Suryaa.co.in

పరమాత్మ ఎక్కడ!?
Devotional

పరమాత్మ ఎక్కడ!?

మనలో భగవంతుడు ఎలా ఉన్నాడు?
ఉన్నా ఎందుకు కనబడుటలేదు?
ఆయన్ని ఎలా దర్శించు కోవాలో శ్వేతాశ్వతరోపనిషత్ తెలియ జేస్తుంది.
తిలేషు తైలం దధినీవ సర్పిరాపః స్త్రోతఃస్వరణీషు చాగ్నిః ।
ఏవమాత్మాఽఽత్మని గృహ్యతేఽసౌ సత్యేనైనం తపసా యోఽనుపశ్యతి ॥
నువ్వులలో నూనె లాగా(తిలతైలన్యాయం), పెరుగులో నెయ్యి లాగా, భూగర్భంలో జలప్రవాహం లాగా, అరణిలో నిప్పు లాగా, బుద్ధిలో పరమాత్మ దాగి ఉన్నాడు.
పరమాత్మ సర్వ వ్యాపకుడు – తిలతైల న్యాయం
పెరుగులో నెయ్యి ఉంటుంది కానీ మధనం చేస్తేనే దొరుకుతుంది. అలాగే పరమాత్మ మనలో, ప్రపంచంలో గూఢముగా ఉంటాడు. అయితే మధనం/సాధన చేస్తే అనుభవానికి వస్తుంది;
సాధన శ్రమపడి చేయాలి. ఈ శ్రమ భూగర్భజల న్యాయంలో చెప్పారు. అంటే భూమిలో నీటిని తెచ్చుకోవడం కోసం ఎంత శ్రమ పడతామో అంత శ్రమ పడాలి.
అరణి న్యాయం – వేదసమ్మతమైన మంత్రములతో అరణి మధనం చేస్తారు. అలాగే పరమాత్మను పొందడానికి వేదాది శాస్త్రములు చెప్పిన మార్గంలోనే సాధన చేయాలి.
సర్వవ్యాపినమాత్మానం క్షీరే సర్పిరివార్పితమ్ ।
ఆత్మవిద్యాతపోమూలం తద్బ్రహ్మోపనిషత్ పరమ్ ॥
క్షీరము నందు నెయ్యి వలె పరమాత్మ కూడా జగత్తు యందు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. నెయ్యి తీసుకోవడానికి పాలను ఎన్ని రకాలుగా మార్చాలో అదేవిధంగా ప్రపంచంలో సాధనతో పరమాత్మను పొందగలము అని చెప్పడం. అటువంటి ఆత్మను తెలుసుకోవడమే ఆత్మవిద్య. ఆత్మవిద్యకు మూలం తపస్సు.
తపస్సు అనగా నియమపాలనం, శాస్త్ర సమ్మతమైన పద్ధతిలో ఆలోచించుట(జ్ఞానమార్గం).
యస్య జ్ఞానమయం తపః – జ్ఞానమే తపస్సు, నియమపాలన తపస్సు. ఈ రెండూ చేస్తేనే ఆత్మవిద్య తెలుస్తుంది. ‘తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ’.
సాధన లేకుండా కేవల కబుర్లతో కాలక్షేపం చేస్తున్నంత కాలం సర్వవ్యాపకమైన బ్రహ్మము అనుభవానికి రాడు.
చూసినంత మాత్రాన నువ్వులలో నూనె కనబడదో, పెరుగులో, పాలలో నెయ్యి కనబడదో, అలాగే మామూలుగా ఆలోచించినంత మాత్రాన భగవంతుడు కనబడడు. కనబడనంత మాత్రాన లేవు అని ఎలా అనలేవో భగవంతుడు కూడా కనబడనంత మాత్రాన లేడు అనకు.
భగవంతుడు ఉన్నాడు అనే భావన ఉంటేనే సాధన.
భగవంతుడు ఉన్నాడు అనే ఎరుక గురువు వల్ల లభించాలి. దానిపై నిలుకడ కలిగిన శ్రద్ధ ఉండాలి. అటువంటి సాధన తపస్సుతో కూడినది అవుతుంది. అది ఆత్మవిద్యను మనకు అందిస్తున్నది.
నిబద్ధత ఉన్నతికి ఆయువుపట్టు
ఒక దృఢసంకల్పానికో, మంచి మాటకో, సిద్ధాంతానికో కట్టుబడి ఉండటమే ‘నిబద్ధత’. మనో వాక్కాయకర్మలతో నిరంతరం ఆ సత్సంకల్పాన్ని ఆచరించడం నిమగ్నం కావడమే నిబద్ధత అనిపించు కుంటుంది.ప్రతి మనిషీ ఏదో ఒక విషయంలోనో, కొన్ని విషయాల్లోనో నిబద్ధుడై ఉంటాడు. అప్పుడే ఆయా పనుల్లో విజయం సాధించగలుగుతాడు ఆధ్యాత్మిక సంపన్నులెవ్వరూ తాము ఏర్పరచుకున్న నియమ నిబంధనలను అతిక్రమించరు. విస్మరించరు. నిబద్ధులైనవారికి,, ఆత్మవిశ్వాసం ఎల్లవేళలా తోడుంటుంది. వారికెప్పుడూ నిరాశా నిస్పృహలు కలగవు. పైగా అంతర్యామికి అధీనులై ఆత్మ సమర్పణ భావంతో, సర్వదా చైతన్యమూర్తులై ఉంటారు. నారాయణుడే వారికి నమ్మకం. నారాయణ శరణాగతే వారి ఆశయం.
నిబద్ధత లేనివాడి మనసు
చాంచల్యమనే బలహీనతకు బానిసైపోతుంది. అటువంటివాణ్ని కామక్రోధాది అరిషడ్వర్గాలు ఆవరించి అధఃపాతాళానికి తొక్కేస్తాయి. వాడు భూమికి భారమై చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు.ఆధ్యాత్మిక నిబద్ధత లేని జీవితం కవచం లేకుండా యుద్ధానికి వెళ్లడంలాంటిది. ఒక సత్సంకల్పం, దాన్ని ఆచరించే ప్రణాళిక, ఆచరణలో ఏకాగ్రత, సాధన… మనిషిని అసలైన నిబద్ధుడిగా నిలబెడతాయి. బాధలు అనే మదపుటేనుగును సైతం లొంగదీసుకునే అంకుశమే నిబద్ధత. సత్సంకల్పం మీద నమ్మకం లేనివాడు, దానికి కట్టుబడనివాడు సమస్యల్ని అధిగమించలేడు.
నిజాయతీపరుడు, నిబద్ధతతో జీవించగలిగితే ఆధ్యాత్మికంగా ఉచ్చదశకు చేరుకో గలుగుతాడు. పదిమందికీ దిశానిర్దేశం చేయగలుగుతాడు. ఏ ఓటమైనా అతడి ముందు చేతులు కట్టుకు నిలబడుతుంది. నిబద్ధత లేని జీవన విధానం జీనులేని గుర్రంలాంటిది. జీవితమన్నాక ఎన్నో ఒడుదొడుకులు వస్తుంటాయి. అవరోధాలు కలుగుతాయి.బాధలు ఎదురవుతాయి. అవన్నీ భగవంతుడు పంపిన దూతలనుకొని, వాటిని గౌరవించాలి, భరించాలి, సహించాలి. స్థితప్రజ్ఞుడు నిబద్ధతతో సుఖ దుఃఖాలను, విజయాలను, విఘ్నాలను, సమానంగానే చూస్తాడు, అనుభవిస్తాడు. సుఖాన్నిచ్చే వస్తువు దగ్గర ఉన్నా లేకపోయినా, తేడా అనేది తెలీదు నిబద్ధుడైనవాడికి. అటువంటి వాడు పరమాత్మకు అత్యంతప్రియుడు, ఆత్మీయుడు. సత్కార్యం పట్ల శ్రద్ధ, ప్రేమ ఉన్నవాడిని ఏ మనో వికారమూ ప్రలోభపెట్టలేదు.
సామాన్య మానవుడు దుఃఖంలో వెనక్కి, కష్టంలో అన్ని వైపులా, భక్తిలో పైకి చూస్తాడు. నిబద్ధత కలవాడు ఏ దశలోనైనా పై దిశకే చూస్తాడు. అంటే ఈశ్వరుడి వైపు చూస్తాడన్నమాట.పురాణేతిహాసాల్లో చాలా పాత్రల్లో మనకు ఈ నిబద్ధత కనిపిస్తుంది. ధర్మానికి నిబద్ధుడు శ్రీరాముడు. భ్రాతృ భక్తికి నిబద్ధులైనవారు లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు. దాస్య భక్తికి, కట్టుబడినవాడు హనుమ. స్వామిభక్తికి లోనైనవాడు కర్ణుడు. బ్రహ్మచర్య దీక్షకు జీవితాన్ని ధారపోసినవాడు భీష్ముడు. సత్యానికి జీవితం అంకితం చేసిన మహనీయుడు హరిశ్చంద్రుడు.
దానగుణానికి ప్రసిద్ధి చెందినవారు శిబి, దధీచి, బలి. సాధ్వీమణులంతా పతిసేవా పరాయణత్వంతో ఆదర్శమూర్తులైనారు. ప్రేమ, వాత్సల్యం, బంధానుబంధాలు, సత్సాంగత్యం, గురుభక్తి, అహింస, పరోపకార చింతన, నిస్వార్థం, నిరహంకారం, జ్ఞానతృష్ణ నిబద్ధుడికి ఉండవలసిన ప్రధాన లక్షణాలు. అతడిలో ఏ దుర్లక్షణం ప్రవేశించినా కుండెడు తేనెలో విషపు చుక్క వేసినట్లే. ఇందుకు రావణుడే ప్రత్యక్ష తార్కాణం. నిరంతర సాధన, ఏకాగ్రత, శ్రద్ధ, పట్టుదల సత్సంకల్ప సాధనకు మనిషి లోకిక. ఆధ్యాత్మిక ఉన్నతికి ఎంతో దోహదం చేస్తాయి… అన్నిటా విజయాన్ని చేకూరుస్తాయి.

LEAVE A RESPONSE