Suryaa.co.in

Devotional Places

ధారీదేవి అమ్మవారి ఆలయం ప్రత్యేకత ఇదే..

– ఉదయం బాలికగా.. మధ్యాహ్నం నడివయసు బాలికగా..సాయంత్రం వృద్ధురాలిగా

ఈ గుడిలోని అమ్మవారు ఉదయం బాలికగానూ, మధ్యాహ్నం నడి వయసు మహిళగానూ, సాయంత్రం వృద్ధ స్త్రీ రూపంలోకి మారుతుంది. అత్యంత శక్తివంతమైన ఈ దేవిని భక్తితో కొలిచిన వారిని అనుగ్రహిస్తుంది. ఉత్తరాఖండ్‌లోని గర్వాల్- శ్రీనగర్ ప్రాంతంలో అలకనందా నది ఒడ్డున ప్రాచీన కాలం నాటి ధారీదేవి ఆలయం ఉంది. అలకనందా నదీ ప్రవాహాన్ని ఈ దేవత నియంత్రిస్తుందని ఈ ప్రాంతవాసుల నమ్మకం.

దీనికి కూడా నిదర్శనాలు ఉన్నాయి. ధారీదేవి ఆశీసులతోనే అలకనంద ప్రశాంతంగా ప్రవహిస్తూ భక్తులకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ ఆలయం గురించి మహాభారతంలోనూ ప్రస్తావించారు. సిద్ధపీఠం పేరుతో భాగవతంలోనూ పేర్కొన్నారు. 108 శక్తి పీఠాల్లో ధారీదేవి ఆలయం కూడా ఒకటని దేవీ భాగవతంలో తెలిపారు. ఆదిశక్తి ఉగ్ర అంశం మహాకాళి అవతారమే ధారీదేవి.

భక్తితో కొలిచినవారిని అనుగ్రహించే దేవత. ధిక్కరించిన వారికి అంతే కీడు జరుగుతుంది. క్రీ.శ 1882లో కేదారీనాథ్ ప్రాంతాన్ని ఓ ముస్లిం రాజు పడగొట్టి మసీదు నిర్మించాలని ప్రయత్నించాడు.ఆ రాజు చేసిన అపచారంతో కొండ చరియలు విరిగిపడి కేదారనాథ్ ప్రాంతం నేలమట్టమైపోయింది. ఆ ప్రకృతి విపత్తు వేలాది మందిని బలితీసుకుంది. దేవి మహత్మ్యాన్ని ప్రత్యక్షంగా చూసిన ఆ ఇస్లాం రాజు తన ప్రయత్నాన్ని విరమించుకుని తోకముడిచాడు. అప్పటి నుంచి ఈ ఆలయం జోలికి ఎవరైనా వెళితే ధారీదేవి ఆగ్రహం చవిచూడక తప్పదనే బలమైన విశ్వాసం ఈ ప్రాంతంలో స్థిరపడింది.

2013 మే నెలలో వచ్చిన ఉత్తరాఖండ్ వరదలకు కూడా ఈ దేవి ఆలయాన్ని తొలిగించడమే ప్రధాన కారణం. శ్రీనగర్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించి సమీపంలోని కొండపై ప్రతిష్ఠించింది. ఆ మరుచటి రోజే ఊహించని కుంభవృష్టి కురిసి అలకనంద మహోగ్రరూపం దాల్చి విలయ తాండవం చేయడంతో సుమారు 10 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

గర్వాల్ ప్రాంతంలో అలకనంద నది ఒడ్డున ఈ ధారీదేవి ఆలయం ఉంది. గర్భగుడిలో అమ్మవారి సగభాగం మాత్రమే ఉంటుంది. మిగతా భాగం కాళీమఠ్‌లో ఉంది. ఈ క్షేత్రంలో దేవీ రూపం మారుతుంది. ఉదయం పూట బాలికగానూ, మధ్యాహ్నం నడి వయస్కురాలిగానూ, సాయంత్రం వృద్ధ స్త్రీ రూపంలోకి మారుతూ ఉంటుంది. కాళీమఠ్‌లో నిజానికి అమ్మవారి మిగతా శరీర భాగం ఉండదు. ఆ స్థానంలో ఒక స్త్రీ యంత్రాన్ని పూజిస్తారు. ఆదిశంకరాచార్యులు స్థాపించిన ఈ స్త్రీ యంత్రం అమ్మవారి యోనికి ప్రతిరూపంగా భావిస్తారు. ఈపీఠానికి ఉత్తరదిశలో కేథారనాథ్ జ్యోతిర్లింగం ఉంది.

ఈ ఉత్తరదిక్కుకి అధిపతి బుధుడు. బుధుడు అహింసను ప్రభోదిస్తాడు. ఫలితంగా ఉత్తరదిక్కు నుంచి వచ్చే శాంతి ప్రభావం వల్ల ఆగ్నేయ దిశలో ఉండే కాళీమాత శాంతిస్తుంది. ఈ దిశ యుద్ధానికి, ఆగ్రహానికి, ఆందోళనకి కారకుడైన కుజుడుకి చెందినదని జ్యోతిష్య శాస్త్రం ఉద్ఘాటిస్తుంది.

LEAVE A RESPONSE