంటి చరిత్ర గల ఆలయాల్లో ఒకటి శ్రీమహాలక్ష్మి ఆలయం.
1775 ప్రాంతాల్లో ముంబయి ప్రాంతంలోని ఏడు ద్వీపాలనూ బ్రిటిష్‌వారు పోర్చుగీసువారికి అప్పజెప్ప వలసివచ్చింది. సప్తద్వీపనగరంగా బొంబాయిని ఏకంగా తీర్చాలని లార్డ్ హాననీ అనే బ్రిటిష్ అధికారి ప్రయత్నిం చాడు. ఎంత శ్రమించినా, సముద్రతరంగాల ధాటికి ఆగలేక పనులన్నీ పాడయ్యేవిట.
అందరికీ ఆశ్చర్యమూ, ఆందోళనా కలుగుతున్న తరుణంలో, కాంట్రాక్టర్ రామ్‌జీ శివాజీప్రభుకు, స్వప్నంలో శ్రీదేవి దర్శనమిచ్చి, తన విగ్రహం సముద్రంలో నిక్షిప్తమై వుందనీ, దాన్ని ముందు జలంలోంచి బయటికి తీస్తే పనులు నిరాటంకంగా సాగుతాయనీ చెప్పిందట.

ఆ సంగతి అతను పై అధికారులకు చెబితే, నిజానిజాలు పరీక్షించగోరిన వారు, సముద్రంలో వెతకసాగారు. ఎంత వెతికినా విగ్ర హం కానరాలేదు. వారి పనులూ ప్రారంభం కావటం, ఆగి పోవటం జరుగుతూనేవున్నాయి. చివరికి కొందరు నావి కులు సముద్రంలో చేపలు పట్టేందుకు వెళ్లినప్పుడు, మహా భయంకరంగా వర్షం ప్రారంభమైంది. ఆ వర్షంలోనే కృష్ణ మోరే అనే నావికునికి, దేవి మూడు శిరస్సులతో దర్శనమిచ్చింది.

అందరూ తమ ప్రాణాలు కాపాడమని ప్రార్థించిన మీదట, కృష్ణమోరే వేసిన వలలో మూడు విగ్రహాలు లభించాయి.తర్వాత ఆంగ్లేయులు ఆ దేవీవిగ్రహాలను ప్రతిష్ఠాపించి, ఆలయ నిర్మాణం చేయించారు. మంగళవారాల్లో ఈ తల్లికి విశేషంగా పూజలు జరుగుతాయి. నవ దంపతులు ఈ దేవి ఆశీస్సుల కోసం వస్తుంటారు.ముంబయిలోని మహమ్మదీయులకు సైతం, ఈ దేవి పట్ల భక్తిప్రపత్తులు వుండటం మరో విశేషం. ఆలయంలో మహాలక్ష్మి, మహాకాళి, మహా సరస్వతి విగ్రహాలున్నాయి. మూడు విగ్రహాలకు ముక్కు పుడకలతోపాటు, బంగారు గాజులు వజ్ర వైఢూర్యాలతో తయారుచేసిన నగలు వున్నాయి. ముగ్గురమ్మలను చూసిన భక్తులు భక్తి సాగరంలో మునిగిపోవాల్సిందే. ఎవరైతే త్రికరణశుద్ధితో అమ్మవార్లను పూజిస్తారో వారి కోర్కెలు తప్పక నెరవేరతాయని చెప్పబడింది. అమ్మవారిని వీక్షించేందుకు భక్తులు బారులు తీరి వుంటారు. సమయం ఎంతైనా… లక్ష్మీమాతను దర్శించి పూజలొనర్చిన తర్వాతే భక్తులు తిరుగుముఖం పడతారు.

ఎలా వెళ్లాలి..
వాణిజ్య కేంద్రమైన ముంబయికు అన్ని ప్రధాన పట్టణాల నుంచి రైలు, రోడ్డు మార్గాలున్నాయి. ముంబయి చేరుకున్నవారు స్థానిక బస్సులలో ప్రయాణించి అమ్మవారిని దర్శించుకోవచ్చు.
ప్రైవేటు వాహనాలు కూడా అందుబాటులో వుంటాయి.
ఈ టాక్సీలు రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, విమానాశ్రయాలనుంచి కూడా వుంటాయి.

– ఆర్కే

Leave a Reply